Home » అంబేద్కర్ మహనీయుని పుణ్యమే తెలంగాణ

అంబేద్కర్ మహనీయుని పుణ్యమే తెలంగాణ

– పదేండ్ల బిఆర్ఎస్ పాలన సబ్బండ వర్గాల సంక్షేమంలో స్వర్ణయుగం
– దళిత బహుజన వర్గాల ప్రగతి దిశగా అమలయిన పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ కార్యాచరణకు ఎట్టి పరిస్థితుల్లో భంగం వాటిల్లకూడదు
– సబ్బండ వర్గాల సంపూర్ణ అభ్యున్నతి సాధనే అంబేద్కర్ కు మనమందించే ఘన నివాళి
– బిఆర్ఎస్ అధినేత కేసీఆర్
– అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్

దళిత బహుజన మైనారిటీ మహిళా వర్గాలు అన్ని రంగాల్లో సమానత్వంతో ఆత్మగౌరవంతో జీవించేలా పాలన అంది, అంబేద్కర్ మహనీయుని ఆదర్శాలు, కార్యాచరణ సంపూర్ణంగా అమలులోకి వచ్చిన నాడే, దేశ స్వాతంత్ర్యానికి సంపూర్ణ ఫలితం దక్కినట్టని, బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టం చేశారు.

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) సందర్భంగా దేశానికి ఆ మహనీయుడు అందించిన సేవలను, సమ సమాజ భారత నిర్మాణం కోసం వారు చేసిన అజరామర కృషిని త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు.
దళిత బహుజన సబ్బండ కులాలను అన్ని రంగాల్లో అగ్ర కులాలకు ధీటుగా తీర్చిదిద్దాలనే అంబేద్కర్ ఆశయాలను గడచిన తమ పదేండ్ల ప్రగతి పాలనలో నిజం చేసి చూయించామని కేసీఆర్ అన్నారు. రైతులకు రైతుబంధు సహా దళిత బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు పలు పథకాలను తాము అందించడం వెనక అంబేద్కర్ స్పూర్తి ఇమిడివున్నదన్నారు.

75 ఏండ్ల స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటిసారిగా, దళితబంధు వంటి పలు విప్లవాత్మక పథకాలను అమలులోకి తెచ్చి దళిత వర్గాలను ప్రగతిపథంలో నడిపించేందుకు తాము చేసిన కృషి దేశానికే ఆదర్శంగా నిలిచిందని, పదేండ్ల బిఆర్ఎస్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా కొనసాగిందని కేసీఆర్ పేర్కొన్నారు.

రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని కేసీఆర్ తెలిపారు. వారికి కృతజ్జతగా తెలంగాణ సచివాలయానికి డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంగా నామకరణం చేసుకున్నామన్నారు. 125 అడుగులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహాన్నినెలకొల్పి అంబేద్కర్ మహాశయునికి తెలంగాణ సమాజం ఘనమైన నివాళిని అర్పించుకున్నదన్నారు.

దేశంలో మరెక్కడాలేని విధంగా అత్యధిక సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేసినామన్నారు. తమ పాలనలో దళిత బహుజన బిడ్డలకు ఉచిత విద్యను అందించి వారిని విద్యాధికులను చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విద్యా ఉపాధి రంగంలో ముందంజలో నిలిపినామన్నారు. ఈ పరంపరకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రస్థుత రాష్ట్ర ప్రభుత్వానికున్నదన్నారు.

దళిత బహుజన వర్గాల ప్రగతి దిశగా పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యాచరణకు ఎట్టిపరిస్థితిలో భంగం వాటిల్లకూడదన్నారు. తాము అమలు చేసిన పథకాలను కొనసాగించాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. సబ్బండ వర్గాల సంపూర్ణ అభ్యున్నతి సాధనే అంబేద్కర్ కు మనమందించే ఘన నివాళి అని పేర్కొన్నారు.

Leave a Reply