– కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్
– భారత్ టెక్స్ 2025లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ పావిలియన్ ప్రారంభం
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వృద్ధిలో హస్తకళ రంగం కీలక భూమిక పోషిస్తోందని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన భారత్ టెక్స్ 2025లో ఆంధ్రప్రదేశ్ పావిలియన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి, పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమమైన హస్తకళ సంప్రదాయాలకు నిలయంగా ఉందన్నారు. ఈ కేంద్రం మన కళాకారుల నైపుణ్యానికి అద్దం పడుతుందన్నారు పరిశ్రమ పునరుద్ధరణ, మార్కెట్ విస్తరణ, స్థిరమైన అభివృద్ధికి అనుగుణంగా, శిల్పకారులను మద్దతు ఇవ్వడంపై . ప్రభుత్వ దృష్టి సారించిందన్నారు.
రేఖా రాణి మాట్లాడుతూ భరత్ టెక్స్ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం పొందుతారన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కి అనుసంధానం కావడంతోపాటు, శిల్పకారుల స్థిరమైన అభివృద్ధికి ఈ ప్రదర్శన దోహదపడుతుందని వివరించారు.
పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, హస్తకళలు కేవలం సంప్రదాయం మాత్రమే కాదని, వేలాది కుటుంబాలకు జీవనోపాధి మార్గంమని పేర్కొన్నారు. ఈ ప్రదర్శన ద్వారా కళాకారుల మార్కెట్ విస్తరించి వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. భరత్ టెక్స్ 2025లో ఆంధ్రప్రదేశ్ పావిలియన్ సందర్శకులకు అందుబాటులో ఉంటూ, నైపుణ్య కలిగిన శిల్పకారుల ప్రత్యక్ష ప్రదర్శనలు, రాష్ట్ర సంప్రదాయ వస్త్ర సంపదను పరిశీలన, ప్రామాణిక హస్తకళ వస్త్రాలను కొనుగోలు చేసే వీలును కల్పించనుంది.
రాష్ట్రంలోని వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, ఉప్పాడ, కలంకారి వంటి ప్రసిద్ధ హస్తకళ వస్త్ర సంపదను ఇక్కడ ప్రదర్శిస్తుండగా, దేశీయ, అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ హస్తకళ కళాకారులకు గుర్తింపు కల్పించడం, మార్కెట్ అవకాశాలను పెంచడం ఈ ప్రదర్శన ముఖ్య లక్ష్యంగా ఉంది. కార్యక్రమంలో ఎంఎస్ ఎంఇ కార్పొరేషన్ సిఇఓ, లేపాక్షి ఎండి ఎం. విశ్వ, చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు శ్రీకాంత్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.