Suryaa.co.in

Telangana

‘పసుపు’ రైతులో వెలుగు నింపడమే కేంద్రం ధ్యేయం

– కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

నిజామాబాద్: భారత హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న నిజామాబాద్ పట్టణానికి రానున్నారు. పసుపు పండించే రైతుల ఆకాంక్ష మేరకు పసుపు బోర్డు కోసం ఎంతోకాలంగా పోరాటాలు కొనసాగాయని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని పసుపు బోర్డు కార్యాలయాన్ని మంత్రి గురువారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

వివిధ రాజకీయ పార్టీలు పసుపు రైతులకు పలు హామీలు ఇచ్చినా, అమలు జరగలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డును ప్రకటించారు. దేశవ్యాప్తంగా పసుపు బోర్డు కార్యకలాపాలకు కేంద్రంగా నిజామాబాద్‌లో నేషనల్ హెడ్‌క్వార్టర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం గొప్ప విషయమన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలూ తమ రాష్ట్రాల్లోనే నేషనల్ హెడ్‌క్వార్టర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినప్పటికీ నిజామాబాద్‌కి మంజూరు చేసింది.

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేయడం ప్రధాని నరేంద్ర మోదీ తరఫున రైతులకు అందించిన బహుమతి అని తెలిపారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా నిజామాబాద్‌కు చెందిన రైతుబిడ్డను నియమించడం అభినందనీయం. 29న హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బోర్డు లోగోను ఆవిష్కరిస్తారు. అనంతరం రైతు సభలో ఆయన ప్రసంగిస్తారని తెలిపారు.

పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి బీజేపీ తరఫున నాయకులు, కార్యకర్తలు సంపూర్ణంగా పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు హాజరుకానున్నారు. నిజామాబాద్ జిల్లా అనేక ఏళ్ళుగా రైతు ఉద్యమాలకు కేంద్రబిందువుగా నిలిచింది. ఇది రైతు చైతన్యానికి ప్రతీకగా మారింది. గ్రామగ్రామాన రాజకీయాలకు అతీతంగా రైతులు సంఘాలుగా ఏర్పడి తమ సమస్యలపై పోరాడుతున్నారు.

స్థానిక నాయకులు, ఎంపీల కోరిక మేరకు కేంద్రం జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం ఈ ప్రాంత రైతులకు గర్వకారణం. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానిస్తున్నామని మంత్రి చెప్పారు. హిందూ సమాజంలో పసుపు పవిత్రతకు ప్రతీకగా నిలిచింది. వేదకాలం నుంచే శుభకార్యాలలోను, శాస్త్రీయ పద్ధతుల్లోను, ఆరోగ్య సంబంధిత అనేక అంశాలలోను పసుపు వినియోగంలో ఉంది.

పసుపు పండించే రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమే కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును ప్రకటించిన ఉద్దేశ్యం. ఈ బోర్డు ద్వారా ప్రతి రైతుకు ప్రయోజనం కలగాలన్న దృష్టితో, రైతులంతా సమన్వయపూరితంగా కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు.

బోర్డు ప్రారంభం అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అమిత్ షా తో పాటు ఇతర మంత్రులు, అధికారులతో కలిసి తదుపరి కార్యాచరణపై చర్చలు జరపనున్నారు. పసుపు ధరలు పెరిగేలా, వ్యాల్యూ యాడెడ్ ఉత్పత్తుల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు గౌరవం పెరగాలన్నదే ఉద్దేశ్యం. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుచేయడం ప్రధాని మోదీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి లభించిన ఒక అద్భుత బహుమతిగా చెప్పుకోవచ్చును అని అన్నారు.

డి. శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. వారి జీవితంలో చివరి దశలో బిజెపి కి దగ్గరయ్యారు. డి.శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి ఈ నెల 29న జరగనుంది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని అభ్యర్థించారు. అమిత్ షా ఈ అభ్యర్థనను పెద్ద మనసుతో అంగీకరించారు. 29న రైతు సభకు వెళ్లే క్రమంలో డి.శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంద కిషన్‌ రెడ్డి తెలిపారు.

LEAVE A RESPONSE