Home » వేదవిద్యార్ధుల మృతి బాధాకరం

వేదవిద్యార్ధుల మృతి బాధాకరం

– మంత్రి వెల్లంపల్లి, మల్లాది విష్ణు
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద కృష్ణ నదిలో ప్రమాదవశాత్తు వేద పాఠశాలకు చెందిన విద్యార్దులు, ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన బాధాకరమని రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస రావు, మల్లాది విష్ణు పేర్కొన్నారు.
శనివారం ఉదయం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల మార్చురిలో కృష్ణ నదిలో ప్రమాదవశాత్తు మరణించిన వేద విద్యార్దులు, ఉపాధ్యాయుని మృత దేహాలను రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస రావు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియా వారితో మాట్లాడుతూ
vishnu2వేద పాఠశాల సాంప్రదాయాల ప్రకారం శుక్రవారం సాయంత్రం సంధ్యావందనం చేయుట కొరకు గురువుగారితో కలసి ఐదుగురు విద్యార్దులు నదికి స్నానానికి వెళ్ళగా, నది ప్రవాహానికి ఒక విద్యార్ది మునిగిపోతుండగా కాపాడడానికి ప్రయత్నించి, మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు తెలిసిందన్నారు.
మాదిపాడు వద్ద ఏర్పాటైన శ్రీ శ్వేత శృంగాచలం వేదవేదాంత గురుకుల వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసించేందుకు ఇతర రాష్ట్రాల నుండి విద్యార్దులు వస్తుంటారని, కృష్ణ నది ప్రక్కనే వుండడం వలన సూర్య నమస్కారాలు, సంధ్యావందనం చేయడం ఆనవాయితీగా వస్తున్నదని శృంగేరి పీఠం అధ్యాపకులు తెలిపారన్నారు. ఇటువంటి తరుణంలో దురదృష్టవశాత్తు ప్రమాదం జరగడం తనను కలచి వేసిందన్నారు. కృష్ణ నదిలో ప్రమాదవశాత్తు మరణించిన వారిలో గుంటూరు జిల్లా నరసరావుపేట కు చెందిన సుబ్రమణ్య శర్మ తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన హర్షిత్ శుక్లా, శుభం త్రివేది, అన్షుమాన్ శుక్ల, నితిశ్ కుమార్ దీక్షిత్, మధ్యప్రదేశ్ కు చెందిన శివ శర్మ లు వున్నారని మంత్రి తెలిపారు.
జరిగిన ఘటనపై శృంగేరి పీఠం అధిపతులతో ఇప్పటికే మాట్లాడడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని తమకు సూచించినట్లు మంత్రి శ్రీనివాస రావు వెల్లడించారు. విద్యార్దులు, ఉపాధ్యాయుని కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా వుంటుందని, అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
జరిగిన ఘటనను విద్యార్డుల తల్లితండ్రులకు తెలియజేయడం జరిగిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులు వచ్చిన తరువాత మాట్లాడి వీరి మృత దేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తామన్నారు. మృత దేహాలను వారి వారి స్వస్థలాలకు తీసుకువెళ్ళేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని గుంటూరు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్ర శేఖర్ రెడ్డిని మంత్రి ఆదేశించారు.
కృష్ణ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసన సభ్యులు మరియు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ వేద విద్యను నేర్చుకునేందుకు వచ్చిన విద్యార్దులు మరణించడం దురదృష్టకరమన్నారు. శృంగేరి పీఠాధిపతులతో మాట్లాడి జరిగిన ఘటన పై విచారణ అనంతరం ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో నదీతీరాల వెంబడి వున్న వేద పాఠాశాలలు, ఆశ్రమాలలలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ద్వారా తెలియజేస్తున్నామన్నారు.
మరోసారి ఇటువంటి ఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, నగర మేయర్ కావటి శివనాగ మనోహర నాయుడు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ప్రభావతి, గుంటూరు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్ర శేఖర్ రెడ్డి, గుంటూరు డివిజన్ ఆర్ డి ఓ భాస్కర రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply