Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వం మెడలు వంచి న్యాయం జరిపించడమే ‘రైతుకోసం-తెలుగుదేశం’ లక్ష్యం

-టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక రైతులకుఇబ్బందులు, కష్టాలే మిగిలాయని, వారికి ఈప్రభుత్వం గోరంత సాయంచేస్తూ, కొండంత ప్రచారం చేసుకుంటోందని, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిర సిస్తూ, వారికి మద్ధతుగా, ప్రభుత్వంవారిని ఆదుకునేలా చేయడానికే టీడీపీ ఆధ్వర్యంలో ‘రైతుకోసం-తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నేటినుంచి (14 నుంచి) నిర్వహిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.
సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే … జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతులను, వ్యవసాయరంగాన్ని పట్టించుకోవడంలేదు. రైతులకు గోరంత సాయం చేస్తున్న జగన్ ప్రభుత్వం, ప్రచారం మాత్రం కొండంతసాయం చేసుకుంటోంది. జగన్ గద్దెనెక్కాక 780మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం 2వస్థానంలో నిలిచిందంటే అందుకు కారకుడు ఈ ముఖ్యమంత్రే. కౌలురైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం, దేశంలోనే మూడోస్థానంలో ఉంది. రైతులకు గిట్టుబాటు ధర, పంటలబీమా, ఇన్ పుట్ సబ్సిడీలను ప్రభుత్వం అందించడంలేదు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.4వేలకోట్లవరకు బకాయిలను ప్రభుత్వం ధాన్యం రైతులకు చెల్లించాల్సి ఉంది.మోటార్లకు మీటర్లు బిగించాలన్న పాలకుల నిర్ణయాన్ని అన్నదాతలుతీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వచర్యలను కర్షకులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. రూ.3వేలకోట్లతో ధరల స్థిరీకరణనిధి ఏర్పాటుచేస్తామన్న జగన్ ప్రభుత్వం ఇంతవరకు దానిగురించి ఆలోచనచేయలేదు. ధాన్యానికి రూ.1880వరకు గిట్టుబాటు ధర ఉంటే, రాష్ట్రంలో రూ.1300లకు కూడా కొనేవారులేరు. రైతులకు ఇంకా ఈప్రభుత్వం రూ.4వేలకోట్ల వరకు ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రకృతివైపరీత్యాలతో నష్టపోయినరైతులను ఆదుకోవడానికి రూ.4వేలకోట్లు ఇస్తాననిచెప్పిన ముఖ్యమంత్రి, ఇంతవరకు దానికి రూపాయికూడా కేటాయించలేదు.
ఇన్ పుట్ సబ్సీడీ అందించకుండా ప్రభుత్వం ఈక్రాప్ కాలేదంటూ తప్పించుకుంటోంది. ప్రభుత్వం అమలుచేస్తున్న ఈక్రాప్ నమోదు రైతులకు నష్టాన్నే చేకూరుస్తోంది. 70శాతం మంది రైతులకు ఇప్పటికీ ఈక్రాప్ నమోదు ప్రక్రియ పూర్తికాలేదు. దాంతో వారికి ప్రభుత్వ సబ్సిడీలు అందని పరిస్థితి.ఆక్వారైతులను జగన్ ప్రభుత్వం నిండాముంచింది. ఆక్వాఉత్పత్తులను ప్రభుత్వం విదేశాలకు ఎగుమతి చేయకపోవడంతో మత్స్యరైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం వారికిచ్చే విద్యుత్ ధరను పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు.. మరలా ఇప్పుడు జగన్ జమానాలో కోనసీమ రైతులు ఆదిశగానే ఆలోచించడం బాధాకరం. పండిన పంటల ఉత్పత్తులుకొనే నాథుడు లేకుండా పోయాడని, దళారులు తమను దోచుకుంటున్నారని అన్నదాతలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
పంటలబీమా సొమ్ముని ప్రభుత్వం సకాలంలో బీమాసంస్థలకు చెల్లించడంలేదు. ఈప్రభుత్వంలో రైతులు తమసొంతఖర్చుతోనే సేద్యం చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. చంద్రబాబుప్రభుత్వంలో రైతులకు సకాలంలో విత్తనాలు మొదలు అన్నీ అందడంతో వారు సంతోషంగా సాగులో కొనసాగారు. జగన్మోహన్ రెడ్డి రాగానే వారికికష్టాలు మొదలయ్యాయి. ఈ ముఖ్యమంత్రి నిర్వాకంతో రైతుమేడిపట్టుకోవడానికే భయపడుతున్నాడు. రైతుభరోసా కింద ప్రతి రైతుకి ఏటా రూ.13,500లు ఇస్తాననిచెప్పిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఆమొత్తాన్ని రూ.7,500లకే పరిమితంచేశాడు.
ప్రభుత్వం అన్నదాతలకు చేస్తున్నఅన్యాయాన్ని నిరసిస్తూ, వారికి అండగా నిలవడానికే తమపార్టీ ఆధ్వర్యంలో ‘రైతుకోసం – తెలుగుదేశం’ నిర్వహిస్తున్నాం. రేపటినుంచీ 18వతేదీ వరకు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతుభరోసా కేంద్రాలు వైసీపీ కార్యకర్తలకు ఉపాధి కేంద్రాలుగా మారాయి. జగన్మోహన్ రెడ్డి కళ్లుతెరిపించేలా రైతులంతా మూకుమ్మడిగా పెద్దఎత్తున రోడ్లపైకివచ్చి ‘రైతుకోసం-తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం.

LEAVE A RESPONSE