Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు

పెగాసెస్ ఉపయోగించి ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లు ట్యాప్ చేస్తున్న డిజిపి, ఏడిజి(ఇంటెలిజెన్స్)
అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన అధికారులు నేడు పెట్టె పేడ సర్దుకుంటున్నారు
పెన్షన్ పంపిణీ వ్యవహారంపై వైసీపీ మూకలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి
ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లు ట్యాపింగ్ చేస్తున్నారని ఎన్నికల ప్రధాన అధికారికి వర్ల రామయ్య ఫిర్యాదు

ఇజ్రాయెల్ నుంచి పెగాసెస్ అనే సాఫ్ట్‌ వేర్‌ను కొనుగోలు చేసి ప్రతిపక్ష నేతలు ఫోన్‌లు ట్యాంపింగ్ చేసి దొంగతనంగా డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఏడిజి(ఇంటెలిజెన్స్) రామాంజనేయులు ఫోన్‌లు వింటున్నారని, తగిన సమాచారం మాదగ్గర ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ అధికార పార్టీకి అనుకూలంగా పని చేసిన వారు నేడు దుకాణం సర్దారని, మిగిలిన అధికారులైనా చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. ఏ అధికారికి మేము వ్యతిరేకం కాదని, చట్టబద్ధంగా మాత్రం వ్యవహరించాలని కోరారు.

దొంగచాటుగా ప్రతిపక్ష నేతల ఫోన్‌లు వింటున్నారు…
”డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఏడిజి(ఇంటెలిజెన్స్) పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరూ ఎన్నికల కమిషన్ వేటుకు గురి కావల్సిన వారు. ఎన్నికల సంఘం వేటు వేయడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులు వీరిద్దరూ. కానీ వారిద్దరిపై ఇంతవరకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోలేదు. చేలో మేస్తున్న దూడలపై మాత్రమే ఈసీ వేటు వేసింది. కానీ అసలు ఆవులను ఇంకా చేలోనే వదిలేసింది. ఆ ఆవులపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశాం. తెలంగాణలో మాదిరిగానే పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ముఖ్యమైన తెదెపా నాయకులు, మరికొంతమంది ప్రతిపక్ష నేతల ఫోన్లను డిజిపి, ఇంటెలిజెన్స్ ఏడిజి నేతృత్వంలో ట్యాపింగ్ చేయబడుతున్నట్లుగా పోలీస్ అధికారులే కొందరు చెబుతున్నారు.

పెగాసెస్ సాఫ్ట్ వేర్‌ను ఇజ్రాయెల్‌ను కొన్నారని కూడా మాతో అంటున్నారు. ఈ ముఖ్య ఫిర్యాదుపై చర్యలు తీసుకోండని ఎన్నికల ప్రధాన అధికారిని కోరాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో వినే పనిలో డిజిపి, ఇంటెలిజెన్స్ ఏడిజి నిమగ్నమై ఉన్నారు. డిజిపి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నైతిక విలువలున్నా, ధైర్యమున్నా పెగాసెస్ సాఫ్ట్‌ వేర్‌ను వాడడం లేదని, ప్రతిపక్ష నేతల ఫోన్ కాల్స్ వినడం లేదని బహిరంగ ప్రకటన చేయాలి. తెలంగాణలో ఇలానే ఫోన్‌లు ట్యాపింగ్ చేసి కటకటాలు పాలయ్యారు, కొంతమంది విదేశాలకు పారిపోయారు. ఆ పరిస్థితి వీరిద్దరికి రాకూడదంటే వెంటనే పెగాసెస్ సాఫ్ట్ వేర్‌ను ఎన్నికల కమిషన్‌కు అప్పగించాలి” అని సవాల్ చేశారు.

పెన్షన్ పంపిణీ వ్యవహారంపై వైసీపీ దుష్ప్రచారాలు…
“పింఛన్ల పంపిణీ వ్యవహారంపై వైసీపీ మూకలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పింఛన్ పంపిణీ ఆగడానికి కారణం చంద్రబాబే అని దుష్ప్రచారాలు చేస్తున్నారు. వాలంటీర్లు వేస్తున్న చిందులను ఎన్నికల కమిషన్ గమనించి వాలంటీర్లను పక్కనపెట్టి పింఛన్ల పంపిణీకు ప్రత్యమ్నాయ మార్గాలు చూడాలని సీఎస్‌కు ఈసీ ఆదేశాలిచ్చింది. ఏ ఒక్క అవ్వా తాతకు పింఛను రాకపోయినా తెలుగుదేశం పార్టీ ఉపేక్షించదు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రతీ పింఛనుదారుడికి ఇంటికే వచ్చి పింఛను ఇచ్చే విధంగా మేము పోరాడుతాం.

పింఛను పంపిణీ వ్యవహారంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండని ఈసీకి ఫిర్యాదు చేశాం” అని వర్ల తెలిపారు. “ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సూపరిడెంట్‌గా పని చేస్తున్న వై.వెంకటప్ప రెడ్డి అనే వ్యక్తి పింఛను పంపిణీ వ్యవహారంపై ఇష్టమోచ్చినట్లు తన వ్యక్తిగత పోర్టల్‌లో తప్పుడు పోస్టులను పెడుతున్నాడు. జగన్ రెడ్డికి అనుకూలంగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లుగా పోస్టింగ్‌లు పెట్టాడు. ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటున్నా కానీ అతని ఒళ్ళంతా వైసీపీ జిందాబాద్ అని అరుస్తోంది. యూనివర్సిటీలో 18 ఏళ్ళు దాటిని విద్యార్ధులను వైసీపీ పట్ల ప్రభావితం చేస్తున్నాడు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఈసీని కోరాం” అని తెలియజేశారు.

చట్టం చేతులు చాలా పెద్దవి కాబట్టి తప్పు చేసిన అధికారుల దొరికారు…
“ఒక్కసారి ఎన్నికల కమిషన్ వేటు వేసిందంటే ఇంకెప్పుడు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ఉండదు. వారి సర్విస్ అంతా ఈ చెడ్డ పేరు ఉంటుంది. మనమేం చేసినా ఎవరూ చూడరులే అని అనుకున్న అధికారులు ఇప్పుడు పెట్టే పేడ సర్దుకుంటున్నారు. ఇసుక అక్రమంగా రవాణా జరుగుతోందయ్యా అని అధారాలతో సహా కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబుకు ఫిర్యాదు చేస్తే సాఫీగా కూర్చొని మా వాళ్ళు చూసుకుంటారులే అని ఇసుక రవాణా ప్రదేశానికి ఎమ్మార్వోను పంపించాడు. ఎమ్మెల్యే కైలె అనిల్ కుమార్‌ను చూసి ఎమ్మార్వో భయపడ్డాడు. ఇవి గమనించిన ఈసీ పెట్టే పేడ సదుర్కోమని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చింది.

వైసీపీ శాశ్వతమనుకున్న అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతిమి ఓటర్ జాబితాలో ఇష్టానుసారంగా అవకతవకలు చేశారు. శ్రీ కాళహస్తిలో పెద్ద ఎత్తున చెవిరెడ్డి దాచుకున్న డంప్‌ను పట్టుకున్నా అతనిపై ఏమి చర్యలు తీసుకోవద్దని నిమ్మకు నీరెత్తనట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మిషా వ్యవహరించారు. ఎన్నికల కమిషన్ మొట్టమొదటిగా ఓవర్ యాక్టర్ పల్నాడు ఎస్పీ రవిశంకర్‌పైనే వేటు వేస్తుందని మేము ముందే చెప్పాం. మేము చెప్పనట్లుగానే జరిగింది.

ఒంట్లో ప్రవహించే రక్తమంతా వైసీపీ రక్తమే అన్నట్లు వైసీపీ అనకూలంగా చిత్తూరు ఎస్పీ మేధావి జాషువా వ్యవహరించారు. ఇంకా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌, నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్‌లను పీకి పక్కన పెట్టేసింది. ప్రధాని సభకు అనేక విధాలుగా ఆటంకాలు సృష్టించడానికి యత్నించిన గుంటూరు ఐజి పాలరాజు వ్యవహారాన్ని ఈసీ గమనించి వేటు వేసింది. చట్టబద్ధంగా వ్యవహరించండని మిగిలిన అధికారులను కోరుతున్నాం. ఒకవేళ చట్టం పరిధిని దాటి వ్యవహరిస్తే వీరికి పట్టిన గతే వాళ్ళకి పడుతది” అని గుర్తు చేశారు.

సీఈసీని కలిసినవారిలో తెదేపా బ్రాహ్మణ సాధికార సాధన రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, తెదెపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బంబారు వంశి, తెలుగు యువత నాయకుడు నున్నా ప్రదీప్ తదితరులు ఉన్నారు.

 

LEAVE A RESPONSE