-తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సర్వే దేశానికి రోల్ మోడల్
-రైతుల నుంచి బలవంతంగా ప్రజా ప్రభుత్వం భూములను లాక్కోదు
-గాంధీభవన్ లో జరిగిన టిపిసిసి విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం. 10 నెలల కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ శ్రేణులు గర్వంగా ఇంటింటికి తీసుకువెళ్లి చాటి చెప్పాలి. 10 నెలల కాలంలో దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా ప్రజా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు- అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి బిఆర్ఎస్, బిజెపి చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిప్పి కొట్టాలి.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానేఅసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని అమలు చేశాము. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ప్రయాణిస్తున్న రవాణా డబ్బులను ప్రజా ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతి నెల రూ.400 కోట్లు చెల్లిస్తున్నది. మార్చి నెల నుంచి 200 యూనిట్స్ లోపు గృహ విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నాము.
రైతులకు అందిస్తున్న ఉచిత కరెంటు, పేదలకు అందిస్తున్న విద్యుత్తు సబ్సిడీ సంబంధించిన డబ్బులను ప్రతినెల ప్రభుత్వం రూ. 1150 కోట్లు భరిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రూ. 500 గ్యాస్ సిలిండర్ తో కాంగ్రెస్ పార్టీ వంట గదిలోకి కూడా వెళ్ళింది.
ఒక కుటుంబానికి సంవత్సరంలో కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోవడానికి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని పది లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడికి గుండె ధైర్యాన్ని ప్రజా ప్రభుత్వం కల్పించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమల్లో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు 4 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణం చేసి ఇస్తాము. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు ఇస్తాము.
గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి గత ఏడాది కేవలం రూ. 70 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాం.
దశాబ్ద కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బిఆర్ఎస్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారం అందించాలన్న సోయిలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులతో కమిటీ వేసి నివేదిక తెప్పించుకొని హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీలు 40% పెంచిన ఘనత మన ప్రభుత్వానిది.
గత బిఆర్ఎస్ పాలకులు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సిటీ లను తలదన్నే విధంగా ప్రజా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా అన్ని హంగులు, అన్ని వసతులు ఉండే విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తాం.
హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం మూసి పునర్జీవం చేపట్టింది. హైదరాబాద్ నగరం గుండా 55 కిలోమీటర్ల మేర వెళ్తున్న మూసి కి పునర్జీవం తీసుకురావడానికి ప్రణాళికలు తయారు చేసి ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి. అమాయకులైన పేద ప్రజలను రెచ్చగొట్టి మూసి పునర్జీవం కాకుండా బిఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయి.
మూసీ పరివాహక ప్రాంతంలో బ్రతుకుతున్న ఎవరిని బయటకు పంపము, అందరినీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తాం, ఇండ్లు కోల్పోయిన వారికి మూసి అభివృద్ధి చేసుకున్న తర్వాత అక్కడే మళ్ళీ ఇండ్లు కట్టించి ఇస్తాం. మూసి పునర్జీవం విషయంలో ప్రజలకు వాస్తవాలు వివరించి, కుట్రపూరితంగా బిజెపి, బిఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఎండగట్టాలి.
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా నిలదుక్కోవడానికి ప్రవేశపెట్టిన ఇందిరా క్రాంతి పథకాన్ని గత బిఆర్ఎస్ పాలకులు నిర్వీర్యం చేశారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు వడ్డీ లేని రుణాలు పావలా వడ్డీ రుణాలు ఇచ్చిన పాపాన పోలేదు. ప్రజా ప్రభుత్వ అధికారంలోకి రాగానే మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి ప్రతి సంవత్సరం వడ్డీ లేకుండా 20 వేల కోట్ల రుణాలు ఇస్తున్నాం.
రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా ప్రజా ప్రభుత్వం పవర్ ప్లాంట్ ప్రాజెక్టుల్లో మహిళలను భాగస్వామ్యం చేసింది. దశాబ్దాల పాటు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నదే కొలువుల కోసం, కానీ గత పది సంవత్సరాలు నిరుద్యోగ యువత ఆశలను అడియాశలు చేసిన బిఆర్ఎస్ పాలకులు.
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పాలకులు ఒక్కసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసి పరీక్ష ప్రశ్న పత్రాన్ని లీకేజ్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాం.
కేవలం 10 నెలల్లోనే రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు కేవలం 15 రోజుల్లో ఒకే సారి రూ. 18 వేల కోట్లు రుణమాఫీ చేశాం. ఐదు సంవత్సరాలు పాటు లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేని గత బిఆర్ఎస్ పాలకులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని విమర్శలు చేయడం విడ్డూరం.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును- రీజనల్ రింగ్ రోడ్ను కలుపుతూ ఇండస్ట్రియల్ క్లస్టర్లు, రెసిడెన్షియల్ గృహాలను నిర్మించబోతున్నాం. సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా సమాజంలో ఇప్పుడు ఉన్న ఏ వర్గాలు నష్టపోయాయి? వారిని సమానత్వంలోకి తీసుకురావడానికి ఎక్స్ రే లాగా కుల గణన సర్వే జరగాలని ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రకటన చేసినట్లుగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి 80 వేల మంది ఎన్యుమరేటర్లతో రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వేను విజయవంతంగా నిర్వహిస్తున్నాం.
తెలంగాణ రాష్ట్రంలో కుల గణన సర్వే పూర్తి కావడం కాంగ్రెస్ పార్టీ విజయంగా భావించాలి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సర్వే దేశానికి రోల్ మోడల్ కాబోతున్నది. కుల గణన సర్వే జరిగితే బిజెపి, బీఆర్ఎస్ పాలకులు చేసిన పాపాలు, వారి లోపాలు బయటపడతాయన్న భయంతోనే సర్వే గురించి చెడు ప్రచారం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్ చేసి పేదలకు పంచిన భూములను ఇబ్రహీంపట్నంలో పదివేల ఎకరాలకు పైగా బలవంతంగా గుంజుకొని హెచ్ఎండిఏ ద్వారా లేఅవుట్ చేసి అమ్ముకున్న(గత బిఆర్ఎస్ పాలకులు) దుర్మార్గులు లగచర్లలో వల్ల రైతులకు అన్యాయం జరిగిందని మాట్లాడటం విడ్డూరం.
ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు మేలు జరగొద్దని చేసే కుట్ర దారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని కుట్రపూరితంగా కలెక్టర్ స్థాయి అధికారిపై దాడి చేయించారు. గత బిఆర్ ఎస్ పాలకుల మాదిరిగా రైతుల నుంచి బలవంతంగా ప్రజా ప్రభుత్వం భూములను లాక్కోదు.
ఆనాటి కాంగ్రెస్ పాలకులు అసైన్ చేసి పేదలకు పంచిన భూములను గత బి ఆర్ ఎస్ పాలకులు బలవంతంగా గుంజుకున్న వాటిని తిరిగి రైతులకు అప్పగిస్తామన్న మాటకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది.