Suryaa.co.in

Telangana

ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

-మురుగు నీటి శుద్ధిపై ప్రత్యేక దృష్టి
-చెరువులు, మూసి న‌దిలోకి మురుగు నీరు చేర‌కుండా చ‌ర్య‌లు
-గ్రేట‌ర్ లో 31 ఎస్టీపీల నిర్మాణం
-కాలుష్యకారక పరిశ్రమల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హరించాలి
-పీసీబీ స‌మీక్ష‌లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హైద‌రాబాద్, డిసెంబ‌ర్ 20: రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. మురుగు నీటి శుద్దీక‌ర‌ణ‌కు ఎస్టీపీలను, పారిశ్రామికవాడల్లోనూ కామన్ ఎఫ్లుయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ (సీఈటీపీ), నెలకొల్పి అంతర్జాతీయ స్థాయిలో కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించేలా చూడాలని పీసీబీకి స్పష్టం చేశారు.

హ‌రిత‌హారం లాంటి కార్య‌క్ర‌మాల వ‌ల్ల తెలంగాణ‌లో గ్రీన్ క‌వ‌ర్ పెంచి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపినట్టుగానే కాలుష్య నియంత్రణలోనూ ముందుండేలా ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళ్ళాల‌ని సూచించారు. సీయం కేసీఆర్ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ఎంతో ప్రాధ‌న్య‌త‌నిస్తారని, అలాగే ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించే ప‌రిశ్రమ‌ల మూసివేత‌కు కూడా వెనుక‌డుగు వేయరాద‌ని స్ప‌ష్టం చేశారు.

అలాగే, రాష్ట్రంలో ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద‌ని అందుకు అనుగుణంగా పీసీబీ అధికారులు ప‌ని చేయాల‌ని కోరారు. అదే విధంగా జీహెచ్‌ఎంసీ, టీఎస్‌పీసీబీ, హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బీలు స‌మిష్టిగా స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తూ నీటి వనరులలోకి ప్రవేశించే మురుగునీటిని శుద్ధి చేసేలా నిరంతరం కృషి చేయాల‌న్నారు.

మంగ‌ళ‌వారం అర‌ణ్య భ‌వ‌న్ లో ఎస్టీపీ, సీఈటీపీల ఏర్పాటు, జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్ర‌ణ‌- నివార‌ణ‌, ప్ర‌త్యామ్నాయ మార్గాల అన్వేష‌ణ‌, కాలుష్య కార‌క ప‌రిశ్ర‌మ‌లపై తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.ఈ స‌మావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, పీసీబీ సీఈ ర‌ఘు, ఎస్ఈఎస్ డి.ప్ర‌సాద్, ఎన్విరాన్మెంటల్ ఇంజ‌నీర్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు
ఈ సంద‌ర్భంగా అన్ని ర‌కాల కాలుష్య కార‌కాలు, నియంత్ర‌ణకు పీసీబీ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి అధికారులు మంత్రికి వివ‌రించారు.

పట్టణాలు, నగరాల్లోంచి వెలువడుతున్న మురుగు నీరు నేరుగా నదులు, కాలువల్లో కలువకుండా పీసీబీ ప్ర‌త్యేక దృష్టి పెట్టి మురుగు నీటి శుద్ధికి అధిక ప్రాధాన్యత‌నిస్తున్నామ‌ని తెలిపారు.

రూ. 3,866 కోట్ల అంచ‌నా వ్య‌యంతో 1259 ఎంఎల్ డీ మురుగునీటిని శుద్ధి చేసేందుకు 31 ఎస్టీపీల నిర్మాణ ప‌నులు ప్రారంభించామ‌ని తెలిపారు. వీటి నిర్మాణం పూర్తైతే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 100% మురుగు నీరు శుద్ధి అయ్యే అవ‌కాశం ఉంద‌ని, దీంతో మూసీ న‌దితో పాటు చెరువులు, కుంట‌ల్లో మురుగునీరు చేరే అవ‌కాశం ఉండ‌ద‌ని మంత్రికి తెలిపారు
ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్ ప‌రిస‌ర ప్రాంతంలో వాయు కాలుష్యానికి కారణమౌతున్న 12 స్టోన్ క్రషర్స్ సీజ్ చేసి, జ‌రిమానా విధించిన‌ట్లు వివ‌రించారు.

చౌటుప్ప‌ల్, సూర్య‌పేట్ ప్రాంతాల్లో ర‌సాయ‌న (ద్ర‌వ‌), ఘ‌న‌ వ్య‌ర్ధాల‌ను నీటి వ‌నరుల్లో పార‌బోస్తూ జ‌ల కాలుష్యానికి కార‌ణ‌మ‌వుతున్న‌ 10 ప‌రిశ్ర‌మ‌ల‌పై చర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

జ‌వ‌హర్ న‌గ‌ర్ డంప్ యార్డ్ వ‌ల్ల‌ మ‌ల్కారం చెరువులోకి వ్య‌ర్ధ జ‌లాల‌ను అత్య‌ధునిక ప‌ద్ధ‌తిలో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో రాంకీ సంస్థ ఆద్వ‌ర్యంలో నీటి శుద్ది కోసం ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నార‌ని, దీని వ‌ల్ల వ్య‌ర్ధ జలాల వ‌ల్ల చెరువులు, భూగర్బ జ‌లాల కాలుష్యాన్ని నియంత్రించ‌నున్న‌ట్లు తెలిపారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో వాయు కాలుష్యాన్ని త‌గ్గించేందుకు ఇ- వెహిక‌ల్ ఫాల‌సీని ప్ర‌వేశ‌పెట్ట‌డంతో పాటు ప‌ర్యావ‌ర‌ణ‌హిత వాహ‌నాల‌ను వాడేలా వాహ‌న‌దారుల‌ను ప్రోత్స‌హించేందుకు స‌బ్సిడీ ఇస్తున్న‌ట్లు చెప్పారు. ట్రాఫిక్ ర‌ద్దీని త‌గ్గించేందుకు ర‌హ‌దారుల అభివృద్ది, 216 ర‌హదారులకు బ్లాక్ టాపింగ్ చేశామ‌న్నారు.

LEAVE A RESPONSE