Suryaa.co.in

Features

గురువులూ…మన్నించండి…

మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అనే గొప్ప దేశం మనది. ఎక్కడ ఉపాధ్యాయులు గౌరవించబడతారో, ఆ సమాజంలో ప్రజలలో సభ్యత, సంస్కారం అంతగా విరాజిల్లుతాయి. తల్లిదండ్రుల తరువాత గురువులను గౌరవించే సంస్కార సమాజం మనది. ఇప్పటికీ ఆ సంస్కృతి బలీయంగానే ఉంది. అనేక మంది సీనియర్‌ సిటిజన్లుగా ఉన్నవారు కూడా, పూర్వ విద్యార్ధుల సమ్మేళనాలలో తమకు చిన్నతనంలో పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను సన్మానించడం, తమ ఉన్నతికి వారు వేసిన పునాది గురించి నెమరు వేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే, విచిత్రంగా ఆ గురువులనే లక్ష్యంగా పెట్టుకుని, వారిపై తీవ్ర ఆంక్షలు విధించే స్థితి నేడు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది.

పాఠశాలలు మూసివేయవద్దని, విలీనాల పేరున పాఠశాలలను విద్యార్ధులకు దూరం చేయొద్దని, సంస్కరణల పేరున విద్యా వ్యవస్థను బలహీన పరచవద్దని అడిగిన నేరానికి ఉపాధ్యాయులపై జగన్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. గతంలో ప్రభుత్వాలకు, ఉపాధ్యాయ సంఘాలకు వివిధ సందర్భాలలో అభిప్రాయ బేధాలొచ్చినా, వాటిని చర్చల ద్వారా, సామరస్యంగా పరిష్కరించుకున్న ఉదాహరణలున్నాయి. కానీ, ఇలా ప్రభుత్వమే కర్కశంగా వ్యవహరించిన తీరు ఎన్నడూ చూడలేదు.

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సిపిఎస్‌ రద్దు వంటి, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమిస్తున్న ఉపాధ్యాయులను అక్రమ అరెస్టులు చేయించడం, గృహ నిర్బంధాలకు పాల్పడడం, బైండోవరు కేసులు పెట్టడం, పాఠశాలల వద్ద కూడా పోలీసు పహారా పెట్టడం వంటి ప్రభుత్వ విపరీత చర్యలు సభ్య సమాజం, సాధారణ పౌరులు ఈసడించుకునేవిగా ఉన్నాయి. వీరిపై ఇలా అనుచితంగా ప్రవర్తించడానికి ఉపాధ్యాయులేమైనా రౌడీ షీటర్లనుకుందా ప్రభుత్వం? విద్యార్ధులపై ఈ చర్యల ప్రభావం ఏ రకంగా పడుతుంది, ఎలా ఉంటుందనే కనీసమైన ఆలోచన కూడా లేదా ప్రభుత్వానికి ?

దేశ భవిష్యత్తు పాఠశాలల నాలుగు గోడల మధ్యే నిర్మితమవుతుందని 1966లో విద్యా రంగంపై కొఠారి కమిషన్‌ తన నివేదిక మొదటి వాక్యంలో పేర్కొంది. ఇక్కడ నాలుగు గోడలంటే నాడు-నేడు పేరున రంగులు, బొమ్మలు వేసిన బయటి హంగులు కాదు. ఆ గోడల లోపల ఉపాధ్యాయులు నేర్పే విద్య ద్వారానే విద్యార్ధులు ఉన్నత శిఖరాలకు చేరతారు. నేటి బాలలే రేపటి పౌరులంటారు. అటువంటి బాలలు పాఠశాలల్లో ఎంత బాగా తీర్చిదిద్దబడితే, సమాజం అంత ఉన్నతంగా రూపుదిద్దుకుంటుంది. అక్షరాస్యతలో అగ్ర భాగాన ఉన్న నార్వే, స్వీడన్‌, ఫిన్‌లాండ్‌, డెన్మార్క్‌ వంటి దేశాలే ఆర్థిక, సామాజిక, పౌరుల ఉన్నత ప్రమాణాల వంటి అన్ని రంగాలలోనూ కూడా అగ్ర భాగాన ఉన్నాయి.

సమాజంలో విద్యకున్న ప్రాధాన్యత అటువంటిది. కానీ, ప్రపంచ దేశాలతో పోలిస్తే నేడు మన దేశం 73 శాతం అక్షరాస్యతతో 191 దేశాలకు గాను 145వ స్థానంలో ఉంది. అందులో కూడా ఆంధ్ర రాష్ట్రం 67 శాతం అక్షరాస్యతతో దేశంలోని 36 ప్రాంతాలకు గాను 31వ స్థానంలో అధమాన ఉండడం సిగ్గుపడవలసిన విషయం. దాన్ని ఎలా మెరుగు పరచాలా అని ఆలోచన చేయవలసిన ప్రభుత్వం, విచిత్రంగా దాన్ని ఇంకా అగమ్యగోచర పరిస్థితులలోకి నెట్టివేసే విధానాలను అవలంభించడం సమాజ భవిష్యత్తుకు, పురోభివృద్ధికి తీవ్ర ఆటంకంగా నిలుస్తుంది.

ప్రభుత్వాలు కొన్ని సందర్భాలలో పొరపాట్లు చేయడం అసహజమేమీ కాదు. కానీ ఆ పొరపాట్లను వేలెత్తి చూపడమే నేరంగా చూడడం అసలైన నేరం. అటువంటి నేరానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోంది. తప్పులు సరిచేసుకోండి మహాప్రభో అని చెప్పిన ప్రోగ్రసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ శాసన మండలి సభ్యుల పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, అరెస్టులు చేయడాన్ని ఏ రకంగా అర్ధం చేసుకోవాలి ?

ఈ ప్రభుత్వం నేడు ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పడం కంటే బోధనేతర పనులు ఎక్కువగా చేయిస్తోంది. బాత్‌ రూమ్‌ల తనిఖీ, మధ్యాహ్న భోజనం, హాజరు వంటి వివిధ యాప్‌ల పేరున పని భారం పెంచుతోంది. దీనివల్ల సహజంగానే పాఠాలు చెప్పడానికి వెచ్చించే సమయం తగ్గుతోంది. మమ్మల్ని ఈ బోధనేతర పనుల నుండి తప్పించి, పాఠాల మీద సమయాన్ని వెచ్చించే అవకాశం కల్పించండి అని ప్రభుత్వానికి వీరు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం కలగలేదు. సరికదా, ప్రభుత్వం ఆ పనులన్నింటినీ అలాగే ఉంచింది. అయితే తాజాగా బోధనేతర పనులని చెప్పి ఎప్పుడో ఐదేళ్ళకోసారి వచ్చే ఎన్నికల విధుల నుండి వీరిని తప్పిస్తూ ఆగమేఘాల మీద నిర్ణయించింది. దీని వెనుక మర్మమేమిటో కొద్దిగా ఆలోచించేవారెవరికైనా ఇట్టే అర్ధమవుతుంది.

ఇక్కడ తప్పక గమనించవలసిన అంశం ఒకటుంది. అదేమిటంటే ఇప్పడు ప్రభుత్వం ఏం చేయాలి? ఉపాధ్యాయులేం చేయాలనే దాని కంటే పౌర సమాజం ఏం చేయాలనేదే. ఇదేదో మనకు సంబంధించిన సమస్య కాదు అనుకుంటే అది పొరపాటే. సమాజం పురోగమించాలంటే అంతిమంగా ప్రజలే సూత్రధారులు, పాత్రధారులు. ఎవరైనా ఆ పురోగమనానికి అడ్డంకిగా ఉంటే ప్రమాదమే. అందులోనూ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం అడ్డంకిగా ఉంటే ఇంకా ప్రమాదం. ప్రజల ప్రతినిధిగా ఉండే ప్రభుత్వం చేసిన పొరపాట్లను కూడా అంతిమంగా ప్రజలే సరిచేయాలి.

నేడు ఉపాధ్యాయులపై జరుగుతున్న నిర్బంధాన్ని కూడా అదే కోణం నుంచి పరిశీలించాలి. భావిభారత సమాజ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించే గురువులకు అవమానం జరగడమంటే, అది మొత్తం సమాజానికి జరిగినట్లే. అందుకే, గురువులూ… మన్నించండి…మీ పట్ల ప్రభుత్వానికి గౌరవం లేదోమో కానీ, మాకు మాత్రం అపార గౌరవం ఉంది…అని భరోసాగా పౌర సమాజం నిలబడాలి. సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్నత స్థానం వుందన్న వాస్తవాన్ని గుర్తించి ప్రభుత్వం ఇప్పటికైనా కనీస సంస్కారాన్ని ప్రదర్శించడం వివేకం అనిపించుకుంటుంది.

ఎ. అజ శర్మ
(వ్యాసకర్త : ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి )

LEAVE A RESPONSE