Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల, విజయబాబులపై కఠిన చర్యలు తీసుకోవాలి

-సజ్జల, విజయబాబులకు ఎన్నికల కోడ్ వర్తించదా?
-ప్రజా ధనం జీతంగా తీసుకుంటూ ప్రతిపక్షాలపై పుస్తకాలు వేస్తారా?
-అవినీతి సొమ్ముతో ఏర్పడ్డ వైసీపీలో ఉంటూ ఎదుటి వారిపై నిందలు వేయడం హాస్యాస్పదం
-డిశ్చార్జి పిటిషన్లు మాని విచారణకు హాజరై జగన్ రెడ్డి సచ్చీలుడని నిరూపించుకోవాలి
-నిజంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సజ్జల, విజయబాబులపై కఠిన చర్యలు తీసుకోవాలి
– మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

తన మహా దోపిడీని చంద్రబాబకు అంటగట్టి, చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్పించడం జగన్ రెడ్డి, అతని తాబేదార్ల నైజమని తెలుగుదేశం పోలీట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై నిరాధార నిందలతో రాసిన పుస్తకంపై ఆయన మండిపడ్డారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆనందబాబు మాట్లాడుతూ.. ప్రజా ధనంతో జీతం తీసుకుంటూ చంద్రబాబుపై అసత్య ఆరోపణల పుస్తకాన్ని రాయడం, దాన్ని ప్రభుత్వ సలహాదారుడు విడుదల చేయడం సిగ్గు చేటని విమర్శించారు. లక్షల కోట్లు దోపిడీ చేసి కిరాయి మనుషులతో చంద్రబాబుపై జగన్ రెడ్డి అసత్య ప్రచారం చేయిస్తున్నాడని, ఎన్నికల నిమయావళిని ధిక్కరిస్తూ ప్రతిపక్షనేతపై అసత్య ఆరోపణలు చేసినందుకు గాను వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, ప్రభుత్వ పదవుల నుండి వెంటనే తొలంగించాలని ఆనందబాబు ఎన్నికల కమిషన్‌ను కోరారు.

5 ప్యాలెస్సులు ఉన్న జగన్ రెడ్డి పేదవాడా?
“సిఐడి పెట్టిన కేసులో చంద్రబాబు ఏ తప్పు చేయలేదని కోర్టు విశ్వసించి బెయిల్ మంజూరు చేసింది. పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ రెడ్డికి అధికారికంగా 16 కంపెనీలు, అనాధికారంగా 50కి పైగా స్యూట్ కేసు కంపెనీలు ఉన్నాయి. ఆంధ్ర ప్రజలకు తెలియని స్యూట్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్, హవాలా వంటి పదాలు జగన్ రెడ్డి వల్ల ఇప్పుడు తెలిశాయి. 5 ప్యాలెస్‌లు కట్టుకొని విలాసంగా కులుకుతున్న జగన్ రెడ్డి పేదవాడా? జగన్ రెడ్డి ప్యాలెస్సుల్లో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. 2004 రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాక ముందు ఇళ్లు అమ్మకునే పరిస్థతిలో జగన్ రెడ్డి కుటుంబం ఉంది. తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రూ.43 వేల కోట్లు జగన్ రెడ్డి దోపిడీ చేశాడని ఆధారాలతో సహా సిబిఐ 12 ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి అరెస్ట్ చేసింది. జైలు నుంచి జగన్ రెడ్డి బయటకు వచ్చి 10 ఏళ్ళు దాటింది. ఇప్పటి వరకు 3,700 వాయిదాలు తీసుకున్నాడు. జగన్ రెడ్డి నిజంగా సచీలుడైతే విచారణకు సహకరించి నిర్ధోషని నిరూపించుకోవచ్చు కదా! జగన్ రెడ్డి విచారణకు సహకరించి ఉంటే ఎప్పుడో జైలు పాలయ్యేవాడు” అని అన్నారు.

ఐదేళ్ళలో రూ.8 లక్షల కోట్లు జగన్ రెడ్డి దోచుకున్నాడు…
“ఇరిగేషన్ శాఖలో మేము ఖర్చు చేసింది రూ.58 వేల కోట్లు. 23 ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీరు అందించాం. పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేసాం. కానీ రూ.56 వేల కోట్లు పైన అవినీతి జరిగిందని విజయబాబు తప్పుడు రాతలు రాశారు. పైగా కుహాన రాజకీయవేత్తలని జయప్రకాష్ నారాయణను, రామోజీరావు లాంటి వారిని తిడుతున్నారు. అసలు నిజమైన కుహాన మేధావి విజయబాబు. విధులను మరిచి విజయబాబు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారు. జగన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకొని, కిరాయి మనుషులతో చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నాడు. లిక్కర్ స్కామ్‌లో రూ.1.5 లక్షల కోట్లు, అసైన్డ్ భూ కుంభకోణంలో రూ.లక్ష కోట్లు, ఇండోసోల్ కుంభకోణంలో రూ.75 వేల కోట్లు, టీడీఆర్ బాండ్‌ల కుంభకోణంలో రూ.50 వేల కోట్లు ఇలా అన్నీ రంగాల్లో కలిపి రూ.8,03,100 కోట్లు జగన్ రెడ్డి ప్రభుత్వం దోచుకుంది. అమరావతిలో లక్ష కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించి ఇప్పటివరకు ఒక్క రూపాయి అవినీతిని కూడా నిరూపించలేకపోయారు. తప్పుడ సమాచారంతో ప్రజలను తప్పు ద్రోవ పెట్టి అధికారంలోకి రావాలని చౌక బార విమర్శలు చేస్తున్నారు”అని మండిపడ్డారు.

అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రులలో జగన్ రెడ్డి నెం.1…
దేశంలో అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రుల ఫోటోలను పుస్తకంలో ప్రచురించారు. కానీ రూ.43 వేల కోట్లు దోపిడీ చేసి, 16 నెలలు జైల్లో ఉండి, 10ఏళ్ళ నుంచి బెయిల్ మీద బయట తిరుగుతున్న జగన్ రెడ్డి ఫోటోను, దోపిడీలకు సహకరించిన జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఫోటోను వేయడం విజయబాబు మరిచిపోయాడు అనుకుంట! తండ్రిని ముద్దయిగా జగన్ రెడ్డి పెట్టించాడు. బాబాయి వివేకా రక్తపు మడుగుల మీద వైకాపా పునాదులు ఏర్పడ్డాయని స్వయానా జగన్ రెడ్డి చెల్లి చెబుతోంది. అటువంటి వ్యక్తికి వత్తాసు పలుకుతూ ఎన్నికల నియామవళిని ధిక్కరించిన అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డిలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. జగన్ రెడ్డి చేసిన కుంభకోణాలపై చర్చలకు మేము సిద్ధం. మీరు ప్రచురించిన పుస్తకంలో ఒక్కటైనా నిరూపించగలరా?” అని సవాల్ చేశారు.

LEAVE A RESPONSE