సామాజిక తెలంగాణ నినాదం కాదు.. మా విధానం
– ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 13వరకు తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర
– ప్రజల వాయిస్ తెలుసుకునేందుకే ప్రజల్లోకి వెళ్తున్నాం
– దారులు వేరయ్యాయి కాబట్టే కేసీఆర్ ఫొటో లేకుండా జనంలోకి
– కేసీఆర్ తెలంగాణ సాదకుడు.. మహా నాయకుడు.. కేసీఆర్ ని అగౌరవపరిచే ఉద్దేశం లేదు
– జాగృతి జనంబాట పోస్టర్ ఆవిష్కరణలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : సామాజిక తెలంగాణ నినాదం కాదు తమ విధానమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టతనిచ్చారు. ఈ నెల 25 నుంచి జాగృతి ఆధ్వర్యంలో జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని వారిచ్చే సలహాలు, సూచనల ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు.
బుధవారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో ‘‘జనం బాట’’పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ నెల 25 న నిజామాబాద్ జిల్లా నుంచి ‘‘జనం బాట’’ యాత్ర మొదలవుతుందని చెప్పారు. దాదాపు నాలుగు నెలల పాటు వారానికి నాలుగు రోజులు ప్రతి జిల్లాల్లో రెండు రోజుల పాటు అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామన్నారు. ప్రజలే గురువులని ఆమె అన్నారు.
పెద్ద పెద్ద నాయకులను ఓడించినా… సామాన్యులను అందలమెక్కించిన అది ప్రజలతోనే సాధ్యమని చెప్పారు. అలాంటి ప్రజల వద్దకే వెళ్లి తెలంగాణ వచ్చాక సాధించుకున్నదేమిటీ? ఇంకా ఏం చేయాల్సి ఉందన్నది వారినే అడుగుతానని అన్నారు. తాను తెలంగాణ సోయి, కన్ సర్న్ ను ఉన్న వ్యక్తినని తెలిపారు. అందుకే పేగులు తెగేదాక తెలంగాణ కోసం కొట్లడానని చెప్పారు.
తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు జరగాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని చెప్పారు. బీఆర్ఎస్ లో ఉండి కూడా తాను ఇదే విషయాన్ని చెప్పేదాన్ని అని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా సామాజిక తెలంగాణ సాధించేందుకే తాను జనం బాట పడుతున్నానని కవిత ఈ సందర్భంగా చెప్పారు.
కేసీఆర్ ఫోటో లేకుండానే జనం బాట
కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారంటూ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వార్తలు ప్రసారం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఫోటో లేకుండా జనం బాట కార్యక్రమం జరుగబోతుందన్నది నిజమేనని.. అయితే అది ఆయనను అగౌరవపరిచే చర్య ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదని ఆయన ఉద్యమ నాయకుడని చెప్పారు.
అలాంటి వ్యక్తికి కూతురిగా పుట్టటం జన్మ జన్మలా అదృష్టమన్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేశారని కవిత గుర్తు చేశారు. కేసీఆర్ గారు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నారని… అలాంటప్పుడు ఆయన ఫోటో తో జనం బాట పట్టటం నైతికంగా కరెక్ట్ కాదని అన్నారు. నైతికంగా కరెక్ట్ కాదని తెలిసినప్పుడు అలాంటి పని తాను చేయనని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి మొదలు పెట్టినప్పుడు కేవలం జయశంకర్ సార్ ఫోటో మాత్రమే పెట్టామని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జాగృతి లో కేసీఆర్ ఫోటో పెట్టినట్లు చెప్పారు. జాగృతి, బీఆర్ఎస్ రెండు కేసీఆర్ కి రెండు కళ్ల మాదిరిగా ఉండేవని చెప్పారు. కేసీఆర్ అనే చెట్టు నీడలో ఉన్నన్ని రోజులు ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడినందుకే తనను కుట్ర చేసి పార్టీ నుంచి పంపిచారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ నుంచి వైదొలిగిన తర్వాత చెట్టు పేరు చెప్పుకొని బతికే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. తన దారి వేరైనప్పుడు ఆ దారిలో ధైర్యంగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియానే ట్రోల్ చేస్తుందని కవిత అన్నారు. తన దారి తాను వెతుక్కుంటున్నానని ఆమె చెప్పారు.
సామాజిక తెలంగాణ లక్ష్యం
తనకు ప్రజలే గురువులని కవిత స్పష్టం చేశారు. మనం ఇప్పటికీ సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకున్నామని… సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరముందని కవిత అన్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు అదే చెబుతున్నానన్నారు. సామాజిక తెలంగాణ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే కాదని ఓసీల్లో పేదలు, మహిళలు, యువత ఇలా అందరు సామాజిక తెలంగాణ లో భాగమన్నారు.
అందరికీ రావాల్సిన హక్కులు వచ్చే వరకు తమ పోరాటం ఉంటుందన్నారు. సామాజిక తెలంగాణ ఒక నినాదం కాదు…అది మా విధాన పరమైన నిర్ణయమని కవిత స్పష్టం చేశారు. జాగృతి ఉన్నంత వరకు అన్ని వర్గాలకు మేలు కోసం కట్టుబడి పనిచేస్తామని చెప్పారు. ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అధ్యయనం చేస్తూనే ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు.
జాతీయ పార్టీలు వైఫల్యం
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ లు పూర్తి వైఫల్యం చెందాయని కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే ఆ పార్టీ ప్రతిపక్షాలనే తిడుతూ కూర్చుందని విమర్శించారు. రాష్ట్రం మొత్తం అనిశ్చితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో యూరియ నుంచి పట్టణాల్లో అనేకానేక సమస్యలు నెలకొన్నాయని చెప్పారు.
రాష్ట్రం మొత్తాన్ని సమస్యలు పట్టిపీడుస్తున్నాయన్నారు. ఇక బీజేపీ అయిన ఆదుకుంటుందని అనుకుంటే వాళ్లు రాష్ట్రానికి మరింత అన్యాయం చేసున్నారన్నారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 8 కొత్తలు కూడా రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు.
బీసీ రిజర్వేషన్లను గవర్నర్, రాష్ట్రపతి వద్ద అమలు చేయించాల్సింది పోయి ప్రజలనే బెదిరించే విధంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, వివిధ విభాగాలు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.