Suryaa.co.in

National

నిత్య కృషీవలుడు.. చిరంజీవి

తెలుగు సినిమా ‘హీరో’ చిరంజీవిపై సోషల్ మీడీఅ(యా)లోనూ, ఇతరత్రాను అనవసరమైన, అవాంఛనీయమైన గొడవ జరుగుతోంది. ఈ పరిణామం పూర్తిగా పనికిమాలినతనం.

కుబేర సినిమా సభలో చిరంజీవి మాట్లాడినదానికి ఆయన్ను అభిశంసించడం, ఏవో పెడర్థాలు తియ్యడం, వక్రీకరణ చేయడం సరికాదు. ఎంత మాత్రమూ ఎవరికీ అది అవసరమైంది కాదు.

చిరంజీవి… తెలుగు సినిమా హీరో! అక్షరాల ఇది నిజం. తమిళ్ష్, కన్నడం, మలయాళం, హిందీ వంటి ఇతర భాషల వాళ్లకు కూడా హీరో చిరంజీవి. తెలుగు సినిమాలో ఎన్.టీ. రామారావు తరువాత జాతీయ స్థాయిలో హీరో అయింది చిరంజీవే. పొరుగు రాష్ట్రాల్లో పెరిగిన నాలాంటి వాళ్లకు ఇతరభాషల వాళ్లు కూడా చిరంజీవిని హీరోగా ఆమోదించడం బాగా తెలుసు.

ఎన్.టీ. ఆర్. తరువాత తెలుగులో చిరంజీవి ఏ మేరకు మాస్ హీరోనో, జాతీయస్థాయిలోనూ ఆ మేరకు చిరంజీవి గొప్పగా పరిగణించబడ్డారు. 80, 90 దశకాలాలో ‘తెలుగులో మగవాడైన హీరో అంటే అది చిరంజీవే’ అని ఇతరభాషల వాళ్లు గట్టిగానే అన్నారు, అనుకున్నారు.

ఒక దశలో అతి పేలవమైపోయిన తెలుగు సినిమా ‘హీరోయిజాన్ని’ సినిమాను ఇతరుల ముందు తలెత్తుకునేట్టు చేసింది చిరంజీవే.
బాలచందర్, బాపు వంటి విలువైన దర్శకులు తొలిదశలోనే చిరంజీవి గొప్పతనాన్ని గ్రహించారు. దీన్నిబట్టి చిరంజీవి ప్రతిభను మనం తెలుసుకోవచ్చు.

తెలుగు సినిమా హీరో అన్నదాన్ని పేడితనం నుంచి బయటపడేసింది చిరంజీవే.

ఎన్.టీ. రామారావు తరువాత తెలుగులో రజనీకాంత్, అమితాబ్ వంటి వాళ్లకున్న స్క్రీన్ ప్రెసెన్స్ ఒక్క చిరంజీవికే ఉంది. ఫైట్స్, డాన్స్ విషయంలో తెలుగులో నిజమైన హీరో చిరంజీవే. ఫైట్స్, డాన్స్ ఈ రెండిటినీ సమర్థవంతంగా చిరంజీవిలా చెయ్యగల హీరో ఇప్పటివరకూ మనదేశంలో రాలేదు. డాన్స్ పరంగా కమల్ గొప్పవాడైనా ఫైట్స్ పరంగా చిరంజీవే మేలు.

మాస్ హీరో మాత్రమే కాదు చిరంజీవి గొప్ప నటుడు కూడా. రుద్రవీణ సినిమాలో చిరంజీవి పాత్రను తమిళ్ష్‌లో ఉన్నాల్ ముడియుమ్ తమ్బి సినిమాలో కమల్ హాసన్ చేశారు. ఆ పాత్రను కమల్ కన్నా చిరంజీవే గొప్పగా చేశారు. ఆ పాత్ర పరంగా చిరంజీవి బాడీ లాంగ్వేజ్, అభినయం, వాచికం కమల్ కన్నా చిరంజీవివే గొప్పగా ఉంటాయి. తమిళ్ష్‌ వాళ్లే ఈ వాస్తవాన్ని ఒప్పుకున్నారు.

మొదట్నుంచీ చిరంజీవి తానొక గొప్ప నటుణ్ణి అని చాటుకుంటూనే ఉన్నారు. కె. విశ్వనాథ్ శుభలేఖ సినిమా నుంచే కాదు, కె. బాలచందర్ ఇది కథ కాదు సినిమా నుంచే మనకు చిరంజీవి గొప్ప నటుడు అని తెలుస్తూనే ఉంటుంది.

తెలుగులో ఎన్.టీ.ఆర్. తరువాత మాస్ హీరో అవడమూ దానితో పాటు ప్రతిభావంతుడైన నటుడు అవడమూ అన్న రెండు అంశాలూ చిరంజీవిలోనే ఉన్నాయి. అదే విధంగా ఎన్.టీ.ఆర్. తరువాత దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో చిరంజీవే. ఎన్. టీ. ఆర్. లాగా ‘ఒరిజినాలిటీ’ ఉన్న తెలుగు ప్రముఖనటుడు చిరంజీవి. ఔను, చిరంజీవి ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ ప్రముఖ నటులను అనుకరించలేదు. (ఎన్.టీ.అర్. కూడా ఏ ఇతర నటుడివల్ల స్ఫూర్తిని పొందలేదు)

తమిళ్ శివాజీ గణేస(శ)న్ పై అంతర్జాతీయ నటుడు Gregory Peck వంటి కొందరు నటుల ప్రభావం ఉంది. కమల్ హాసన్ మీద కొంత మంది ఇంగ్లిష్ నటుల ప్రభావం ఉంది. తమిళ్ష్ cult hero ఎమ్.జీ. రామచంద్రన్ మీద కూడా Burt Lancaster వంటి ఒకరిద్దరి ఇంగ్లిష్ నటుల ప్రభావం ఉంది. ప్రముఖ అంతర్జాతీయ నటుడు Paul Muni ప్రభావం మనదేశంలోని కొందరు (హిందీ నటుడు అశోక్ కుమార్, మన నాగయ్య వంటి) గొప్ప నటులపై ఉంది (Dilip kumar పై Marlon Brando ప్రభావం లేదు). చిరంజీవి ఒరిజినాలిటీ ఉన్న ప్రముఖ నటుడు.

ప్రవర్తన పరంగానూ చిరంజీవి తమిళ్ రజనీకాంత్ (రజినీకాంత్ కాదు)లాగా ఎంతో మేలుగా ఉంటారు. మామూలుగా తెలుగువాళ్లలో ఎక్కువగా కనిపించే పొగరు, ఒళ్లు బలుపు, దురంహకారం, తొందరపాటుతనం, తమను తాము మేధావులమనుకోవడం వంటి అవలక్షణాలు చిరంజీవిలో కనిపించవు; నైసర్గికంగా తెలుగువాళ్లలో ఉండే కొన్ని దుర్లక్షణాలు చిరంజీవిలో కనిపించలేదు.

చిరంజీవికి వచ్చిన విజయం పుర్తిగా స్వయంకృషితో సాధించికున్నది. ఒక దశ తరువాత చిరంజీవి తెలుగు సినిమాకు identity. ఎన్.టీ.ఆర్. తరువాత తెలుగు సినిమా హీరోయిజమ్ icon చిరంజీవి.

ఏ రాజకీయ కారణాలవల్లో, ఏ బుద్ధిమాంద్యంతోనో, సరైన ఆలోచన చెయ్యలేని చాతకానితనంతోనో, ఆసంబద్ధంగానో చిరంజీవి విషయంలో ఇలా రచ్చ జరుగుతుండడం గర్హనీయం.

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE