Suryaa.co.in

Andhra Pradesh

ఆ మహా మనిషి జన్మదినం మనందరికీ పర్వదినం

-ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉందాం
-నాయకుడి మాటే మనకు ‘‘సుగ్రీవాజ్ఞ’’
-‘‘మీరు ఆదేశించండి… మేం పాటిస్తాం’’ అనే నినాదంతో ముందుకు సాగుదాం
-తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

మహానాడు… ఒక పండుగ.. ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ఓ పర్వదినం. ఈ పవిత్ర పర్వదినాన, తెలుగుదేశం పార్టీ అతిరథ మహారధులందరూ అధిష్టించిన ఈ మహానాడు వేదికపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నివేదిక సమర్పించే అద్భుతమైన అవకాశాన్ని నాకందించిన మన ప్రియతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి నా హృదయపూర్వక నమోవాకములర్పిస్తున్నాను.

ఆ రోజు.. ఒక అపూర్వ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిన పర్వదినం. అదే.. 1982 మార్చి 29. యావత్‌ తెలుగు ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూచిన రోజు. తెలుగుతల్లి పులకించి పరవశించిన శుభదినం. ఆనాడు, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాష్ట్ర నేతలను అడుగడుగునా అవమానిస్తున్న వైనాన్ని గమనించిన తెలుగుజాతి ముద్దుబిడ్డ, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన ఘనచరిత్ర మనందరికీ విదితమే.

ఆ మహా మనిషి జన్మదినం మనందరికీ పర్వదినం, ఆనాటి నుండి తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ పేరిట ప్రతి సంవత్సరం ఒక జాతరగా జరుపుకుంటున్నాం. ఆ మహనీయుని శత జయంతి చారిత్రాత్మక నగరమైన రాజమహేంద్రవరంలో జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల మహాసభ ‘మహానాడు’కు దేశ విదేశాల నుండి తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనం, అభివందనం.

తారకరాముని తదుపరి, పార్టీ పగ్గాలు చేపట్టిన మన ప్రియతమ నేత నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఈనాటి వరకు పార్టీని కడు సమర్థవంతంగా నడుపుతున్న తీరు అనన్య సామాన్యం, అజరామరం. మొక్కవోని విశ్వాసంతో, అచంచలదీక్షతో, గుండె ధైర్యంతో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ప్రతిపక్ష నేతగా తన విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నారు.

ఈనాడు, అవినీతే లక్ష్యంగా పుట్టి తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న అక్రమ సంపాదనతో అరాచక శక్తిగా మారి మాయమాటలు, అసత్యపు వాగ్దానాలు, ఒక్క ఛాన్స్‌… ఒక్క ఛాన్స్‌ అని రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని చేపట్టిన వైఎస్సార్‌ పార్టీని అడుగడుగునా నిలువరిస్తూ, తట్టుకుంటూ, అలుపెరుగని పోరాటం చేస్తూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న మీ సామర్ధ్యం, రాజకీయ చతురత అందరి మన్ననలను పొందటం బహుధా ప్రశంసనీయం.

ఈ మహానభ నారా చందబాబునాయుడు కార్యదక్షతకు, ప్రతిపక్ష నేతగా ఆయన పోరాట పఠిమకు, ఆయన అచంచల విశ్వాసానికి అధికార పార్టీ కఠోర నిర్భంధాన్ని సైతం ఛేదిస్తూ, పార్టీని ముందుకు నడిపిస్తూ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోస్తున్న మన నేతకు ఈ మహాసభ జేజేలు పలుకుతూ హర్షాన్ని వ్యక్తం చేయాలని కోరుతున్నా.

2014 నుండి 2019 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలిపిన మీ ఘనత ప్రశంసనీయం. సమాజంలో పేద, వృద్దుల గౌరవాన్ని పెంచింది ఆనాడు మీరందించిన
రూ.2,000/- సాయం. వికలాంగుల మనస్సు ఆనందపడిరది మీరందించిన రూ.3,000/- సాయంతో  రైతుల కన్నీరు తుడిచింది మీరందించిన రైతు రుణమాఫీ పథకం. డ్వాక్రా మహిళల కష్టాలు తీర్చింది మీరు వారికిచ్చిన ఆర్థిక సాయం.

రాష్ట్రంలో రానున్న కరువును గుర్తించి, భూమిలో తేమలేదని గమనించి మీరు చేపట్టిన ఇంటింటా ఇంకుడుగుంతలు, వ్యవసాయ పొలాల్లో ఫాంపాండ్స్‌ మీ దూరదృష్టికి నిదర్శనం, మాకందరికీ గర్వకారణం. భారతదేశంలో కనీవినీ ఎరుగని రీతిలో కృష్ణా-గోదావరి నదులను అనుసంధానించి కృష్ణా డెల్టా రైతాంగాన్ని పట్టిసీమ ద్వారా ఆదుకున్న తీరు చూపరులను అబ్బురపరిచింది, విమర్శకుల నోళ్లు మూయించింది, రైతుల ఇంట సంతోషాన్ని నింపింది, అపర భగీరధుడిగా మిమ్ములను కీర్తించింది.

ఈ మహాసభ, కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవలసిన ఆవశ్యకత మన ముందున్నది. మన అధినేతపైనా, పార్టీ ప్రముఖ నాయకులపైనా అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికార మదంతో తప్పుడు కేసులు పెడుతూ, అడుగడుగునా నిర్భంధిస్తూ పార్టీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చాలని ప్రయత్నించిన తరుణంలో, మన అధినేత మొక్కవోని ధైర్యంతో ఈ అరాచక ప్రభుత్వాన్ని ఎదిరించి, కార్యకర్తలకు అండగా నిలిచి, పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నూరిపోశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ అస్మదీయులను అందలమెక్కిస్తూ సమర్థులైన తస్మదీయులను కూడా అడుగడుగునా ఇబ్బందులపాలు చేస్తున్న వైనం మన అధినేత మనస్సును బాధించింది.

అధికారులు సైతం ప్రభుత్వ అరాచకానికి భయపడి పలుచోట్ల అధికార పార్టీకి దాసోహం చేయడం ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం నొక్కుతున్నది. భావ స్వేచ్ఛ పూర్తిగా హరించబడిరది. వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని హేళన చేసింది. రాజ్యాంగాన్ని పలు సందర్భాల్లో ధిక్కరించింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చింది. ప్రతిపక్షాలు ఎన్నికల్లో పాల్గొనకుండా అడుగడుగునా అధికారగణాన్ని అడ్డుపెట్టుకుని నిలువరించింది.

శాంతిభద్రలు కాపాడవలసిన పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. కొన్నిచోట్ల పోలీసు వ్యవస్థ అధికారగణానికి ‘జీ హుజూర్‌’ పలికింది. పనికి ఆహార పథకం బిల్లులు మన పార్టీ వారికి చెల్లించలేదు. నీరు-చెట్టు పనుల చెల్లింపులు మన పార్టీ వారికి కావాలనే నిలిపేశారు. రాజకీయ చతురులైన మన నేత న్యాయస్థానాలను ఆశ్రయించి పార్టీ కార్యకర్తలకు అండగా, పెట్టనికోటగా నిలిచారు. సాక్షాత్తూ మన జాతీయ అధ్యక్షుల వారిని పలు దఫాలు ప్రజల మధ్యకు పోకుండా నిలువరించి, ఈ ప్రభుత్వం అభాసుపాలైంది.

మన అధినేత లక్ష్యంగా పలు తప్పుడు కేసులు బనాయించడానికి ఈ ప్రభుత్వం బరితెగించి ప్రయత్నించింది. పలు దఫాలుగా ప్రజల మధ్యకు వెళుతూ, జిల్లాలన్నీ పర్యటిస్తూ, కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోస్తూ, పార్టీని పటిష్టపరుస్తున్న నేపధ్యాన్ని గమనించిన అహంకార ముఖ్యమంత్రి, నూతన సంవత్సరం నిశిరాత్రి 12 గంటలకు జీఓ.1 తీసుకొచ్చి మన అధినేత పర్యటనలను అడ్డుకోవాలని ప్రయత్నించింది. అయినా, మొక్కవోని ధైర్యంతో పార్టీని నడుపుతూ, అవసరమైనచోట తానే కార్యకర్తల ముదుండి ఈ అరాచక పాలనను ఎదురొడ్డి పోరాడుతూ, న్యాయస్థానాలను ఆశ్రయించి జీఓ 1ను రద్దు చేయించిన ధీశాలి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు. ఆయన కార్యదక్షత చూచి రెట్టింపైన ఉత్సాహంతో తండోపతండాలుగా పార్టీ కార్యకర్తలు రోడ్డుకెక్కడంతో తోక ముడిచింది ఈ అరాచక ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ కొన్ని దురదృష్ట కారణాల వల్ల ఓటమి పాలైనా.. ప్రజాసేవలో, ప్రజలపక్షాన ప్రజా సమస్యలపై అహర్నిశలు పోరాటం చేస్తూ పూర్వ స్థితికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. పార్టీ నాయకులందరూ తరతమ భేదాలు మరిచి పార్టీ అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ పతాక రెపరెపలాడిరచి అధికారం చేపట్టడానికి అనువైన మార్గాలు వెతుకుతూ, పటిష్టంగా ఉన్న మన పార్టీ కార్యకర్తలందరినీ ఏకం చేస్తూ ముందుకు నడుస్తున్న విధానం కూడా అభినందనీయం.

తెలంగాణ రాష్ట్రంలో అవిశ్రాంతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా ఈ మహాసభ అభినందిస్తున్నది. అండమాన్‌ దీవుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పతాక రెపరెపలాడటం శుభసూచకం. అండమాన్‌ పార్టీకి కూడా పార్టీ జాతీయ అధ్యక్షులవారు రాష్ట్ర స్థాయి హోదా కల్పించి అక్కడ పార్టీ పటిష్టతకు పలు సూచనలు చేయడం, ఆ మార్గ నిర్దేశకత్వానికి అనుగుణంగా ఇటీవల జరిగిన అండమాన్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ పదవి మన పార్టీ అభ్యర్ధి చేపట్టడం సంతోషదాయకం. మన అధినేత ముందుచూపుకు నిదర్శనం. ఈ సందర్భంగా అండమాన్‌ తెలుగుదేశం పార్టీని కూడా ఈ మహాసభ అభినందిస్తున్నది.

అధినేత ఆలోచనతో, ముందుచూపుతో, ఈ అస్తవ్యస్థ పాలనకు స్వస్థిపలకటం కోసం ‘‘బాదుడే – బాదుడు’’ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అధిక ధరలమీద అలుపెరుగని పోరాటం చేసి ప్రభుత్వాన్ని నేలపైకి తెచ్చిన ఘనత, ఆలోచన మన అధినేతదే.. ఆగని ప్రభుత్వ అరాచకాలు ప్రజల ముందు ఉంచడం కోసం ‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ పేరుతో గడప గడపకు పార్టీని నడిపించి ప్రజలందరూ ఇదేం ఖర్మ జగన్‌ అనుకునేలా చేసిన ఘనత కూడా మన అధినేతదే.

యువగళం-ఇది ప్రజాగళం: ఈ ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్ర భవిష్యత్తు, ముఖ్యంగా, యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన నేపధ్యంలో, మీకండగా నేనున్నానని ముందుకొచ్చి, 400 రోజులు 4000 కి.మీ పాదయాత్ర చేసి యువతను చైతన్యం చేయడం కోసం, అరాచకపాలనా విధానాన్ని ప్రజలందరికీ తెలియజేయటం కోసం జనవరి 27 వ తారీఖున మన యువనేత, మనందరి ఆశాజ్యోతి, యువకిశోరం నారా లోకేష్‌ తన తండ్రి ప్రియపాత్రమైన కుప్పం నియోజకవర్గం నుంచి ‘‘పాదయాత్ర’’ ప్రారంభించి అప్రతిహతంగా 110 రోజులుగా సాగుతున్న తీరు బహుధా ప్రశంసనీయం.

అధికారపార్టీ గుండెల్లో రైళ్లు పరితెత్తిస్తూ, కాళ్లు బొబ్బలెక్కినా, కళ్లు వాచిపోయినా, యువత భవిష్యత్తే నా లక్ష్యం అంటూ ముందుకు నడుస్తున్న నారా లోకేష్‌ను ఈ మహాసభ అభినందిస్తూ ఆశీస్సులందిస్తున్నది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌములు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి శతజయంతి సంవత్సరమిది. దేశ విదేశాల్లో ఈ శతజయంతోత్సవాలు కడు వేడుకగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆ మహనీయుని కీర్తిగాధలు స్మరిస్తున్నాయి. ‘‘శక పురుషునిగా’’ తెలుగుజాతి యావత్తు ఆయనను కీర్తిస్తున్నది. విజయవాడ, హైదరాబాద్‌ నగరాల్లో శతజయంతి వేడుకలు కన్నులపండుగగా జరుపుకున్నాం. ఈరోజు నూరవ జయంతోత్సవాన్ని రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ అతిరధమహారధులు సమక్షంలో ‘‘మహానాడు’’ వేదికగా జరుపుకుంటున్నాం. ఈ మహానాడు ఆ మహనీయుని ఆశీస్సులభ్యర్ధిస్తున్నది.

ఎన్నికల సంవత్సరంలో అడుగుపెట్టాం. మన రాజకీయ ప్రత్యర్ధి జిత్తులమారి నక్క. అవినీతి సంపాదనతో మదమెక్కిన పొగరుబోతు. ఆ శక్తిని ఎదుర్కొనే మహాశక్తి మన అధ్యక్షుడు మాత్రమే. వారి అభీష్టాన్ని గుర్తెరిగి, వారి ఆదేశాల మేరకు నడిచి, వారికి అండగా నిలవవలసిన చారిత్రక అవసరం మనముందున్నది. అధికారంలో ఉన్న అవినీతి అనకొండను ఓడిరచడానికి, అధికార మదాన్ని దించటానికి మన అధినేత కార్యదక్షతకు, కఠోర శ్రమకు మనందరం సంపూర్ణ మద్దతిద్దాం. పలనాటి బాలచంద్రులుగా నడుం బిగించి కార్యరంగంలో దూకుదాం. ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉందాం. నాయకుడి మాటే మనకు ‘‘సుగ్రీవాజ్ఞ’’.

ఆర్యా! ‘‘మీరు ఆదేశించండి… మేం పాటిస్తాం’’ అనే నినాదంతో ముందుకు సాగుదాం. అధికార రాక్షస పాలనకు స్వస్తి పలుకుదాం. అందరం కార్యోన్ముఖులవుదాం. చంద్రబాబుకు జేజేలు పలుకుదాం. ‘‘జయం మనదే’’ అని ముందుకు నడుద్దాం.

చివరిగా.. ఈ మహానాడు వేదికపై ఇందరు అతిరథమహారధుల సమక్షంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నివేదిక సమర్పించే అవకాశాన్ని అతిసామాన్యుడినైన నాకిచ్చిన మీకు, మీ ఔదార్యానికి సర్వదా కృతజ్ఞుడనని తెలియజేస్తూ ఈ మహాసభ వద్ద శెలవు తీసుకుంటున్నా.

LEAVE A RESPONSE