Home » రజాకార్ల పీడ..నిజాము చీడ!

రజాకార్ల పీడ..నిజాము చీడ!

1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తనకు తాను స్వతంత్రుడిగాప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్థాన్‌లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు.
నేడు ఈ దొరల తెలంగాణ తెలంగాణా విమోచన దినోత్సవాన్ని తెరాస ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినప్పటికీ ప్రతిపక్షాలన్నీ ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయా పార్టీ లు తెలిపాయి.తెలంగాణా సాయుధపోరాటాల గురించి నేటితరం వారికి అంతగా తెలియకపోవచ్చు గానీ ఆనాటి నిజాం నవాబు నిరంకుశ పాలన గురించి, రజాకర్ల ఆకృత్యాల గురించి, వాటిని ఎదుర్కొవడానికి జరిగిన తెలంగాణా సాయుధ పోరాటాల గురించి తెలిసున్న వెనుకటితరం వారు నేటికీ ఆనాడు తాము అనుభవించిన కష్టాలు మరిచిపోలేమని చెపుతుంటారు.
ఆనాడు తమ కళ్ళ ముందు జరిగిన దారుణ మారణకాండ, అత్యాచారాలు, అకృత్యాలు జ్ఞాపకం వస్తే బాధతో కళ్ళ నీళ్ళు పెట్టుకొంటుంటారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ తమది స్వతంత్ర రాజ్యమని, భారత్ లో విలీనం కాదలచుకాలేదని ప్రకటించాడు. దోపిడీ దొంగలు, కిరాయి హంతకులు, మానవ మృగాలకి ఏమాత్రం తీసిపోనివిధంగా ఖాసిం రజ్వీ తయారుచేసిన రజాకార్లు అప్పటికే నిజాం నవాబు తరపున తెలంగాణాపై పడి చాలా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వారి చేతిలో వేలాది మంది తెలంగాణా ప్రజలు ధనమానప్రాణాలు కోల్పోయారు. వారు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు.
గ్రామాలలో కాపాలాగా ఉన్న పురుషులని వెంటబడి బల్లెలతో క్రూర మృగాలని పొడిచినట్లు పొడిచి పొడిచి చంపేవారని, వారి కొన ప్రాణాలతో విలవిల కొట్టుకొంటుంటే, ఆడపడచుల బట్టలూడదీసి వారి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందం పొందేవారని ఆనాటి కాలం వారిని ఎవరిని అడిగిన కళ్ళనీళ్ళుపెట్టుకొని చెపుతుంటే ఎవరికైనా గుండెని చేతితో మెలిపెట్టి తిప్పినట్లు కలుక్కుమనిపించక మానదు. చివరికి పసిపిల్లలని వృద్ధులపై కూడా రజాకార్లు ఏమాత్రం కనికరం చూపకుండా వెంటబడి చాలా దారుణంగా హింసించి హత్యలు చేసేవారని ఆమె చెపుతున్నప్పుడు ఆనాడు తెలంగాణా ప్రజలు ఎంత నరకం అనుభవించారో అర్ధం చేసుకోవచ్చు.
ఈ దారుణమైన పరిస్థితులని తట్టుకోలేక తెలంగాణా యువకులు, కమ్యూనిష్టులు రజాకార్లపై సాయుధపోరాటాలు మొదలుపెట్టారు. కానీ రజాకార్లని నిలువరించడం వారి వల్ల కాలేదు. బ్రిటిష్ పాలన నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా చాలా రోజుల పాటు రజాకార్ల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.
నిజాం నవాబుతో చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకొందామని భారత తొలి ప్రధాని నెహ్రూ అనుకొన్నారు. కానీ సైనికచర్య ద్వారా వెంటనే నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని భారత్ లో విలీనం చేసి రజాకర్లని అరికట్టడం అత్యవసరం అని ఆనాటి హోం మంత్రి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ పట్టుబట్టి నెహ్రూని ఒప్పించారు.
భారత ప్రభుత్వం తమపైకి యుద్దానికి సిద్దం అవుతోందని తెలిసిన నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అందుకు తాము కూడా సిద్దమేనని ప్రకటించడంతో భారత-నిజాం సేనల మద్య యుద్ధం అనివార్యం అయ్యింది. సెప్టెంబర్ 13, 1948న వారి మద్య మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద భీకరయుద్ధం జరిగింది. కానీ దానిని భారత ప్రభుత్వం యుద్ధంగా భావించనందున సైనిక చర్యగానే పేర్కొంది. ఆపరేషన్ పోలో పేరిట సాగిన ఆ సైనిక చర్య కేవలం 5 రోజుల్లోనే ముగిసిపోయింది.
భారతసేనల ధాటికి తట్టుకోలేక నిజాం నవాబు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. తన సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడానికి కూడా అంగీకరించారు. ఆ సంస్థానంలో ఉన్న ఔరంగాబాద్, నాందేడ్, పర్బనీ, బీడ్ మహారాష్ట్రాలో , గుల్బర్గా, బీదర్, ఉస్మానాబాద్, రాయచూర్ కర్నాటక రాష్ట్రంలో విలీనం అయిపోయాయి. హైదరాబాద్ మాత్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.
నిజాం నవాబు ఓటమిని అంగీకరించి, తన సంస్థానాలని భారత్ లో విలీనం చేసినప్పటికీ ఆ తరువాత కూడా కొంతకాలం పాటు ఆయన గవర్నర్ హోదాకి సమానమైన పదవిలో కొనసాగారు. అది భారత ప్రభుత్వం కనికరించబట్టేనని చెప్పవచ్చు. నైజాం నవాబ్ మాత్రం విలీనానికి ఒప్పుకోలేదు. అప్పట్లో రాజాకార్ల పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేసిన ఖాసిం రజ్వీ… మారణకాండకు తెగబడ్డారు.
స్వాతంత్ర్యం వచ్చాక దాదాపు 13 నెలలపాటూ… తెలంగాణ ప్రజలు చూడని నరకం లేదు. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఆదివాసీలు ఏకమై ఎదురుతిరిగారు. ఎంతో మంది ఉద్యమ నేతలు, కళాకారులు… అందరూ తమ ప్రాణాలు పణంగా పెట్టారు. ఉద్యమం అత్యంత తీవ్ర స్థితికి చేరిన తర్వాత… కేంద్ర ప్రభుత్వం అలర్టైంది. ఏం చేసైనా నిజాం సంస్థాన్ని ఇండియాలో కలిపేయమని సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కి సూచించింది. అంతే… భారత సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది. దాంతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇక లొంగిపోక తప్పదని అర్థమైంది.
ఆ తరువాత దేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగి మార్చి 1952లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తొలి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రజాస్వామ్య విధానంలోనే పాలన మొదలైంది. 1956లో హైదరాబాద్ ఆంధ్రాలో కలిసిపోయింది. 2014, జూన్ 2న మళ్ళీ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంగా అవతరించింది.అప్పట్లో హైదరాబాద్ రేడియో ద్వారా… నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైందని ప్రకటించాడు.
ఆ రోజు… 1948 సెప్టెంబర్ 17 అందుకే ఇదే రోజును తెలంగాణ ప్రజలు తెలంగాణ విమోచన (స్వాతంత్ర్య) దినోత్సవంగా జరుపుకుంటున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి నా తరపున తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.

– కాట్రగడ్డ ప్రసూన
(మాజీ  ఎమ్మెల్యే, టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు )

Leave a Reply