Suryaa.co.in

Features

అక్షరమే ఆయుధమై..!

ఆయన..
నడిచే అక్షరాల ఉద్యమం..
కలం యోధుడు..
మాటల మాంత్రికుడు..
నవయుగ వైతాళికుడు..!

వాడుక భాష..
గురజాడ గుండెఘోష..
మనం మాట్లాడే భాషను..
జనం మాట్లాడే భాషను
ప్రశస్తం చేసేందుకు
ఎన్ని పాట్లు…ఆటుపోట్లు..
భాషాచాందసులపై.. ఛందస్సులపై..
చండశాసనులపై తిరుగుబాట్లు..
బుడుగుగా ఉన్ననాడు జట్టుకట్టిన గిడుగుతో కలిసి
ఎన్ని ప్రయత్నాలు..
ఇప్పుడు ఆ భాషే
‘గురజాడ’య్యింది..
నీ కాలాన్ని..నా కలాన్ని..
మన కలల్ని_
ఆ గురజాడ అడుగుజాడే
నడిపిస్తోంది..!

కలానికి ఇంత బలం ఉంటుందా..
అక్షరాల పేర్పు ఇంతటి మార్పునకు కా”రణం’
కాగలుగుతుందా..
ఈ ప్రశ్నలకు అప్పారావు
రచనలే సమాధానం..
సాంఘిక దురాచారాలపై
పెన్నే గన్నుగా ఎక్కుపెట్టిన ఆయన తెగువ..
కన్యాశుల్కం నుంచి విముక్తం
అయింది మగువ..
వేశ్యావృత్తిపైనా పీఠికలు..
బీగాలు వేసుకున్న
నాటి వాటికలు..!

గురజాడ పాత్రలు
ఏ కాలంలోనైనా
ఎలాంటి సమాజంలో అయినా
కళ్ళ ముందు కదిలే
సజీవ మూర్తులు…
ఒక్క గిరీశంలోనే
ఎన్నెన్ని కోణాలు..
అతగాడి మాటలు
రుగ్మతలపై ఎక్కుపెట్టిన బాణాలు…
ప్రతి పాత్రలో ఓ ప్రయోజనం
ఉబ్బితబ్బిబ్బైన జనం..
మధురవాణి..
రామప్పపంతులు..బుచ్చమ్మ
నిజంగా ఉన్నారా..
ఇప్పటికీ మన మధ్య..
కాదనిపిస్తూ మిథ్య..
ఎన్నో సంస్కరణలకు
గురజాడ రచనలేగా తొలిసంధ్య..!

దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్..
ఈ గీతమే
భరతజాతి అవగతం
మానవజాతి మనోగతం..
మనిషన్నవాడి ఇంగితం..
మరో జాతీయగీతం..!
సొంతలాభం కొంత మానుకుని
పొరుగువాడికి సాయపడవోయ్..
ఇంతకు మించిన నీతిసూత్రమున్నదా..
జాతికిది వేదమంత్రమే కదా!
ఇలా రాశాడు గనకనే
గురజాడ అప్పారావు ఆరాధ్యుడయ్యాడు సదా..
సాక్షాత్తు మోడీనే
కాలేదా ఫిదా..!

 

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE