• మత్స్యకారుల ఉనికిని దెబ్బ తీసే జీవో 217ను చించేస్తున్నా
• తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవాలి… లేని పక్షంలో ఆందోళనలకు దిగుతాం
• అవసరమైతే జైలుకు వెళ్ళేందుకు సిద్ధం
• లేని సమస్యలు సృష్టించడంలో వైసీపీవాళ్ళు సిద్ధహస్తులు
• పరిష్కరించండని వంగి వంగి దండాలు పెట్టాలా? ఇదేమైనా రాచరికమా?
• ప్రజలు అధికారం ఇచ్చింది మటన్ కొట్లు… చికెన్ కొట్లు పెట్టుకోవడానికా?
• మద్యం అమ్ముకొంటున్నారు కదా… ఆ పక్కనే చీకుల కొట్లు కూడా పెట్టుకోండి
• సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో మార్చి 14న ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుకుందాం
• నరసాపురంలోని మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్
చట్టాలను పాటించడం ఎంత అవసరమో… మనల్ని దోపిడి చేసే చట్టాలను ఉల్లంఘించడం అంతే అవసరం అన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ . అందుకే మత్స్యకారుల పొట్టకొట్టే జీవో నెంబర్ 217 ప్రతులను చించివేస్తున్నాను అన్నారు. లక్షలాది మత్స్యకారుల ఉనికి, ఉపాధికి ప్రమాదంగా మారిన జీవో నెంబర్ 217ను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో మత్స్యకారులకు అండగా రోడ్లు మీదకు వచ్చి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమస్యలు తీరుస్తారని ప్రజలు అధికారం ఇస్తే … వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆ అధికారాన్ని సమస్యలు సృష్టించడానికి, మటన్ కొట్లు, చికెన్ కొట్లు, చేపల కొట్లు పెట్టుకోవడానికి ఉపయోగిస్తుందని వ్యాఖ్యానించారు. మటన్ కొట్లు, చేపల కొట్లుతో ప్రభుత్వానికి ఏం పని ప్రశ్నిస్తూ -మద్యం ఎలాగూ అమ్ముతున్నారు కదా ఆ బ్రాందీ షాపుల పక్కన చీకుల కొట్లు పెట్టుకోండి అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం పార్టీ మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభ జరిగింది.
నరసాపురంలో నిర్వహించిన ఈ సభకు భారీ సంఖ్యలో మత్య్సకారులు, జనసేన నాయకులు, జన సైనికులు హాజరయ్యారు. పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , పార్టీ పి.ఏ.సి. సభ్యులు నాగబాబు ,
పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్ పాల్గొన్నారు. మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్బొ మ్మిడి నాయకర్ నేతృత్వంలో సభ జరిగింది. ఈ సభలో పార్టీ పి.ఏ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, నియోజకవర్గాల ఇంచార్జులు, మత్స్యకార వికాస విభాగం సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 70 నుంచి 80 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. మన రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీరం వెంబడి దాదాపు 555 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి.. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 217తో ఇన్ ల్యాండ్ ఫిషింగ్ చేసే సుమారు 4.5 లక్ష మంది మత్సకారుల ఉనికి, ఉపాధి ప్రమాదంలో పడనుంది. చెరువులు ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహిస్తే 2500 మత్స్యకార సంఘాలు నిర్వీర్యం అవుతాయి. ఈ రోజు జనసేన పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే ప్రభుత్వం 217 లాంటి దోపిడీ జీవో ఇచ్చే ధైర్యం చేసేది కాదు. అక్కడే చించేసేవాళ్లం. మత్స్యకారుల కోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.
ప్రజలకు నష్టం కలిగితే ఉల్లంఘించాలి
మన సమాజం కులాల సమాహారం. అన్ని కులాలకు సమాన ఆర్ధిక పరిస్థితులు ఉండవు. రెక్కాడితే గానీ డొక్కాడని కులాలు ఉన్నాయి. ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. భయపడటానికి, వంగివంగి దండాలు పెట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వల్ల ప్రజలకు నష్టం జరిగితే దానిని ఉల్లంఘించడానికి సిద్ధంగా ఉంటాను.
నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? అని ఒక మహాకవి అన్నారు. అలాంటి సాహస వీరులు మత్స్యకారులు. చేతిలో ఒక వలను పట్టుకొని నడి సముద్రంలోకి పోతారు. అలా వెళ్లాలంటే ఎంతో సాహసం కావాలి. మీ సాహసాన్నే స్ఫూర్తిగా తీసుకొని గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆ రోజు కపాసుకుద్దిలో పోరాటయాత్ర ప్రారంభించాను. పోరాట యాత్ర సమయంలో మత్స్యకారుల కష్టాలు స్వయంగా తెలుసుకున్నాను. తీరప్రాంత గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేవు. మత్స్యకారులు ఆర్ధికంగా చితికిపోతున్నారు. ఇవన్నీ కాక ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టాల వల్ల వారి ఉనికి, ఉపాధి ప్రమాదంలో పడింది. మత్స్యకార కుటుంబాల్లో ఆర్ధిక ప్రగతి ఎందుకు లేదు? ఇప్పటికీ దేహీ అనే పరిస్థితి ఎందుకు దాపురించింది. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొనే జనసేన పార్టీ వారికి అండగా నిలబడింది.
పైలెట్ ప్రాజెక్ట్ అంటారు రాష్ట్రమంతా వర్తింపజేస్తారు.
లేని సమస్యను సష్టించడంలో వైసీపీ నాయకులు ఉద్దండులు. సమస్యను వాళ్లే సృష్టించి పరిష్కారం కోసం మనల్ని రోడ్ల మీదకు తీసుకొస్తారు. ఇప్పటి వరకు సహకార సంఘాల ద్వారా మత్స్యకారులు ఇన్ ల్యాండ్ ఫిషింగ్ చేసుకొని పొట్టపోసుకునేవారు. కొంత ఆదాయం పంచాయతీలకు పన్ను కట్టేవారు. ఇప్పుడు ప్రభుత్వం దానికి ఆన్లైన్ చేయడం, మత్స్యకారులు కానీవారికి కూడా అవకాశం కల్పించడం చూస్తుంటే పంచాయతీల ఆదాయం ముసుగులో బడా ఆసాములకు చెరువులను కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తోంది.
దీంతో పేద మత్స్యకారులు అన్యాయం అయిపోతారు. ఆన్లైన్ లో వేలం పాడుకొని, 25 శాతం కట్టాలంటే మత్స్యకారులు ఎక్కడ నుంచి అంత సొమ్ము తీసుకొస్తారు. 100 హెక్టార్లు దాటిన ఏ చెరువునైనా వేలం వేస్తామని చెబుతున్న ప్రభుత్వం… పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరులో ప్రారంభించింది. రేపు రాష్ట్రం మొత్తం అమలు చేస్తారు. దీనిని ఇప్పుడే ఆపకపోతే పేద మత్స్యకారుల పొట్ట కొట్టిన వాళ్లమవుతాం. మీకు జరుగుతున్న అన్యాయం పై మీరు తిరగబడితే … మీకు అండగా నేను నిలబడతాను. దెబ్బలు కాయాల్సిన పరిస్థితే వస్తే మొదటి దెబ్బ నేను తింటాను.
మూడేళ్లలో మీరిచ్చింది కేవలం 64 మందికే
సముద్రంలో వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతుంది ఇప్పటి వరకు మీరు ఇచ్చింది కేవలం 64 మందికి, అది కూడా రూ. 5 లక్షల చొప్పున. మిగిలిన పరిహారం కోసం అడిగితే కేంద్రం ఇవ్వలేదంటూ సాకులు చెబుతున్నారు. ప్రతి ఏటా వేటకు వెళ్లి దాదాపు 140 మంది చనిపోతున్నారని గణాంకాలు చెబుతుంటే మీరు మాత్రం నిబంధనలు పేరిట వేధింపులకు గురిచేస్తున్నారు. మేము ఈ రోజు అధికారంలో లేకపోయినా మా జనసైనికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ.5 లక్షలు ఇచ్చేలా బీమా తీసుకొచ్చాం. ఇప్పటి వరకు దాదాపు 45 మందికి చెక్ లు అందించారం. అధికారంలో లేని మేమే అంతా చేస్తే అధికార పీఠంలో కూర్చున్న మీరెంత చేయాలి?
ఏటా 25వేల మంది వలస పోతున్నారు
మత్స్యకార గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం నుంచి సహకారం లేక ఏటా 25 వేల మంది మత్స్యకారులు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారు. వారి కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. తుపాన్లు వచ్చి సముద్రంలో ఇరుక్కుపోయి పక్క దేశాలకు పోతుంటే వాళ్లను టెర్రరిస్టులుగా జైల్లో పెడుతున్నారు. కరోనా సమయంలో చెన్నైలో మన రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు చిక్కుకుపోతే అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చాం. మత్స్యకారులు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ. 70 వేలు అదనంగా ఇచ్చేవారు. దీనికి కారణం తుపాన్లకు తట్టుకొని నిలబడేలా ఇళ్లు నిర్మించుకోవాలని… ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ రూ. 70 వేలుకు కోత పెట్టి అందరితో పాటు సమానంగా ఇస్తుంది. ప్రకృతి విపత్తుల సమయంలో పడవలు కొట్టుకుపోవడం, వలలు కోల్పోవడం వంటివి జరిగినప్పుడు పరిహారం అందడం లేదు. గతంలో బోట్లకు ఇన్సురెన్స్ ఉండేది. ఇప్పుడు అదీ లేదు. కొంత మంది అక్రమంగా ఇన్సురెన్సులు కాజేస్తున్నారన్న నెపంతో దాన్ని కూడా ఎత్తేశారు.
భయం ఎలా ఉంటుందో జనసేన చూపిస్తుంది
వైసీపీ నాయకుల సిద్ధాంతం ఒక్కటే. వారి దగ్గర తప్ప ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు. అందరూ వారి దగ్గరకు వచ్చి దేహీ అనాలి. ఎంత పెద్దవాళ్లయినా మీరే సాయం చేయాలి సార్ అంటే అప్పుడు వాళ్ల ఈగో శాటిస్ ఫై అవుతుంది. ఇదేమైనా రాజరికామా? ప్రజాస్వామ్యమా? నేను చావడానికైనా సిద్ధమే గానీ, తలవంచేందుకు మాత్రం సిద్ధంగా లేను. మీకే ఇంత తెగింపు ఉంటే స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని నింపుకున్న మాకెంత ఉండాలి. వైసీపీ నాయకులకు భయం లేకుండా పోయింది. భయం ఎలా ఉంటుందో జనసేన చూపిస్తుంది. ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లడానికై నా సిద్ధంగా ఉన్నాను. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ జీవో 217ను తీసుకొచ్చారు. వైసీపీ నాయకులు ఇప్పటికీ మించి పోయింది లేదు. సమయం తీసుకోండి. పేద మత్స్యకారులకు న్యాయం చేయండి.
మీరు హింసిస్తే ఏ స్థాయికైనా తెగిస్తాం
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గోతుల మయం చేసింది. రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు దారిపొడువునా గోతులే దర్శనమిచ్చాయి. రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు మాయబజార్ సినిమాలో లాహిరి లాహిరి పాటే గుర్తొచ్చింది. మా పార్టీ తరపున పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఇళ్లు కూల్చేసి, జనసైనికులను బెదిరించి, భయపెట్టి కేసులు పెట్టాలని చూస్తే… వైసీపీకి నేను చెప్పేది ఒక్కటే మీరు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లు ఎవరు లేరు ఇక్కడ. బెదిరిస్తాం, భయపెడతాం వంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకోండి. సంయమనం పాటిస్తున్నాం అంటే అది మా బలం బలహీనత కాదు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఎలా పడితే అలా మాట్లడను. అక్రమంగా కేసులు బనాయించి, ఇదే పనిగా హింసిస్తే మాత్రం ఏ స్థాయికైనా తెగించి నిలబడతాం.
నిలబెట్టుకోలేని హామీలు ఎందుకు చేశారు
2021 అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం నాడు వర్చ్యువల్ విధానంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మేజర్ ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు నామమాత్రంగానే పనులు జరిగాయి. నిలబెట్టుకోలేని హామీలు ఎందుకు ఇచ్చి జనాలను మోసం చేస్తారు. గంగవరం పోర్టు దగ్గర జెట్టీ నిర్మిస్తామని అక్కడ మత్స్యకారులను నిరాశ్రయులను చేశారు.
పేద మత్స్యకారుల కోసం చెరువులు వదిలేయండి
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి లక్షలాది మత్స్యకారుల ఉపాధిని ప్రమాదంలోకి నెట్టే జీవో నెంబర్ 217ను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో దానిని రద్దు చేస్తాం. అలాగే చెరువులపై పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న కోటీశ్వరులకు ఒకటే చెబుతున్నాం. పేద మత్స్యకారులకు చెరువులు వదిలేయండి. కాదని ఈ రోజు పెట్టుబడి పెడితే మాత్రం 2024లో మా ప్రభుత్వం వచ్చాక మీ పెట్టుబడులు నష్టపోతారు. అలాగే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టోని తీసుకొస్తాం. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. మత్స్యకార యువతను సిమ్మింగ్ లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలి? క్షేత్రస్థాయిలో సమస్యలపై ఎలా యుద్ధం చేయాలి?వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్న దానిపై మార్చి 14 పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు మాట్లాడుకుందాం. రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉండాలి.. ఎలా ఉండబోతుంది… ఎలా యుద్ధం చేయాలి లాంటివి చర్చిద్దాం” అన్నారు.
ఈ వేదిక నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో మత్స్యకార అభ్యున్నతి యాత్ర జరిగిన విధానాన్ని, ఈ యాత్రలో పార్టీ దృష్టికి వచ్చిన సమస్యలను పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ వివరించారు. మత్స్యకార గ్రామాల్లో కనీస వసతులు కూడా ఉండటం లేదని, మహిళలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపారు. నరసాపురం ప్రాంతానికి చెందిన మత్స్యకారులు పవన్ కల్యాణ్ కి సంప్రదాయరీతిలో వల, మత్స్యకారుల టోపీ, చేప అందించారు.