– వ్యవసాయ రంగం వైపు కూడా యువత రావాలి
– అది పాఠశాల స్థాయి నుంచే బీజం పడాలి
– విద్యా వైజ్ఞానిక సదస్సులో ఎమ్మెల్యే పరిటాల సునీత
– 6మంది విజేతలకు లక్ష రూపాయలు ప్రకటించిన ఎమ్మెల్యే సునీత
– రాప్తాడు మోడల్ స్కూల్ అభివృద్ధికి ఎంపీ అంబికా 5లక్షల నిధులు
– రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు : చదువంటే కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే కాదని.. ఇంకా చాలా రంగాల్లో రాణించే అవకాశం ఉంటుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రం సమీపంలోని మోడల్ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, పరిశోధన శిక్షణా సంస్థ, సమగ్రశిక్ష వారు నిర్వహించిన అనంతపురం జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన – 2025లో ఆమె పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహించిన విద్యా వైజ్ఞనిక ప్రదర్శన విజేతలుగా నిలిచిన మండలానికి ముగ్గరు చొప్పున ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించారు. వీరిలో 6మంది విజేతలకు ప్రకటించారు. ఈ 6మందిలో ఇద్దరు రాష్ట్ర స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలను ఎమ్మెల్యే సునీత అధికారులతో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 6మంది విజేతలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఏదైనా పోటీల్లో పాల్గొంటే మన శక్తి మేర కష్టపడి మన ప్రతిభ చూపాలని.. జయాపజయాలు వస్తుంటాయి పోతుంటాయని.. కానీ పట్టుదల, శ్రమను మాత్రం విస్మరించవద్దన్నారు. ఒకప్పుడు తాను అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని.. ఆ రోజు భర్తను కోల్పోయి, పిల్లలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో కఠినమైన పరిస్థితుల్ని చూశానన్నారు. అప్పుడు కష్టాలు తట్టుకున్నాను కాబట్టే ఈ రోజు నిలబడ్డానన్నారు.
మరోవైపు విద్యార్థులు చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలని సూచించారు. ఏదో కష్టపడి చదివితే సాఫ్ట్ వేర్ ఇంజనీరో, డాక్టరో కావచ్చన్న అభిప్రాయం చాలా మందిలో ఉందన్నారు. చదువంటే అవి రెండే కాదని.. ఇంకా చాలా రంగాల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా వ్యవసాయం గురించి మనం తినే తిండి గింజలు ఎలా వస్తాయో కూడా యువతకు తెలియకుండా పోతోందన్నారు. అందుకే వ్యవసాయం రంగం గురించి ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. వ్యవసాయంలో రాణిస్తే.. ఉన్నత ఉద్యోగాల కంటే ఎక్కువ సంపాదించవచ్చన్నారు.
విద్యా వైజ్ఞానికి సదస్సులో గెలుపొందిన 6మంది విద్యార్థులకు పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ తరుఫున లక్ష రూపాయలు అందిస్తున్నట్టు ఎమ్మెల్యే సునీత తెలిపారు. మోడల్ స్కూల్లో నెలకొన్న సమస్యల్ని ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కాంపౌండ్ వాల్, సీసీ రోడ్డు, కారిడార్లో కొత్తగా బండలు వేయించడం, ఆట స్థలం చదును చేయించడం, హాస్టల్ రూములు, టాయిలెట్స్ రిపేరి వంటివి ఉన్నాయన్నారు.
పాఠశాలకు అవసరమైన నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ గారితోపాటు ఎంపీ అంబికా గారిని కోరగా.. ఆయన వెంటనే ఎంపీ ల్యాడ్స్ నుంచి 5లక్షలు రూపాయలు ప్రకటించారు. ఎంపీకి ఎమ్మెల్యే సునీత ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు కలెక్టర్, ఎంపీ గార్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.