– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్
అమరావతి: కేంద్రంలో, రాష్ట్రంలో పాలన సాగిస్తున్న డబల్ ఇంజన్ సర్కార్ ఆడుతున్న డబల్ గేమ్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉందని, డబుల్ ఇంజన్ సర్కార్ పాలన నడుస్తున్నదని చెబుతున్నారు. డబల్ ఇంజన్ సర్కారు చేస్తున్న పనులు పొంతన లేకుండా ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో రెండు నెలల పాటు జైల్లో ఉంచారు.
ఆయన బెయిల్ పొంది బయటకు వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ మిథున్ రెడ్డిని ఐ ఎల్ వో కి పంపుతున్నారు. మన భారతదేశం తరఫున ఐక్యరాజ్యసమితి కి వెళ్లే ప్రతినిధి బృందంలో మిథున్ రెడ్డిని పంపుతున్నారు. ఒకపక్క రాష్ట్రంలో లిక్కర్ మాఫియా కేసులో ఆయన్ను జైలుకు పంపారు. మరోపక్క భారతదేశ ప్రతిష్టను, ఔన్నత్యాన్ని చెప్పటానికి అదే ఎన్డీఏ ప్రభుత్వం ఐ ఎల్ వో కి పంపుతుంది. దీనిని బట్టి డబల్ ఇంజన్ సర్కార్ డబల్ గేమ్ ఆడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు కనీసం సిగ్గుపడకుండా ఇలాంటి పనులు చేయటం విచారకరం.
లిక్కర్ మాఫియాలో కోట్లాది రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని ఎంపీని అరెస్టు చేయించిన చంద్రబాబు నాయుడు తాను చేసిన తప్పుకి మిధున్ రెడ్డికి క్షమాపణ చెబితే బాగుంటుంది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ప్రజలను తికమక పరుస్తోంది. ఈ అంశంలో రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.
మోడీతో కుమ్మక్కై మోడీకి తలవంచి రాష్ట్రంలో దిక్కుమాలిన రాజకీయాలు నడపడం మానుకోవాలని హితవు పలుకుతున్నాం. మిథున్ రెడ్డిని ఐక్యరాజ్యసమితికి పంపిన అంశంలో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.