Suryaa.co.in

Telangana

తెలంగాణలో ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం 3.56 లక్షలు

– రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరుగుతుంది, భూగర్భ జల వనరులు పెరిగాయి
– హైదరాబాద్ పరిసరాల్లో పూల సాగును నాబార్డు ప్రోత్సహించాలి
– గత పది సంవత్సరాలు సైంటిఫిక్ సాగును నిర్లక్ష్యం చేశారు
– ఐకెపిల ద్వారా ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాలి
– వ్యవసాయ పంపు సెట్లు క్రమంగా సోలార్ పవర్ పంపుసెట్లుగా మార్చేందుకు దృష్టి సారించాలి
– గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను లీడర్ గా నిలపాలి
– నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (gsdp) 15.02 లక్షల కోట్లు, వృద్ధిరేటు 14.5%. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం 3.56 లక్షలగా ఉందని తెలిపారు. అభివృద్ధి అనేది కేవలం సంఖ్యల ద్వారా మాత్రమే కాకుండా రైతులు, సూక్ష్మ , చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తున్నాం అనేదే మెరుగైన ప్రయాణం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభివర్ణించారు.

ఈ ప్రయాణంలో నాబార్డ్ కీలక భాగస్వామిగా ఉందని రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు.వ్యవసాయ రంగానికి రుణ సహాయం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. డిజిటల్ బ్యాంకింగ్ రంగాన్ని విస్తరించాలని కోరారు.

నాబార్డ్ సహకారంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగి రైతులు అనేక పంటలు పండించే స్థాయికి చేరుకున్నారని, నీటి కొరత ఉన్న జిల్లాలను గుర్తించి నాబార్డ్ తన సహకారాన్ని మరింత విస్తరించాలని కోరారు. నీటిని ఆదా చేసే డ్రిప్పు, స్ప్రింక్లర్ల ద్వారా సాగు చేయడంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలిపారు. విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఇజ్రాయిల్ దేశంలో అద్భుతమైన వ్యవసాయ వృద్దిని సాధించారని వివరించారు.

ఎడిబుల్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడకుండా ఉండడానికి మనదేశంలో లక్ష ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో మలేషియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని తెలంగాణలోనూ ఆయిల్ ఫామ్ సాగును బలోపేతం చేయాలని కోరారు.

మన రాష్ట్రం మామిడి, పసుపు, మిర్చి, చిరుధాన్యాలు వంటి విలువైన పంటలకు పేరుగాంచిన రాష్ట్రం. కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైతులకు శిక్షణ ఇవ్వడం వంటి పనులు నాబార్డు చేపట్టాలని కోరారు.

మహారాష్ట్రలో ఆల్ ఫోన్స్ రకం మామిడిని సాగు చేస్తున్నారు. ఇది ఎగుమతిలో ఒక మోడల్ గా ఉన్నది. మహారాష్ట్ర తరహా భూమి, ఇతర వనరులు మన రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో ఆల్ ఫోన్స్ రకం మామిడి సాగుకు రైతులను ప్రోత్సహించాలని కోరారు.

గత పది సంవత్సరాలపాటు పాలించిన వారు రాష్ట్రంలో సైంటిఫిక్ సాగును నిర్లక్ష్యం చేశారని తిరిగి ఆ రంగం వైపు వ్యవసాయ శాఖ, నాబార్డు అధికారులు దృష్టి సారించాలని కోరారు. గ్రీన్ హౌస్, పాలీ హౌస్, డ్రిప్, స్ప్రింక్లర్ ల ద్వారా పంటల సాగుకు ప్రోత్సాహం అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ క్రెడిట్ వ్యవస్థలను విస్తరించాలని, స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని కోరారు. డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో కెన్యా దేశం M -pesa ద్వారా ఆత్మక మార్పు తెచ్చిందని ఉదహరించారు.

సూక్ష్మ ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా లక్షల సంఖ్యలో ఉపాధి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. గ్రీన్ పవర్ ఉత్పత్తికి సహకారం అందించి సుస్థిరమైన అభివృద్ధి సాధనకు నాబార్డ్ ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ప్రస్తుతం ఉచిత విద్యుత్తు పథకం ద్వారా కొనసాగుతున్నాయి, వీటిని క్రమంగా సోలార్ పంపుసెట్లు గా మార్చేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. సోలార్ వైపు వెళ్లడం మూలంగా ఆర్థికంగా లాభం పొందడంమే కాదు, వాతావరణ కాలుష్యాన్ని పెద్ద సంఖ్యలో తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

గ్రీన్ పవర్ ఉత్పత్తిలో జర్మనీ ప్రపంచ లీడర్ గా ఉంది.. ఈ రంగంలో దేశంలో మన రాష్ట్రం లీడర్గా ఎదిగేందుకు నాబార్డు సహకారం అందించాలన్నారు. కొత్త విద్యుత్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగాపట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ఇంధన శాఖ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆర్థిక చేయూతను అందించాలన్నారు.

అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజన ప్రాంతాల్లో రైతులకు సాగు భూములు అందజేశాం, ఆ భూముల్లో పామాయిల్, అవకాడో, వెదురు వంటి పంటల సాగును ప్రోత్సహించండి.. ఫలితంగా అటవీ విస్తీర్ణంను కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

LEAVE A RESPONSE