– విద్యాశాఖ బడ్జెట్ పద్దుపై అసెంబ్లీలో చర్చ
– సమాధానం ఇచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్: సమాజంలో అన్నింటికంటే ముఖ్యమైనది విద్య, వైద్యం. ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టులు. మానవ సమాజ గుణాత్మక పురోగతికి దోహదం చేసేది విద్య. గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో స్టూడెంట్స్ సంఖ్య తగ్గుతోంది. ఇది మంచి పరిణామం కాదు.
662 రెసిడెన్షియల్ స్కూళ్లు రెంటెడ్ బిల్డింగుల్లో నడుస్తున్నాయి. సుమారు 2 లక్షల మంది విద్యార్థులు అరకొర వసతులతోనే చదువుకుంటున్నారు.
స్కూళ్లు మంజూరు చేయడం మంచిదే. కానీ, వసతులు కూడా కల్పించాలి. పిల్లల పేరెంట్స్ భయపడుతూ స్కూల్‌కు పంపించే పరిస్థితి ఉండకూడదు. స్కూల్‌లో ఉన్న పిల్లల గురించి ఇంటిదగ్గరున్న తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితులు ఉండకూడదు. నేను నా నియోజకవర్గంలో స్కూళ్లలో చాలాసార్లు పర్యటించాను. అక్కడ సరిపడా వసతులు లేవు. అది చూసి నాకే బాధేసింది. అందుకే అన్ని స్కూళ్లలో అవసరమైన దిద్దుబాటు చర్యలు ప్రారంభించాను.
పిల్లలకు అవసరమైన విశాల తరగతి గదులు, ల్యాబులు, మంచి నీటి వసతి, క్లీన్ వాష్ రూమ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ప్రభుత్వ టీచర్లంతా మెరిటోరియస్.. వారు తాము పనిచేసే విద్యా సంస్థలను ఓన్ చేసుకోవాలి. పిల్లలను భావి పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను 11,600 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నాం.
ఆకునూరి మురళి నేతృత్వంలో ఎడ్యుకేషన్ కమిషన్ వేశాం. కమిషన్ సూచనల మేరకు విద్యా వ్యవస్థను బాగుచేస్తాం. మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు వర్సిటీకి సురవరం పేరు పెట్టుకున్నాం. ఆడపిల్లలకు విద్య చాలా అవసరం. ఈ సమాజాన్ని తీర్చిదిద్దేది వారే. మహిళలు చదువుకుంటే సమాజం బాగుంటుంది. 11 వేలకు పైగా టీచర్లను భర్తీ చేశాం. 12 యూనివర్సిటీలకు వీసీలను నియమించాం.
కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేశాం. మన పిల్లల స్కిల్స్ పెంచేందుకు, ఎంఎన్‌సీ కంపెనీలు, విదేశీ యూనివర్సిటీలతో మన రాష్ట్ర యూనివర్సిటిలు ఒప్పందం చేసుకున్నాయి. యూనివర్సిటీల్లో డిటేన్షన్, డ్రాప్ అవుట్స్, మల్టిఫుల్ ఎంట్రీస్, మల్టిపుల్ ఎగ్జిట్స్, కామన్ సిలబస్, తదితర అంశాలపై చర్చించేందుకు ఇదివరకే కమిటీ వేశాం. కమిటీ నివేదిక వచ్చాక అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను స్ట్రెంతెన్ చేయడానికే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం. టైప్ రైటింగ్ కోర్సులను కంటిన్యూ చేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. త్వరలో ఫీజు రెగ్యులేటరీ కమిటీని నియమిస్తాం.