”ప్రభుత్వోద్యోగుల జీతాలు పెంచితే ప్రజల సంక్షేమం దెబ్బ తింటుంది.” – ఇది ప్రభుత్వ పక్ష ప్రతినిధుల వాదన, అధికార పార్టీ నేతల ప్రచారం.
ప్రజల సంక్షేమానికి, ఉద్యోగుల జీతాల పెంపుదలకి మధ్య పోటీ పెట్టి చేసే ఈ వాదన పాలకవర్గ సిద్ధాంతానికి ప్రతిరూపమే.
మరో సందర్భంలో ”ఇలా సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు చేస్తూవుంటే ఇక రాష్ట్రాభివృద్ధి ఏ విధంగా సాధ్యపడుతుంది?” అన్న వాదన కూడా వినపడుతోంది.
ఇక్కడ పేదల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికీ మధ్య పోటీ పెట్టి వాదిస్తున్నారు.
మరో సందర్భంలో ”రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటే నిధులెక్కడినుంచి వస్తాయి?” అంటూ చర్చ పెడతారు.
ఇక్కడ రైతు సంక్షేమానికి, రాష్ట్రం నిర్వహణకు మధ్య పోటీ పెడుతున్నారు.
”ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు పెంచండి” అని వ్యవసాయ కూలీలు అడిగితే ”ఆ విధంగా కేటాయింపులు పెంచాలంటే ప్రజలమీద అదనంగా పన్నుల భారం మోపవలసివస్తుంది” అంటారు.
ఇక్కడ వ్యవసాయ కూలీలకు, ప్రజలకు మధ్య పోటీ పెడతారు.
”నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించండి, అంతవరకూ నిరుద్యోగ భృతి ఇవ్వండి” అని అడిగితే అప్పుడు ఆ నిరుద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య పోటీ పెడతారు.
కాని,ఇసుక రేటు అమాంతం పెంచేసినప్పుడు ఈ రాజకీయ నాయకులకి ఆ ప్రజలు గుర్తుకు రారు.
చెత్త పన్ను వేసి వసూళ్ళ కోసం బెదిరింపులకు కూడా సిద్ధపడినప్పుడు తాము బెదిరిస్తున్నది ఆ ప్రజలనే అని అనుకోరు.
ఆస్తిపన్ను అన్యాయంగా పెంచినప్పుడూ ప్రజలు గుర్తుకు రారు.
ప్రజలకోసం పోరాడే ఉద్యమకారుల మీద పోలీసులను ప్రయోగించి అణచివేయమని ఆదేశాలిచ్చే సమయంలో ఈ ప్రభుత్వం ఎన్నడూ ”అయ్యో! ఈ ఉద్యమకారులు ప్రజల గురించి కదా అడుగుతున్నారు?” అని అనుకోదు.
పాలకవర్గపు దమననీతిలో ఒక వైపు ఉద్యమాలను, పోరాటాలను అణచివేయడం అనేది ఉంటుంది. మరోవైపు పోరాడుతున్న తరగతులకు, తక్కిన ప్రజలకు నడుమ పోటీ పెట్టి ప్రజల మధ్యే చీలికలు తీసుకురావడం అనేది కూడా ఉంటుంది.
కార్మికులు సమ్మె చేయడానికి సన్నద్ధం అయితే ”సమ్మెల వలన దేశానికి నష్టం. ప్రజలకు అసౌకర్యం” అని వెంటనే ప్రభుత్వం ప్రకటిస్తుంది. కార్మికులను అణచివేయడానికి ఎస్మా వంటి చట్టాలను తీసుకువస్తూ వాటిని తెచ్చింది ప్రజల కోసమే అని సమర్ధించుకుంటుంది.
ఈ ద్వంద్వ నీతి సామాజిక అంశాలలోనూ మనకి కనిపిస్తుంది.
గ్రామాల్లో ఉన్న కుల వివక్షను రూపు మాపాలని మనం గనుక ప్రచారం చేపడితే వెంటనే అక్కడున్న పోలీసులు, పెత్తందారులు మన దగ్గరికి వచ్చి ”మీరు గ్రామంలో అడుగు పెట్టకముందు వరకూ ఈ గ్రామం ప్రశాంతంగా ఉంది. మీరే ఇక్కడ వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు” అని మనల్ని నేరస్తులుగా చిత్రిస్తారు. ఆ గ్రామంలో వివక్ష పాటిస్తున్న విషయం గురించి నోరెత్తరు. గ్రామం ప్రశాంతంగా ఉందని మాత్రం అంటారు. అంటే వివక్షను మౌనంగా దళితులు భరిస్తూ ఉండాలి. ఎదురుతిరిగి ప్రశ్నించకూడదు. వివక్షను ప్రశ్నించడం అంటే శాంతి, భద్రతలకు ప్రమాదం. ఇది పెత్తందారుల తరఫున చేసే వాదన కాదా? ఎవరి శాంతి, భద్రత గురించి పోలీసులు వాపోతున్నారు? దళితులకు శతాబ్దాలుగా కరవైన శాంతి, భద్రతల గురించి మాట్లాడరెందుకు?
”మీ మహిళా సంఘాలు వచ్చి కుటుంబాల్లో తగువులు తెస్తున్నాయి. మీరిక్కడ సంఘం పెట్టకముందు వరకూ కుటుంబాలు సజావుగా నడిచాయి” అనే మహానుభావులూ ఉన్నారు. వీరంతా కుటుంబాల్లో మహిళల మీద పెత్తనాన్ని చెలాయించే ప్రబుద్ధుల తరఫున వకాల్తా పుచ్చుకన్నవారేనని వేరే చెప్పన్కరలేదు.
”మీరు వచ్చి సంఘాలు పెట్టేంతవరకూ మా ఫ్యాక్టరీలో చాలా ప్రశాంత వాతావరణం ఉంది. మీరు సంఘం పెట్టాక ఇక్కడ వాతావరణం చెడిపోయింది” అని అనని ఫ్యాక్టరీ యజమానిని ఒక్కరినైనా చూడగలమా? ”సంఘాల వలనే దేశం చెడిపోయింది” అని ప్రవచించే మేథావులూ చాలామంది మనకి తారసిల్లుతూ వుంటారు. దేశంలో ఎక్కువ పని దినాలు నష్టపోయినది సంఘాలవల్లనో, సమ్మెల వల్లనో కాదని, యజమానుల అక్రమ మూసివేతల వలన, తొలగింపుల వలన, లే ఆఫ్ ల వలన 90 శాతం పని దినాలు నష్టపోయామని గణాంకాలు చెప్పేది ఈ మేథావులకి పట్టదు.
”గత 75 ఏళ్ళుగా హక్కుల గురించి మాట్టాడినందువల్లనే దేశం చెడిపోయింది. ఇక ముందు చర్చ అంతా చేయబోయే తపస్సు గురించే” అని స్వయానా ప్రధాని మోడీ శలవిచ్చారు ! అంటే ఇక ముందు ప్రజల హక్కుల ఊసెత్తకూడదు. కార్పొరేట్ల ముక్తి కోసం మోడీ చేసే తపస్సుకి మనం ఎవరూ భంగం కలిగించకూడదు.
ఇప్పుడు పాలించే ప్రభుత్వంతో దాని కింద పని చేసే ఉద్యోగులు పోరాడుతున్నారు. అంటే యజమానితో ఆ కింద పని చేసే ఉద్యోగులు పోరాడుతున్నారు. మనం ఈ పోరాటంలో యజమాని వైపు ఉందామా? లేక ఉద్యోగుల వైపు నిలబడదామా? మీరే చెప్పండి !
– సత్యబాబు