– ఇప్పటివరకు 7 జాబితాలో ప్రకటించిన వారు సమన్వయకర్తలే
– వాళ్లు అభ్యర్థులు కారని స్పష్టం
– అద్దంకి సిద్ధం సభకు జనం తరలింపుపై ఇన్చార్జిల నిరాసక్తత
– ఇప్పటిదాకా పెట్టిన ఖర్చుల సంగతేమిటన్న ప్రశ్నలు
మేదరమెట్లలో ఆఖరి సిద్ధం సభలో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడించిన సుబ్బారెడ్డి వైసీపీ ఇన్చార్జిల పక్కలో బాంబు పేల్చారు. టికెట్లు దక్కక పక్క పార్టీల వైపు చూస్తున్న నేతలు వైసీపీలో ఉండేందుకే సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీటు మాదే అనుకొని డబ్బు ఖర్చు పెడుతున్న నేతలు, ఈ వ్యాఖ్యలపై అయోమయంలో పడ్డారు. చివరి నిమిషంలో సీటు వేరే వాళ్లకు ఇస్తే మా పరిస్థితి ఏంటని గగ్గోలు పెడుతున్నారు.
సుబ్బారెడ్డి తాజా ప్రకటనతో.. సీఎం-పార్టీ అధినేత జగన్ సిద్ధం సభకు వేదిక కానున్న అద్దంకి సభ విజయవంతం ఆందోళనలో పడింది. ఇంత ఖర్చు చేసినా, తాము అభ్యర్ధులం కాదని సుబ్బారెడ్డి స్పష్టం చేయడంతో.. మళ్లీ అద్దంకి సభకు లక్షలు ఖర్చు పెట్టడం ఎందుకన్న భావన, నియోజకవర్గ ఇన్చార్జులలో మొదలయింది. తమ వరకూ సభకు వెళితే సరిపోతుందని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
దీనితో కేవలం రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే వ్యూహంతోనే ఇన్చార్జిల ప్రకటన చేశారన్న వైసీపీ నేతల అనుమానాలు, సుబ్బారెడ్డి ప్రకటనతో నిజమయ్యాయి. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్ధులూ పోటీ లేకుండానే గెలిచినందున, ఇక నిర్భయంగా ఇన్చార్జిలను మార్చవచ్చన్న ధీమా నాయకత్వంలో వచ్చినట్లు సుబ్బారెడ్డి మాటల్లో స్పష్టమవుతోంది.
ఒకవైపు టీడీపీ-జనసేన ఒకేసారి 118 స్థానాల్లో తమ అభ్యర్ధులను ప్రకటించింది. కానీ తమ పార్టీ మాత్రం ఇప్పటిదాకా 7 జాబితాలు ప్రకటించినప్పటికీ, తమను అభ్యర్ధులుగా కాకుండా నియోజకవర్గ ఇన్చార్జులుగా ప్రకటించడంపై వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఒకవైపు టీడీపీ-జనసేన ఒకేసారి 118 స్థానాల్లో తమ అభ్యర్ధులను ప్రకటించింది. కానీ తమ పార్టీ మాత్రం ఇప్పటిదాకా 7 జాబితాలు ప్రకటించినప్పటికీ, తమను అభ్యర్ధులుగా కాకుండా నియోజకవర్గ ఇన్చార్జులుగా ప్రకటించడంపై వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
టీడీపీ-జనసేన పాటి ధైర్యమేదంటున్న సీనియర్లు
ఈ విషయంలో టీడీపీ-జనసేనకు ఉన్న ధైర్యం మా పార్టీకి లేకుండా పోయిందని ఇన్చార్జిలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్న పార్టీలే ధైర్యంగా 118 సీట్లకు అభ్యర్ధులను ప్రకటిస్తే, అధికారంలో ఉండి సంక్షేమపథకాలకు బటన్ నొక్కుతున్న మా పార్టీకి ధైర్యం లేకపోవడం ఆశ్చర్యం. అంటే మా నాయకత్వం మమ్మల్ని నమ్మడం లేదని అర్ధమవుతూనే ఉంది’’ అని బాపట్ల జిల్లాకు చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.