Home » ఆర్థికభారం లేకుండా వైద్యసేవలు అందించడమే టిడిపి లక్ష్యం

ఆర్థికభారం లేకుండా వైద్యసేవలు అందించడమే టిడిపి లక్ష్యం

-దశలవారీగా యూనివర్సల్ హెల్త్ కేర్ విధానం అమల్లోకి తెస్తాం
-ఖాళీగా ఉన్న డాక్టర్లు, వైద్యసిబ్బంది పోస్టులను భర్తీచేస్తాం
-డాక్టర్లతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముఖాముఖి

అమరావతి: రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఆర్థిక భారం పడకుండా, మెరుగైన వైద్యసౌకర్యం కల్పించాలన్నది తెలుగుదేశం పార్టీ విధానం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశలవారీగా యూనివర్సల్ హెల్త్ కేర్ విధానాన్ని అమల్లోకి తెస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పేర్కొన్నారు. ఇందుకోసం ఇతర దేశాలు, పొరుగురాష్ట్రాల్లో హెల్త్ కేర్ విధానాలను అధ్యయనం చేసిన మెరుగైన వైద్యసేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా యువనేత లోకేష్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… డాక్టర్లు అహర్నిశలు ప్రజలకు సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో డాక్టర్లు ప్రాణాలకు తెగించి ప్రజలకు అద్భుతమైన సేవలందించారు, ఎపికి కరోనాతోపాటు జగనోరా వైరస్ వచ్చింది. జగన్ విధ్వంసక విధానాలు కళ్లారా చూశాం. ఈ ప్రభుత్వం వల్ల అన్నివర్గాలు తీవ్రంగా నష్టపోయాయి.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును హఠాత్తుగా మార్పుచేశారు.రాజశేఖర్ రెడ్డికి కూడా ఎన్టీఆర్ అంటే గౌరవం. జగన్ మాత్రం కక్షపూరితంగా వ్యవహరించి పేరు మార్చేశారు. హెల్త్ యూనివర్సిటీ నిధులను పక్కదారి పట్టించారు. జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 1400కోట్ల బకాయిలు పెట్టింది. వాలంటీర్లతో మెసేజ్ లు పెట్టి మరీ ఆసుపత్రుల యాజమాన్యాలను ఇబ్బంది పెట్టడం దారుణం. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపారు. ఎయిమ్స్ లో కనీసం తాగునీటి పైప్ లైన్ వేయలేని అసమర్థ ప్రభుత్వమిది.

కేరళ తరహాలో నర్సింగ్ విద్యను ప్రోత్సహిస్తాం!
ప్రజలకు ఆరోగ్యంపై చైతన్యం తీసుకువస్తాం. కేరళ తరహాలో నర్సింగ్ విద్యను ప్రోత్సహిస్తాం. మహిళల ఉన్నత విద్యాభ్యాసం, స్కిల్ అప్ గ్రేడేషన్ కి కలలకు రెక్కల పేరుతో వడ్డీలేని రుణాలు అందించాలని నిర్ణయించాం. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తాం. ఎన్నివేల కోట్లయినా ఫర్వాలేదు. రాష్ట్రవ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం చేపడతాం. ఆసుపత్రుల నిర్వహణ భారం పెరిగిపోయింది.

అధికారంలోకి వచ్చాక అయిదేళ్లు కరెంటు ఛార్జీలు పెంచం. రెన్యువబుల్ ఎనర్జీని ప్రోత్సహించి కరెంటు ఛార్జీలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వ హయాంలో విశాఖకు మెడికల్ డివైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలను తీసుకొచ్చాం. కల్తీమద్యం అత్యంత ప్రమాదకరమైంది. లివర్ సిరోసిస్ బారిన పడుతున్నారు. గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. సిఎం ఇంటిచుట్టూ గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంది. గంజాయివల్ల ఒకతరం నాశనమవుతోంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి వందరోజుల్లో అరికడతాం.

ప్రపంచవ్యాప్తంగా తెలుగుప్రజలు నెం.1గా ఉండాలన్నదే టిడిపి లక్ష్యం. ఆ దిశగా మా కృషి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైంది. ప్రజలను చైతన్యవంతం చేయడంలో డాక్టర్లది కీలకపాత్ర వహించాలి. మా ప్రథమ ప్రాధాన్యత ఉద్యోగాల కల్పన. 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి చేరకుంటే ఎపి ఎకానమీ రెండున్నర రెట్లు పెరుగుతుంది. రాష్ట్రాన్నిట్రిలియన్ డాలర్ ఎకానమీ తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. ఈ లక్ష్యానికి చేరుకోగలిగితే కోటి ఉద్యోగాలు లభిస్తాయి, తద్వారా ప్రజలకు మెరుగైన విద్య, వైద్యసౌకర్యాలు కల్పించడానికి ఆవకాశమేర్పడుతుందని లోకేష్ తెలిపారు.

హెల్త్ బడ్జెట్ పెంచేందుకు చర్యలు తీసుకోండి
ఐఎంఎ ఎలక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ… యూనివర్సల్ హెల్త్ కవరేజి సౌకర్యం కల్పించాలన్నారు. హెల్త్ బడ్జెట్ ను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడం విచారకరం. 300 కట్ల వర్సిటీ నిధులు దారిమళ్లించారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయి, ప్రభుత్వాలమీద నమ్మకం పోయే పరిస్థితి నెలకొంది. 1500 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు.

టిడిపి డాక్టర్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అయిదేళ్లుగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. రాష్ట్రం ఏవిధంగా నష్టపోయిందో డాక్టర్లు ప్రజలను చైతన్యవంతం చేయాలని డాక్టర్ శ్రీదేవి విజ్ఞప్తిచేశారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్రశాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ బెనర్జీ మాట్లాడుతూ యువడాక్టర్లకు భరోసా కల్పించాలని కోరారు. ఈ జూమ్ సమావేశంలో డాక్టర్ రాకేష్, డాక్టర్ సురేష్, డాక్టర్ రవిరామ్, డాక్టర్ నూతక్కి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

యువనేత దృష్టికి డాక్టర్ల సమస్యలు
ఈ సందర్భంగా పలువురు వైద్యులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. డాక్టర్ కొండమూరి సత్యనారాయణ (కాకినాడ) మాట్లాడుతూ 80శాతానికి పైగా ప్రజలకు సేవలందిస్తున్న చిన్న, మధ్యతరహా ఆసుపత్రుల లైసెన్సింగ్ విధానాన్ని సరళీకరించాలని కోరారు. ప్రతి ఆసుపత్రి నుంచి 10వేలనుంచి 50వేలవరకు చెత్తపన్ను పేరుతో భారం మోపుతున్నారన్నారు.

డాక్టర్ సిరాజ్ (నెల్లూరు) మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో పారామెడిక్, నర్సింగ్ సిబ్బంది కొరత అధికంగా ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజిల్లో ఫ్యాకల్టీ కొరత అధికంగా ఉంది. స్పెషలిస్ట్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టాలని కోరారు. డాక్టర్ రాజకుమార్ (ఏలూరు) మాట్లాడుతూ… కోవిద్ పాండమిక్ సెకండ్ వేవ్ లో వైద్యంపై అవగాహన లేని ఐఎఎస్ ల జోక్యం కారణంగా అధిక ప్రాణనష్టం జరిగింది. వైద్యశాఖ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు ఎంబిబిఎస్ విద్యార్హత ఉన్నవారిని నియమించాలని సూచించారు.

డాక్టర్ చంద్రహాస్ (విజయవాడ) మాట్లాడుతూ అల్పాదాయ వర్గాలకు ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ ఉన్నాయి. మధ్యతరగతి ప్రజల హెల్త్ కేర్ కోసం ప్రత్యేక ఇన్సూరెన్స్ అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు. నారా లోకేష్ స్పందిస్తూ… ఇతర రాష్ట్రాల్లో విధానాలను అధ్యయనం చేసి సులభతరమైన లైసెన్సింగ్ విధానం తెస్తామని చెప్పారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నస్పెషలిస్టు వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీచేస్తామని తెలిపారు. డాక్టర్లకు ఎటువంటి వేధింపులు లేకుండా స్వేచ్చగా సేవచేసే అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

Leave a Reply