Suryaa.co.in

Andhra Pradesh

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం

– పేద ముస్లింలను ఆర్థికంగా పైకి తీసుకొస్తాం
– వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షిస్తాం
-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
– విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం
– మత పెద్దలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన సీఎం చంద్రబాబు

విజయవాడ : విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.

‘పేదరికంలో ఉన్న ముస్లిం కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొస్తాం. ముస్లింలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. వక్ఫ్ బోర్డు ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉంది. 40 ఏళ్లుగా ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నా. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం. రంజాన్ మాసమంతా కఠోర దీక్షతో ఉండే ముస్లిం సోదరులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదొక పవిత్రమైన ఆచారం. సమాజ శ్రేయస్సు కోసం ముస్లిం సోదరులు దువా చేస్తున్నారు. ఆర్థికంగా బాగున్నవారు పేదలకు సాయం చేయడమే ఖురాన్ నేర్పించిన మంచి గుణం’ అని అన్నారు.

ముస్లింలతో టీడీపీకి బలమైన అనుబంధం

‘ముస్లింలతో టీడీపీకి బలమైన అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలకు మేలు జరిగింది టీడీపీ హయాంలోనే. మొట్టమొదటిసారి ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఉర్దూను రెండో భాషగా చేశాం. హైదరాబాద్ నుంచి మక్కాకు వెళ్లేందుకు హజ్ భవనం నిర్మించాం. వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణకు టీడీపీ కృషి చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో, విభజన తర్వాత కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.

కడపలో హజ్‌హౌస్ నిర్మించాం. విజయవాడలో నిర్మించతలపెడితే గత ప్రభుత్వం నిలిపేసింది. 2014-2019 మధ్య రూ.163 కోట్లతో 32,722 మంది మైనార్టీ వధువులకు దుల్హన్ సాయం అందించాం. పండుగ నాడు పేద ముస్లింలు పస్తులుండకూడదని రంజాన్ తోఫా అందించాం.’ అని సీఎం అన్నారు.

మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఇమామ్, మౌజన్‌లకు గౌరవవేతనం

మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగానే ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలకు గౌరవ వేతనం పెంచాం. మొన్నటి బడ్జెట్‌లో ముస్లిం మైనారిటీలకు రూ.5,434 కోట్లు కేటాయించాం. గత బడ్జెట్ కంటే రూ.13 వందల కోట్లు అదనంగా కేటాయించాం. మత సామరస్యాన్ని కాపాడటమే కాకుండా అన్ని విధాలా ముస్లింలను పైకి తీసుకొస్తాం. జకాత్ స్ఫూర్తితో మీరు సంపాదించిన దాంట్లో కొంత పేదలకు ఖర్చు చేసేందుకు ముందుకు రండి.

పేదరిక నిర్మూలన కోసం పీ4 కార్యక్రమాన్ని ఈ మాసంలోనే ప్రవేశపెడుతున్నాం. అగ్రభాగాన ఉన్న 10 శాతం మంది అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలకు సహకారం అందిస్తారు. ఇప్పటికీ పేదలు మూడు పూట్లా సరైన తిండి, చదువు లేక ఆర్థిక అసమాతనలకు గురవుతున్నారు. నేను పేదల పక్షం ఉండాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా. అందుకే పీ4 విధానంతో పేదరికం నుంచి పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE