Suryaa.co.in

Andhra Pradesh Features

“గండికోట” ముంపు వాసుల గుండె రోదిస్తోంది

నేను ఈ రోజు గండికోట జలాశయం ముంపు ప్రాంతాలను సందర్శించి, బాధితులతో మాట్లాడాను. గండికోట జలాశయం ముంపు ప్రాంతం ఫేస్ -I పరిధిలోని బాధితులైన 10,231 కుటుంబాలకు పునరావాస పథకం క్రింద రూ.451.6 కోట్ల పరిహారం చెల్లించడానికి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొని, ప్రకటించింది. ఫేజ్-II మరియు III లోని ముంపు బాధితులకు చెల్లించిన తరహాలోనే ఫేజ్-I బాధితులకు కూడా రూ.10 లక్షల చొప్పున ప్యాకేజీ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటంచింది.

గండికోట జలాశయం ముంపుకు గురైన 22 గ్రామాల బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం. వైఎస్సార్ ప్రభుత్వం 2007ను కటాప్ డేట్ గా నిర్ధారించి, 18 సం.లు నిండిన వారికి నష్టపరిహారం క్రింద రు.1,86,000 చెల్లించింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కటాఫ్ డేట్ ను 2017 సెప్టెంబరు 30 వరకు పెంచి, నష్టపరిహారాన్ని రు 6,75,000 చెల్లించింది.

గండికోట జలాశయం ముంపు బాధితులకు పునరావాస పథకం క్రింద పరహారాన్ని రు.10,00,000 లకు పెంచి, చెల్లిస్తామని 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని అమలుచేయమని నిర్వాసితులు పలు రూపాల్లో ఆందోళనలు చేశారు. ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించిన తర్వాతే గండికోట జలాశయంలో నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేస్తామని శాసనసభలో కూడా హామీ ఇచ్చారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధాలకు భిన్నంగా గండికోట జలాశయంలో పూర్తి స్థాయిలో 26.85 టియంసి నిల్వ చేసి, నిర్వాసితులను నీట ముంచారు. ఆ పరిణామాన్ని ఊహించని ముంపు బాధితులు తీవ్రమనోవేదనతో నివాసల్లోని సామాగ్రిని కూడా వదిలేసి కట్టుబట్టలతో ఇతర ప్రాంతాలకు వెళ్లి తదాచుకున్నారు. ముంపువాసులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పూర్వరంగంలో, ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా రూ.451.6 కోట్ల పరిహారం చెల్లించడానికి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొన్నది. ఆలస్యంగానైనా మంత్రివర్గం తీసుకొన్న నిర్ణయం ముంపు బాధితులకు ఉపశమనం కలిగించే నిర్ణయం.

కానీ, ఎంత వరకు జీ.ఓ. విడుదల చేయలేదు. మరొకవైపున ముంపు బాధితులు మళ్ళీ ఆధార్, రేషన్ కార్డు, తదితర ఆధారాలను సమర్పించి, బాధితులమని రుజువు చేసుకోవాలని షరతులు పెట్టడం అత్యంత గర్హనీయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వ కాలంలో రు.6,75,000 పరిహారం చెల్లించిన బాధితుల జాబితా ప్రభుత్వం వద్ద ఉంది. దాని ప్రకారం ప్రభుత్వం నిర్ణయం ప్రకారం అదనంగా ఇస్తామంటున్న రు.3,25,000 లను బాధితుల బ్యాంకు ఖాతాల్లో బేషరతుగా జమ చేయాలని కోరుతున్నారు. బాధితుల డిమాండ్ న్యాయబద్ధమైనది. ముంపు బాధితులుగా మళ్ళీ రుజువు చేసుకోవాలన్న షరతు విధించి, బాధితులను వేధించి, అవినీతికి పాల్పడే అవకాశాన్ని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ప్రభుత్వం కల్పించకూడదని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.

పరిహారాన్ని చెల్లించడానికి రెండు, మూడు నెలల వరకు వయస్సుకు సంబంధిన కటాఫ్ డేట్ పెంచి, 18 సం.లు నిండిన వారికి పరిహారం చెల్లిస్తామని గత ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ చేసిన వాగ్దానాన్ని కూడా అమలు చేయాల్సిన నైతిక బాధ్యత ఉన్నది.

నీట మునిగి ఉన్న తాళ్ళప్రొద్దుటూరు గ్రామాన్ని సందర్శించాను. గ్రామస్తులు ఇళ్ళల్లో వదిలేసి వచ్చిన సామాన్లు తెచ్చుకోవడానికి వీలుగా గండికోట జలాశయం నుండి కొంత నీటిని క్రిందికి వదిలిపెట్టి సహకరించాలని కోరుతున్నట్లు బాధితులు నా దృష్టికి తీసుకొచ్చారు.

ప్రభుత్వ బాధ్యతారహిత్యానికి ప్రబల నిదర్శనంగా నీట మునిగిన విద్యుత్ సబ్ – స్టేషన్, ట్రాన్స్ ఫార్మర్ లు దర్శనమిస్తున్నాయి. వాటి పరిధిలోని వినియోగదారులు విద్యుత్ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. చుట్టుప్రక్కల ఉన్న సబ్ – స్టేషన్ల నుండి సర్దుబాటు ద్వారా నెట్టుకొస్తున్నారు. బాధితులను పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలకు తరలించకుండా, బలవంతంగా ఖాళీ చేయించాలని అప్రజాస్వామిక చర్య వల్ల ఈ దుష్ఫలితాలను ప్రజలు అనుభవించాల్సి వచ్చింది.

కొండాపురం మండలంలో ముంపు వల్ల 18 గ్రామాల ప్రజలకు రహదారి సౌకర్యం లేకుండా పోయింది. పెన్నా నదిపై బ్రిడ్జి నిర్మాణం ద్వారా సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం దాదాపు 30 కోట్లు మంజూరు చేసి, నిర్మాణ పనులు చేపట్టిందని, నదిలో ఆరేడు పిల్లర్స్ నిర్మాణం పునాదుల స్థాయికిపైగా పనులు జరిగాయని తీసుకెళ్ళి చూపించారు. నేను ప్రత్యక్షంగా చూశాను.

ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆపేసింది. ఇప్పుడు ఆ గ్రామాలకు రాకపోకలు కనాకష్టంగా తయారయ్యాయి. 50, 60 కి.మీ.లు ప్రయాణించి, తాడిపత్రి సమీపంలోని బ్రిడ్జి మీదుగా దాటుకొని, ఆ గ్రామాలకు వెళుతున్నామని ఆవేదనతో తెలియజేశారు. బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటి వరకు చేసిన వ్యయం వృధా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలి.

ఆ గ్రామస్తులు ఒక దుర్మార్గమైన ప్రభుత్వ చర్యను నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి సమీపంలో ఉన్న ఇసుక, మట్టి దిబ్బలను తొలగించి, తాత్కాలిక దారి ఏర్పాటు చేసుకొంటుంటే, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని అక్రమ కేసులు పెట్టి అధికారులు వేధిస్తున్నారని తెలియజేశారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు ప్రభుత్వం తక్షణం స్వస్తి చెప్పాలి.

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

LEAVE A RESPONSE