అవ్వా తాతల్ని అవస్థలపాలు చేయడం దుర్మార్గం

నిధుల కొరత వల్లే పింఛన్ల పంపిణీ జాప్యం
నిధులుంటే ఏప్రిల్‌ 1కి ముందే బ్యాంకుల నుండి నిధులు విత్‌ డ్రా చేసి ఉండేవారు కదా!
ముందే బ్యాంకుల నుండి విత్‌ డ్రా చేసి ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఎదురయ్యేది కాదు
వైసీపీ దుష్ప్రచారాన్ని పెన్షనర్లు నమ్మవద్దు
మీ వెంటే కూటమి
పెన్షనర్లకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బహిరంగలేఖ

వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయవద్దన్న ఈసీ ఆదేశాలపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ కుట్రలను, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బహిరంగలేఖ ద్వారా పెన్షనర్లకు వివరించారు. పెన్షన్లు ఇళ్లవద్దకే ఇస్తారని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఎండా కాలంలో ఎవరూ బయటకు రానవసరం లేదని, ప్రభుత్వ సిబ్బందే మీ ఇళ్లకు వచ్చి పించన్లు ఇస్తారని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో వైసీపీ తమ పార్టీపై చేస్తున్న దుష్ప్రచారం నమ్మవద్దని కోరారు. కూటమి వీ వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెన్షనర్లకు రాసిన బహిరంగ లేఖ పూర్తి పాఠమిది.

తేది : 02.04.2024
బహిరంగ లేఖ
ప్రియమైన రాష్ట్ర ప్రజలకు,
సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను సీయం జగన్‌ రెడ్డి సక్రమంగా నిర్వహించకుండా, దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్థలపాలు చేస్తున్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసం ఎప్పుడూ లేని విధంగా, ఎన్నికల ముందు పింఛన్ల పంపిణీపై కుట్రలు చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వాలంటీర్లతో నగదు పంపిణీ చేసే బాధ్యతల నుండి ఎన్నికల కమిషన్‌ తప్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇళ్ల వద్దకే పింఛన్లు అందించాలని ఎన్నికల కమిషన్‌ చెప్పింది. కానీ, ఈ పరిణామాన్ని వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు ఉపయోగించుకుంటున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు, లబ్దిదారులు అర్థం చేసుకోవాలి.

గతేడాది 2022 ఏప్రిల్‌ 1వ తేదీకి ముందే పింఛన్ల నిధులు బ్యాంకుల నుండి విత్‌ డ్రా చేసి 1వ తేదీన పంపిణీ చేశారు. ఈ ఏడాది కూడా ముందే బ్యాంకుల నుండి విత్‌ డ్రా చేసి ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఎదురయ్యేది కాదు. మార్చి 16 నుండి మార్చి 30 మధ్య 15 రోజుల్లోనే సొంత కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు విడుదల చేసిన జగన్‌ రెడ్డి ప్రభుత్వం, పింఛన్‌ దారులకు ఇవ్వాల్సిన రూ.2వేల కోట్లు కూడా సొంత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానా ఖాళీ చేశారు. నిధుల కొరత వల్లే పింఛన్ల పంపిణీ జాప్యం చేస్తున్నారు.
ప్రభుత్వ ఖజానాలో పింఛన్ల పంపిణీకి సరిపడా నిధులుంటే ఏప్రిల్‌ 1కి ముందే బ్యాంకుల నుండి నిధులు విత్‌ డ్రా చేసి ఉండేవారు కదా!

ఇళ్ల వద్దే పింఛన్‌ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను జగన్‌ రెడ్డి లెక్క చేయకుండా.. మండుటెండల్లో పింఛన్‌ దారులను కష్టపెట్టి, ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారు. తన రాజకీయ లబ్ది కోసం అవ్వాతాతల్ని, దివ్యాంగుల్ని కష్టపెట్టే కుట్ర జగన్‌రెడ్డి చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో బాబాయి హత్యను జగన్‌రెడ్డి రాజకీయ లబ్దికి వాడుకున్నాడు. ‘నారాసుర రక్త చరిత్ర’ అని నాపై నిందలేశాడు. అలాగే నేడు పింఛన్ల పంపిణీ విషయంలో జగన్నాటకం ఆడుతూ పింఛన్‌దారులకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఈ విషయాన్ని లబ్దిదారులు, ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.

ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పింఛన్ల పంపిణీకి ఎప్పటిలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని ఎన్నికల కమిషన్‌ సూచించింది. అందుబాటులో ఉన్న 1.35 లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? దీన్ని బట్టి పింఛన్‌ దారులపై జగన్‌ రెడ్డి చూపుతున్నది కపట ప్రేమ, మొసలి కన్నీరని స్పష్టమవుతోంది. ఏప్రిల్‌ 3వ తేదీ నుండి పింఛన్లు ఇళ్ల వద్ద కాకుండా సచివాలయాల్లో పంపిణీ చేస్తామని సెర్ప్‌ సీఈఓ మురళీధర్‌ రెడ్డి మార్చి 28న ఇచ్చిన పత్రికా ప్రకటన సీఎం అనుమతి లేకుండా ఇస్తే, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇంటి వద్దే పింఛన్‌ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రిగా చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డికి ఎందుకు ఆదేశాలివ్వలేదు? తెలుగుదేశంపై నెపం నెట్టి ఎన్నికల్లో లబ్ది పొందడానికి అవ్వా తాతల్ని అవస్థలపాలు చేయడం దుర్మార్గం కాదా?

తగిన సిబ్బంది లేనందున గ్రామాల్లో లబ్దిదారుల్ని గుర్తించడం కష్టమని, అందరికీ ఇంటి వద్ద పింఛన్‌ ఇవ్వలేమని ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం హాస్యాస్పదం. 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది, మరోవైపు రెవెన్యూ, సెర్ప్‌, మెప్మా, పంచాయతీరాజ్‌ సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరి సహకారంతో ఒక్క రోజులోనే అందరికీ పింఛన్‌ అందించే వెసులుబాటు ఉంది. అయినా గానీ జగన్‌ రెడ్డి ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం కేవలం రాజకీయ కుట్ర తప్ప మరేమీ లేదనేది సుస్పష్టం. ఇది కేవలం రాజకీయ కుట్ర అని ప్రజలంతా అర్థం చేసుకోవాలి.

దివ్యాంగులు, వృద్దులు, రోగులకు మాత్రమే ఇళ్ల వద్ద పింఛన్లు ఇస్తామని, మిగిలిన వారికి సచివాలయాల వద్ద ఇస్తామంటూ సర్క్యులర్‌ ఇవ్వడం దుర్మార్గం. పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి కుట్రలకు, నాటకాలకు తెరదించి లబ్దిదారులందరికీ ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రజల తరఫున డిమాండ్‌ చేస్తున్నాను.
(నారా చంద్రబాబునాయుడు)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు

 

Leave a Reply