Home » టీడీపీ రైతులకు పెద్దపీట

టీడీపీ రైతులకు పెద్దపీట

-వైసీపీ పాలనలో రైతుకు దగా
-తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

మంగళగిరి : టీడీపీ రైతులకు పెద్దపీట వేస్తుందని, కూటమి అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు కృషి చేస్తుంది, రైతులకు పెట్టుబడి సాయం సంవత్సరానికి రూ. 20 వేలు అందించి ఆదుకుంటుందని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. గడచిన ఐదేళ్లలో వైసీపీ రైతులను దగా చేసిందని ఆయన మండిపడ్డారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమికి వ్యవసాయం, రైతుల గురించి స్పష్టమైన అవగాహన ఉంది. ప్రస్తుతం విడుదల చేసిన టీడీపీ కూటమి మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. 13 వ తేదిన జరగబోయే ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. రైతాంగానికి ఏం చేయాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తెలుసు. వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ది చేయాలో కూటమికి బాగా అవగాహన ఉంది.

రైతుకు అండగా ఎలా నిలవాలి అనే అలోచనతో కూటమి ముందుకు వెళ్తోంది. రైతును ఎలా గెలిపించాలో టీడీపీ కి బాగా తెలుసు. గతంలో వ్యవసాయాన్ని ఎలా నిలబెట్టాలి అనే అంశాలపై లోతైన పరిశీలన చేసిన వ్యక్తి చంద్రబాబు. జగన్ అవగాహన లోపం, బాధ్యతా రాహిత్యంతో వ్యవసాయ రంగం కుదేలైంది. మళ్లీ రైతులకు పూర్వ వైభవం తేవాలన్నదే చంద్రబాబు సంకల్పం.

అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ రైతులకు అండగా ఉండేలా హామీలిచ్చింది. పాడి పంటలకు తోడుగా ఉంటామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పంటకు తోడుగా పాడి ఉండాలి. నేడు పాడి కుటుంబ పోషణలో, పిల్లల చదువులో పెద్ద ఎత్తున తోడ్పాటునందిస్తోంది. అలాంటి పాడిని అభివృద్ధికి తోడ్పాటునందించిన ప్రభుత్వం టీడీపీ. టీడీపీ హయాంలో పశువుల కొనుగోలుకు రుణాలు మంజూరు చేశారు.

నాణ్యమైన పాల దిగుబడికి టీడీపీ ప్రభుత్వం సహకరించింది. టీడీపీ హయాంలో ప్రభుత్వ సహకారం అందిచడంతో రైతులు పశువులను కొనుగోలు చేసుకునేవారు. పాడి రంగాన్ని టీడీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసింది. టీడీపీ హయాంలో నాణ్యమైన దాన, పశువైద్యం, సబ్సిడీతో మందులు, గోకులాలు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటునందించారు. గోశాలలు, గోపాల మిత్రలను రిక్రూట్ చేసి పశువుకు వైద్యం అందేలా చూశారు. ఈ వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు పాడి రంగం మరుగునపడింది. గ్రామ సీమల్లో వెలుగులు నింపాలన్నదే చంద్రబాబు ఉద్దేశం. దీన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చాలా స్పష్టంగా తెలిపింది.

వైసీపీ పాలనలో భూసార పరీక్షలు మచ్చుకకు కూడా కానరావడంలేదు. టీడీపీ మైక్రో ఇరిగేషన్ కు సబ్సిడీని అందించి రైతులకు ప్రోత్సాహం ఇచ్చింది. వైసీపీ హయాంలో వ్యవసాయ భూములు బీడు భూములుగా మారాయి. నాడు జలసిరి ద్వారా బోర్లు వేయించి రైతులను ఆదుకున్నారు. 5 లక్షల సోలార్ పంపు సెట్లు బోర్లకు అందించారు. 13 లక్షల ఎకరాల భూములకు మైక్రో ఇరిగేషన్ ద్వారా నీరు అందించిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు హయాంలో 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ను అందించారు. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే చంద్రబాబు ధ్యేయం. చంద్రబాబు విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉన్నారు.

వైసీపీ పాలనలో రైతు దగా పడ్డాడు. మోసపోయాడు. వైసీపీ దగా, మోసాలనుండి టీడీపీ రైతాంగాన్ని ఆదుకుంటుంది. ఇవన్నీ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 68 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసింది. ఉన్న 32 లక్షల ఎకరాలకి నీటిని స్థిరీకరించారు. అదనంగా 7 లక్షల ఎకరాలకు నీటి సరఫరా సౌకర్యం కల్పించారు. వైసీపీ ప్రభుత్వం అదనంగా ఒక్క ఎకరాకి కూడా నీరు అందించలేదు. ఉన్న ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతే కనీసం మరమ్మత్తులు కూడా చేయలేకపోయింది.

టీడీపీ నేతృత్వంలోని కూటమి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చెప్పింది. ఉత్తరాంధ్రలోని వంశధార నాగావళి నదుల అనుసంధానం మొదలుకొని వంశధార ప్రాజెక్టు, వంశధార రెండవ దశని, తోటపల్లి ఆధునీకరణ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టుకు నీరు సమృద్ధిగా ఉంటుంది.

అప్పుడు శ్రీశైలం నుండి దిగువకు అవసరమైన నీటిని రాయలసీమకు తరలించి రాయలసీమను రత్నాల సీమగా మారుస్తాం. రెండవ దశలో ఉన్న గాలేరు నగరి రెండవ దశ ఉన్నదాన్ని ఆధునీకరించి నీటిని విడుదల చేయనున్నట్లు తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి వివరించారు

Leave a Reply