Suryaa.co.in

Telangana

మ‌హిళ‌ల‌కు రుణం ఇవ్వ‌డానికి బీజేపీకి మ‌న‌సురాదా?

– కార్పొరేట్ల‌కు 16.5 ల‌క్ష‌ల కోట్లు రుణ‌మాఫీ
– మ‌హిళా సంఘాల‌కు కేంద్రం 15 ల‌క్ష‌ల వ‌డ్డీ లేని రుణం ఇవ్వాలి
– అబ‌ద్దాల‌తో మ‌హిళ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం
– గ్యాస్ ధ‌ర‌ను పెంచి మ‌హిళ‌లపై మోదీ సర్కార్ గుదిబండ‌ను మోపింది
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ : మ‌హిళల‌కు స్వావ‌లంభ‌న క‌ల్పించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని, మ‌హిళా సంఘాల‌కు రూ 15 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం అందించాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత డిమాండ్ చేశారు.

కార్పొరేట్ కంపెనీల‌కు రూ. 16.5 ల‌క్ష‌ల మేర రుణ‌మాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌హిళ‌ల‌కు ఇవ్వ‌డానికి మాత్రం మ‌న‌సు రావ‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాయ‌మాట‌లు చెబుతూ మ‌హిళ‌ల‌ను మోసం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు.

బుధ‌వారం తెలంగాణ మ‌హిళా సాధికార‌త స‌మాఖ్య సంఘం స‌భ్యులు ఎమ్మెల్సీ క‌వితను త‌న నివాసంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ… కేసీఆర్ హ‌యాంలో ఎప్పుడూ తాము అబ‌ద్దం చెప్ప‌లేదని, మ‌హిళా సంఘాల‌కు రూ 5 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాలు ఇస్తున్నామ‌నే చెప్పామ‌ని, కానీ ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్రం రూ 20 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణం ఇస్తున్న‌ట్లు అబ‌ద్దాలు చెబుతున్న‌ద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా రూ 5 ల‌క్ష‌ల మేర‌నే వ‌డ్డీ లేని రుణాలు ఇస్తున్న‌ద‌ని, కానీ అబ‌ద్దాలు చెప్పి మ‌హిళ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

రాష్ట్రాలు ఏ చిన్న ప‌ని చేసినా కేంద్ర ప్ర‌భుత్వం త‌మ భాగ‌స్వామ్యం కూడా ఉంద‌ని చెప్పుకుంటుంద‌ని, ప్ర‌తీ చిన్న ప‌నికి నిధులు ఇచ్చే కేంద్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌లకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని నిందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రస్తుతం రూ 5 ల‌క్ష‌ల వ‌రకు వ‌డ్డీ లేని రుణం ఇస్తున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

బ్యాంకుల‌కు రుణాలు ఎగ‌వేసి లూటీ చేసే పెద్ద పెద్ద వ్యాపార‌వేత్త‌ల‌కు రూ 16.5 ల‌క్ష‌ల మేర రుణాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం మాఫీ చేసింద‌ని, కానీ మ‌హిళ‌ల‌కు మాత్రం రుణాలు ఇవ్వ‌డానికి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌న‌సు రాక‌పోవ‌డం శోచనీయ‌మ‌ని అన్నారు. నిజంగా మ‌హిళ‌ల అభివృద్ధి ప‌ట్ల చిత్త‌శుద్ది ఉంటే మ‌హిళ‌ల కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించాల‌ని సూచించారు.

మ‌హిళ‌ల సంక్షేమాన్ని విస్మ‌రించిన కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం గ్యాసు ధ‌ర‌ను రూ 50 పెంచి గుదిబండ‌ను మోపిందని మండిప‌డ్డారు. అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు త‌గ్గుతుంటే ఇక్క‌డ పెంచ‌డ‌మేంటని నిల‌దీశారు.

ఎందుకు పెంచుతున్నార‌ని ప్ర‌శ్నిస్తే ప్ర‌ధాని మోదీ ఇంత గొప్పోడు అంత గొప్పోడు అని బీజేపీ నాయ‌కులు అంటున్నార‌ని, ఇలా ఇష్ట‌మున్న‌ట్లు ధ‌ర‌లు పెంచితే మోదీ ఎంత గొప్ప వ్య‌క్తి మాకేంటి అని అన్నారు. ఈ కార్యక్రమలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రూప్ సింగ్ , జాగృతి నాయకులు మర్రిపల్లి మాధవి మరియు పెద్దయెత్తున మహిళలు పాల్గొన్నారు

LEAVE A RESPONSE