– బిల్లు చెల్లించాలి కానీ ఫుడ్ ఆర్డర్ చేయలేరు అన్నట్టు యూజీసీ కొత్త నిబంధనలు ఉన్నాయి
– రాష్ట్రాలు పాలన విభాగాలు కాదు దేశ పురోగతికి జీవనాడి
– తిరువనంతపురం జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
తిరువనంతపురం: మీరు బిల్లు చెల్లించాలి కానీ ఫుడ్ ఆర్డర్ చేయలేరు అన్న తరహాలో యు జి సి కొత్త నిబంధనలు ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రజల పక్షాన సమ్మేళనానికి హాజరైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ చర్చ ఎంతో విలువైనదిగా సీఎం రేవంత్ రెడ్డి భావించి, వారు ఈ సమ్మేళనానికి రాలేకపోయినప్పటికీ, రాష్ట్రాలు తమ సొంత విద్య భవిష్యత్తును రూపొందించుకోవడంలో స్వయం ప్రతిపత్తి కోసం బలమైన వాదన వినిపించేందుకు నన్ను పంపారని డిప్యూటీ సీఎం తెలియజేశారు.
గురువారం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఉన్నత విద్య సమ్మేళనంలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. ఈ సమ్మేళనం లో యూజీసీ ముసాయిదా నిబంధనల ప్రభావం, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో చేపట్టిన కార్యక్రమాల గురించి డిప్యూటీ సీఎం ముందుగా ప్రసంగించి.. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలకు నిధులు సమకూర్చడంతో పాటు నిర్వహించాలని మాత్రమే కేంద్రం భావిస్తు వైస్ ఛాన్సలర్ ల నియామకాల నుంచి అడ్మిషన్ల వరకు కీలకమైన నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగిస్తున్నారని వివరించారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రాలు భవనాలు ప్రారంభించే రిబ్బన్ కటింగ్ అధికారానికి మాత్రమే పరిమితమవుతాయని అన్నారు.
విద్య కేంద్రం గుత్తాధిపత్యం కాదు ఇది ఉమ్మడి జాబితాలోని అంశం అన్నారు. ఆయా రాష్ట్రాలు వారి ప్రజలకు, వ్యవస్థలకు సరిపోయే విద్యాసంస్థలను, వ్యవస్థలను నిర్మించుకుంటారని, ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి పోలిక ఉండదు అన్నారు. స్వయం ప్రతిపత్తి లేకుండా నాణ్యమైన విద్యను ఏ రాష్ట్రము అందించలేదు అన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న అంశాన్ని చర్చలకు పరిమితం కాకుండా అంతా కలిసి నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రాలు ఒక ఉమ్మడి లక్ష్యంతో ఐక్యమైనప్పుడు కేంద్రం తప్పక వినాలి అన్నారు.
రాష్ట్రాలు కేవలం పరిపాలన విభాగాలుగా మాత్రమే కాదు అవి ఈ దేశ పురోగతికి జీవనాడి వంటివి అన్నారు. ఒక రాష్ట్ర విద్యార్థుల నాడి, అక్కడ యువత ఆకాంక్షలు, అధిగ మించాల్సిన ప్రత్యేక సవాళ్లు ఆ రాష్ట్రాలకే తెలుస్తాయి అన్నారు. విద్యావ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నడపలేము, దానిని అవసరమైన చోట పెంపొందించాలి, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విధానాలను రూపొందించాలి అన్నారు.
సహకారం అంటే బలవంతం కాదు సంప్రదింపులు అని అర్థం, కేంద్రం నిజంగా సహకార సమాఖ్య వాదాన్ని విశ్వసిస్తే చర్చించాలి అన్నారు.రాష్ట్రాలు సహాయాన్ని అడగడం లేదు మన సరైన పాత్రను నొక్కి చెబుతున్నామని అన్నారు. రాష్ట్రాలు ఐక్యంగా గళం విప్పితే ఆ ప్రతిధ్వనులు ఎంత దూరమైనా చేరుతాయని చరిత్ర మనకు చెబుతుందని వివరించారు.
విద్య అంటే మనసులను తెరవడానికి మార్గం, తలుపులు మూసి వేయడానికి కాదు, స్వయం ప్రతిపత్తి, సుపరిపాలన ద్వారా మనకు మాత్రమే కాదు రాబోయే తరాలకు కూడా తెరిచి ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని అన్నారు.
అభివృద్ధికి మూల స్తంభం విద్య: డిప్యూటీ సీఎం
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎం వివరించారు. దీంతోపాటు సహకార సమాఖ్య వ్యవస్థ, యుజిసి తాజా నిబంధనలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
విద్యావంతులుగా, చురుకుగా, సంఘటితంగా, ఆత్మవిశ్వాసంతో ఉండండి.. ఎప్పుడు వదిలి పెట్టొద్దు అన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవన సూత్రాలను ఉదహరిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభించారు. అభివృద్ధికి విద్య మూలస్తంభంగా భావించి తెలంగాణ రాష్ట్రంలో విశాఖకు అత్యధిక ప్రాథమిక ఇచ్చినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపిస్తునట్టు తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ని నిర్మిస్తున్నామని, పాఠశాల మొదలుపెడితే విశ్వవిద్యాలయం వరకు ప్రాధాన్యత క్రమంలో ఉపాధ్యాయుల భర్తీ చేపట్టినట్టు తెలిపారు.
సాంకేతిక కోర్సుల్లో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, విద్యా రంగంలో డిజిటల్ తెలంగాణ కు ప్రోత్సాహం కల్పిస్తున్నామని, ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
సంక్షేమ హాస్టల్ విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థులు బోర్డు పరీక్షలతో పాటు పోటీ పరీక్షల్లో నిరంతరం అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ సంస్థల ప్రభావాన్ని నిరూపిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ నిరంతర విద్యా ప్రగతితో రాష్ట్రంలో విద్యార్థుల నమోదు నిష్పత్తి 40 శాతానికి పెరిగిందని, జాతీయ సగటు చూస్తే 28.4% గా ఉందని తెలిపారు.
విద్యా మరియు ఆరోగ్య రంగాల్లో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కేంద్రం గౌరవించాలని తెలిపారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి పై అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్ వర్సెస్ భారతీయ యూనియన్ కేసులో ‘భారతదేశం ఒక సమాఖ్య రాజ్యాంగ ఉందని’ పేర్కొన్న అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించారు. కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో ‘సమాఖ్య వ్యవస్థ భారత రాజ్యాంగంలోని ప్రామాణిక లక్షణం’ అని పేర్కొన్న సందర్భాన్ని డిప్యూటీ సీఎం సమ్మేళనంలో ఉదహరించారు.
యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ ల నియామకం, సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగించడం, వైస్ చాన్సలర్ ల అర్హత ప్రమాణాలను మార్చడం ఆందోళనకర అంశం అన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష తప్పనిసరి చేయడం మూలంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు.
బ్రూకింగ్స్ నివేదిక ప్రకారం భారతదేశంలోని ప్రతి ఉన్నత విద్యాసంస్థలు సగటున 690 మంది విద్యార్థులే ఉంటారు అయితే చైనాలో ఇది 16,000 గా ఉంది అన్నారు. మూడు వేల మంది విద్యార్థుల నమోదు కనిష్ట ప్రామాణికంగా పెడితే అనేక ఉన్నత విద్యాసంస్థలు మంచి ర్యాంకింగ్, ఫండింగ్ పొందే అవకాశాలు కోల్పోతాయి అన్నారు.
ఈ విధానం పెద్ద కార్పొరేట్ మరియు ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తుంది కానీ సంక్షేమ లక్ష్యంతో పని చేసే విద్య సంస్థలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంవత్సరానికి రెండు పరీక్షలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో మౌలిక సదుపాయాల కల్పన అదనపు బోధన సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది అన్నారు. దీనిని అమలు చేయాలంటే రాష్ట్రాలకు భారీగా ఆర్థిక వనరులు కేటాయించాలి అన్నారు. ఉన్నత విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలి అన్నారు.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కలిసి నిజమైన సమాఖ్య ఆత్మకు రూపం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తదుపరి సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని తద్వారా రాష్ట్రాల తరఫున కార్యాచరణ ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంటుందని తెలిపారు.
భారత దేశ ప్రజాస్వామిక లక్షణమే వైవిద్యం. ఈ ప్రాథమిక లక్షణాన్ని దెబ్బతీయకూడదని అన్నారు. సరైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంది, సరైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సమ్మేళనం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమ్మేళనలో కేరళ సీఎం. పినరయీ విజయన్, కేరళ ఉన్నత విద్య శాఖ మంత్రి ఆర్. బిందు, కర్ణాటక మంత్రి ఎం.సీ. సుధాకర్ అవారే, తమిళనాడు నుంచి తిరు గోవి చేజియాన్, పంజాబ్ నుండి సర్దార్ హరోజ్ సింగ్ తోపాటు ప్రముఖ విద్యావేత్తలు పాల్గొన్నారు.