Home » వెంకట్రామిరెడ్డికి బుద్ధి చెప్పండి

వెంకట్రామిరెడ్డికి బుద్ధి చెప్పండి

-వందల కోట్లు ఇవ్వబట్టే ఆయనకు సీటు
-తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్టే కేసీఆర్‌ బస్సు యాత్ర
-ఓట్ల కోసం బీజేపీ దేవుళ్ల రాజకీయం
-ఇందిర హయాంలోనే మెదక్‌ పారిశ్రామికాభివృద్ధి
-పదేళ్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌ పాలనలో మగ్గిపోయింది
-నర్సాపూర్‌ జనజాతర సభలో రేవంత్‌రెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జరిగిన నర్సాపూర్‌ జనజాతర బహిరంగ సభలో సీఎం రేవం త్‌రెడ్డి ప్రసంగించారు. మండుటెండల్లో, మంచు కొండల్లో పాదయాత్ర చేసిన నాయకుడు రాహుల్‌గాంధీకి స్వాగతం. దేశ చరిత్రలో మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి గొప్ప పేరుంది.

1980లో ఇందిరాగాంధీ బరిలోకి దిగి అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రధాని అయ్యారు. మెదక్‌ పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. మెదక్‌ పార్లమెంట్‌లో వేలాది పరిశ్రమలు వచ్చాయి. ఇందిరాగాంధీ మెదక్‌ ఎంపీగా ఉన్నప్పుడే మరణించారు. గత పదేళ్లుగా బీఆర్‌ఎస్‌, బీజేపీ చేతిలో ఈ ప్రాంతం మగ్గిపోయింది. బలహీన వర్గాల బిడ్డ నీలం మధుకు మెదక్‌ అభ్యర్థిగా అధిష్టానం అవకాశం ఇచ్చింది. దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్‌రావు కేంద్రం నుంచి నిధులు తెస్తానని చెప్పి మోసం చేశాడు.

మల్లన్నసాగర్‌లో వేలాది మంది రైతుల భూము లను ముంచింది బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. మన భూములు గుంజుకుని ఆధిపత్యం చెలాయిస్తున్న వెంకట్రామిరెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రాంతంపైన ఉంది. వెంకట్రామిరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మళ్లీ ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. వందల కోట్లు ఇస్తున్నాడు కాబట్టే కేసీఆర్‌, హరీష్‌రావు కరీంనగర్‌ నుంచి వెంకట్రామిరెడ్డిని తెచ్చి నిలబెట్టారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నాయకుడే లేడా? అని ప్రశ్నించారు.

ఎస్సీ వర్గీకరణ కోసం, ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చడం కోసం, రిజర్వేషన్ల రద్దుపై కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు నీలం మధును లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీకి ఎన్నికలప్పుడే రాముడు, హనుమాన్‌ జయంతి, బతుకమ్మ పండుగలు గుర్తుకు వస్తాయి. వారు మనకు సంప్రదాయాలు నేర్పుతున్నారు. ఓట్ల కోసం రాముడు, హనుమాన్‌ను వాడుకుంటున్నారు. కేసీఆర్‌ బస్సు యాత్ర చూస్తుంటే తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్టే ఉందని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుకు డిపాజిట్‌ గల్లంతు కావడం ఖాయమని అన్నారు.

Leave a Reply