– రేవంత్ బీసీ బిల్లు కేంద్రానికి పంపించారు
– అయినా కేంద్రం చర్యలేవీ?
– వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛపై దాడి
– దేశాన్ని ఎక్స్‌రే తీయాలి
– అహ్మదాబాద్ ఏఐసీసీ సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
అహ్మదాబాద్: బీసీల రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి బిల్లు చినప్పటికీ, కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణలో కులగణన విజయవంతంగా నిర్వహించారని, దీని ఆధారంగా రిజర్వేషన్లు పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉంటే, సంపద మాత్రం వారి చేతిలో లేదని అన్నారు. దేశంలో కులగణన చేపట్టాలని ప్రధాని మోదీని కోరితే తిరస్కరించారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛపై దాడి అని విమర్శించారు.
చనిపోయాక తన గురించి ప్రజలు ఏం ఆలోచిస్తారనేది అనవసరమని, తాను అనుకున్న పనులు పూర్తిచేశాక ప్రజలు తనను మరిచిపోయినా ఫర్వాలేదని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్రమాల ద్వారా గెలిచిందని.. ఆరెస్సెస్, బీజేపీ నిత్యం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్స్‌రే తీయాలని అన్నారు. దళితులు, ఆదివాసీల సమస్యలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని ఆరోపించారు.
కులగణన వల్ల దేశంలో బీసీల సంఖ్య ఎంత ఉందో తెలుస్తుందని, ఈ విషయంలో దేశానికి తెలంగాణ దారి చూపిందని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే నిబంధనను తొలగిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నారని, రాహుల్ గాంధీ వాటిని కేవలం ఇద్దరు వ్యాపారవేత్తలకే అప్పగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.