Suryaa.co.in

Andhra Pradesh

రైతాంగాన్ని ఆదుకోవటానికి కేంద్రం ముందుకు రావాలి

` రైతుల కోసం ఢల్లీిస్థాయిలో ఉద్యమానికి సిద్ధం కావాలి
` రైతుల గోడు వినటానికి సీఎంకు నమోషీ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
`అఖిల పక్షం, రైతు సంఘాలు, ప్రజాసంఘాలు ధర్నా

విజయవాడ:: కరువు, తుపాన్‌లతో పంట నష్టపోయిన రైతాంగాన్ని, గ్రామీణ ప్రజలను ఆదుకోవటానికి కేంద్రం ప్రభుత్వం ముందుకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా సమితి సారధ్యంలో విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో గురువారం జరిగిన అఖిలపక్షం, రైతు సంఘాలు, ప్రజాసంఘాలు చేపట్టిన ధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తుపాన్‌తో రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే పేర్కొందన్నారు. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని కోట్లాది రూపాయల పెట్టుబడిని రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 440 కరువు మండలాలు ఉంటే కేవలం 143 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించి చేతులు దులుపుకుందని విమర్శించారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ఆ జిల్లా పరిషత్‌ సమావేశంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ కడపను కరువు జిల్లాగా ప్రకటించాలని తీర్మానం ప్రవేశపెడితే ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని చెప్పారు. వైసీపీకి చెందిన ఎంపీటీసీ, జడ్‌పీటీసీలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పని చేశారని తెలిపారు. ఈ అంశంపై సీఎం జగన్‌ సిగ్గుపడాలన్నారు. పులివెందులలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడ రైతుల్ని పరామర్శించలేదన్నారు.\

అధికారంలోకి రాకముందు గ్రామీణప్రాంతాల్లో పాదయాత్రలు చేసి తలమీద చేతులు వేసి ముద్దులు పెట్టిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను అంటుకోవటానికి సిగ్గుపడుతున్నారని ఆరోపించారు. పంట నష్టాన్ని పరిశీలించటానికి వెళ్లిన ముఖ్యమంత్రి స్టేజ్‌పై నిలబడి ఉంటే జాయింట్‌ కలెక్టర్‌ పొలంలో దిగి పంటను చూపిస్తే చూసివెళ్లటంలో అర్థం లేదన్నారు. క్రికెట్‌ క్రీడను చూడటానికి వచ్చారా? అని ప్రశ్నించారు. ఆరుగాలం పని చేసిన రైతు కాకుండా కార్యాలయంలో ఉంటే ఉన్నతాధికారి పొలంలో దిగి చూపించిన పంటతో నష్టం అంచనా వేస్తారా? అని నిలదీశారు.

కర్నాటక ముఖ్యమంత్రి సెప్టెంబరు మొదటి వారంలో క్యాబినెట్‌ మీటింగ్‌ పెట్టి కేంద్రానికి నివేదిక ఇస్తే అక్టోబరు మొదటి వారంలో కేంద్ర బృందాలు ఆ రాష్ట్రంలో పర్యటించటం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబరు 12, 13 తేదిలలో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయని చెప్పారు. జగన్‌ ప్రభుత్వం రైతాంగం పట్ల, గ్రామీణ ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. కరువు, తుపాన్‌ ప్రభావిత ప్రాంతంల్లో విద్యార్థులకు ఫీజులు మాఫీ చేయాలని కోరారు.

గ్రామీణ ఉపాధి హామి పనులు ప్రారంభించి గ్రామీణపేదలకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అవసరమైతే ఢల్లీిస్థాయిలో ఉద్యమించటానికి రైతులు, ప్రజానీకం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు, తుపాన్‌లతో దాదాపు 7 లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రైతాంగాన్ని ఆదుకోవాలని అనేకసార్లు ఉద్యమాలు చేసినా స్పందించకుండా కేంద్ర బృందాలు వస్తున్న నేపధ్యంలో వ్యవసాయశాఖ అధికారులు, డైరెక్టర్లు మాత్రమే స్పందించటం శోచనీయం అన్నారు.

పోలవరం నీటిని సక్రమంగా వినియోగించుకుని ఉంటే కరువు తీవ్రత కొంతవరకు తగ్గి ఇంత పంట నష్టం జరిగేది కాదన్నారు. నీటి నిర్వహణ తెలియకుండా, డ్రైనేజీలు, పంట కాల్వల్లో పూడిక తీయకపోవటంతో తుపాన్‌ కారణంగా పంట నష్టపోవటం జరిగిందన్నారు. కేవలం పొలాల్లో పనలపై ఉన్న పంటలను మాత్రమే కాకుండా కోసి నిల్వచేసుకోక నష్టపోయిన పంటలను కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్‌.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఒకే సీజన్‌లో కరువు, తుపాన్‌లు సంభవించటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి లేక వలస వెళుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉపాధి హామి పనులు ప్రాంభించిన 200 రోజుల పనిదినాలు, రోజుకు రూ.600 కూలీ చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. చెట్లు కూలిపోయి నష్టపోయిన పండ్ల తోటల రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ ఈ`క్రాప్‌తో సంబంధం లేకుండా నష్టపరిహారం నమోదులో కౌలు రైతులందరి పేర్లు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కొనుగోలు నింబంధనలు సడలించి మొలకెత్తిన రంగు మారిన ధన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. కొత్త పంటలు వేసుకవటానికి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

రైతు సంఘం సీనియర్‌ నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ ఎన్యూమరేషన్‌లో చోటు చేసుకున్న లోపాలను సరిచేయాలని డిమాండ్‌ చేశారు. వాస్తవ సాగుదారుల పేర్లను నమోదు చేయాలని సూచించారు. ఈ ధర్నాకు అధ్యక్షత వహించిన సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ కరువు, తుపాన్‌లతో పంటలకు భారీ నష్టం జరిగిన కారణంగా దీనిని జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 14 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్‌, రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ మల్నీడి యల్లమందారావు, ఆమ్‌ఆద్మీపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీఎస్‌.ఫణిరాజ్‌, జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర నాయకులు ఎస్‌కే.ఖాదర్‌భాషా, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర నాయకులు డి.హరినాథ్‌, రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.వీరబాబు, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుట్ట రాయప్ప తదితరులు పాల్గొన్నారు. సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి లంక దుర్గారావు వందన సమర్పణ చేశారు.

LEAVE A RESPONSE