Suryaa.co.in

Political News

‘కారు’ కింది నేల కదులుతోంది..

-ఫామ్ హౌస్‌లో కూర్చుంటా అన్నప్పుడే…
-ఓటమి భయంతోనే వైరల్ ఫీవర్
-దళిత బంధు కాదు.. అధికారం బంధు

తమ సమస్యలు చెప్పుకునేందుకు సీఎం నుంచి కింది స్థాయి నాయకుల వరకు ఎవరూ అందుబాటులో లేని స్థితిలోనే ప్రజలు ఇక చాలని బీఆర్ఎస్‌ని సాగనంపారు. ఇప్పటికైనా ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించి, కేసీఆర్ నేలమీదకు దిగి వాస్తవ దృక్పథంతో ఆలోచించకపొతే పార్లమెంటు ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు దక్కడం కూడా కష్టమే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జై కొట్టి జనం ఘనవిజయం అందించారు. దీనికి కారణాలు ఎన్నో.. కేసీఆర్ నాయకత్వంలో 2018లో 88 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇంకేముంది… మంత్రుల, ఎమ్యెల్యేల ఆగడాలు నేలమీద దిగితే ఒట్టు. ఇక నియోజకవర్గాల్లో జరుగుతున్న అక్రమాలు, వసూళ్లు, తీరని బాధలు చెప్పుకుందామంటే కేసీఆర్ కలవరు, కేటీఆర్ దొరకడు, స్థానిక ఎమ్మెల్యే బాధితుడికి భరోసా ఇవ్వడు. ఈ తతంగం చూసి అనుభవించి మార్పు అవసరమేనని 30 నియోజకవర్గాల్లో బహిరంగంగానే పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్‌కు పదేండ్లు అవకాశం ఇచ్చినాము, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇయ్యకూడదని, ఈ సారి ఇస్తామని చెప్పి పట్టం కట్టినరు.

ఒకరు భూకబ్జాదారుడనీ, ఒకడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడనీ, ఉద్యమకారులను పట్టించుకోవడం లేదనీ, ప్రతి పనికి పర్సెంటేజ్ వసూల్ చేస్తున్నారనీ, ఒకడు చిన్న, పెద్ద లేకుండా అహంకారంతో మాట్లాడుతున్నారనీ జనం ఘోష పెడుతున్నా గత పాలకులు పట్టించుకోలేదు. ఎన్నో బాధలు దిగమింగి పార్టీని వదులుకోక ఉన్న క్రమంలో, ద్వితీయ శ్రేణి నాయకుల ఆశల మీద నీళ్లు చల్లి, కేసీఆర్ 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి అపజయానికి బాటలు వేసుకున్నారు.

కేసీఆర్ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థుల గెలుపు బాధ్యతను నెత్తికెత్తుకుని ప్రతిరోజూ కాలుకు బలపం కట్టుకుని రోజుకు నాలుగు, ఐదు నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అభిమానుల సోషల్ మీడియా పుణ్యమా అని పోటీ క్లైమాక్స్‌కు చేరింది. అచ్చంపేట సభలో గెలిపిస్తే సేవ చేస్తా, ఓడిస్తే వ్యవసాయ క్షేత్రంలో కూర్చుంటా అని కేసీఆర్ చెప్పడంతో కారు కింది నేల కదులుతుందని అర్థమైపోయింది.

అభ్యర్థుల ప్రకటన నుంచి అక్టోబర్ వరకు బాగున్నా.. నవంబర్ నాటికి దినదినం బీఆర్ఎస్ ప్రభ మసకబారుతోందనేది అర్థం అయ్యింది. కేసీఆర్‌కు వచ్చిన వైరల్ పీవర్ కూడా ఓటమి భయంతో వచ్చిందని ప్రత్యర్థులు బలంగా ప్రచారం చేసి ప్రజలను మెప్పించ కలిగినారు. కేసీఆర్ తనయ లిక్కర్ కేసు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అపఖ్యాతి, ఉద్యోగుల వ్యతిరేకత కారణంగానే విజయ తీరాలకు చేరాలనే ప్రయత్నం గండి కొట్టింది. కేసీఆర్ మార్చిన 11 సీట్లలో 9 గెలిచింది. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్స్ ఇవ్వడం వల్లనే ఓటమి తప్పలేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కేటీఆర్ భజన తప్ప, ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో అంతగా సఫలం కాలేదు.

దశాబ్దం పాటు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వంపై సహజంగా ప్రజల్లో ఏర్పడే వ్యతిరేకత కూడా కొన్ని సెగ్మెంట్లలో ఖచ్చితమైన ప్రభావాన్ని చూసింది. హుజురాబాద్ ఎన్నికల్లో గెలవాలని దళితుల ఓట్ల కోసం దళిత బంధు తెచ్చి వేల కోట్ల రూపాయలు వెచ్చించినా బొక్కబోర్లా పడ్డది. శాసనసభ ఎన్నికల్లో దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపిక వ్యతిరేకతను మరి కాస్త పెంచింది. అదే బీఆర్ఎస్ అధికారం బందుకు కారణమైంది.

అదే సమయంలో ప్రతిపక్ష స్థానంలో స్థిరంగా నిలబడి అధికారమే లక్ష్యంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ వైఫల్యాలు ఆయుధంగా పనిచేసాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆరు గ్యారెంటీల అమలుపై నాలుగు రోజులు ఓపిక పట్టకుండా బీఆర్ఎస్ నేతలు అక్కసు వెళ్లగక్కడం ప్రజలు జీర్ణించుకోవడం లేదు.

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, ఎదురుదెబ్బలు గుణపాఠంగా తీసుకోకుండా కేటీఆర్, హరీశ్ కవిత అండ్ కంపెనీ ఎదురుదాడి చేస్తే, పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కేసీఆర్ ఇప్పటికైనా ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించి, నేలమీదకు దిగి వాస్తవ దృక్పథంతో ఆలోచించకపోతే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు దక్కడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

– నార్ల రాజేష్

LEAVE A RESPONSE