పవన్‌తో సుజనా భేటీ

కూటమికి కారకుడు పవనే
పవన్ పోరాటం ఫలిస్తుంది
– జనసేన అధిపతితో సుజనాచౌదరి
విజయవాడ వెస్ట్‌లో మీ విజయం ఖాయం
నేనూ ప్రచారానికి వస్తా
జనసైనికులు మీ వెంటే ఉంటారు
– సుజనాకు పవన్ భరోసా
– పవన్‌తో వర్మ, నిమ్మకాయల, కామినేని భేటీ
– కూటమి విజయం, ఓట్ల బదిలీపై చర్చ

( అన్వేష్)

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కేంద్రమాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్ధి సుజనాచౌదరి నేటీ అయ్యారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో ఉన్న పవన్‌తో సుజనా చౌదరితో పాటు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, నిమ్మకాయల చిన రాజప్ప, మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమిలో సనమన్వయం, ఓటు బదిలీ, ప్రచారాంశాలపై వారు చర్చించారు.

ఈ సందర్భంగా కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, జనసేన దళపతిని ప్రశంసలతో ముంచెత్తారు. ‘‘కూటమి మీ కృషితోనే సాధ్యమయింది. మీ పోరాటం కచ్చితంగా ఫలించి కూటమి ప్రభుత్వం వస్తుంది. మీ పోరాటమే మా అందరికీ స్ఫూర్తి. మన ఐక్యత చూసి జగన్ బెంబేలెత్తిపోతున్నారు. కూటమి మీద దుష్ప్రచారం చేయడమే దానికి నిదర్శం. పిఠాపురంలో మీరు రికార్డు మెజారిటీతో గెలుస్తున్నందుకు ముందస్తు అభినందనలు’’ అన్నారు.

దానికి స్పందించిన పవన్.. కూటమిలో ఓట్లు బదిలీ కావలసిన అవసరం ఉందని, దానికోసం ఎవరి స్థాయిలో వారు కృషి చేయాలని సూచించారు. వైసీపీకి ఎక్కడా, ఏ అంశాల్లోనూ అవకాశం ఇవ్వకూడదని, ఈ విషయంలో ఎవరూ భేషజాలకు పోవద్దన్నారు. తాను కూడా ఎలాంటి భేషజాలకు పోకుండా, రాష్ట్రం కోసం వెనక్కి తగ్గే నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు. కాగా విజయవాడ వెస్ట్, కైకలూరు ప్రచారానికి తప్పకుండా వస్తానన్నారు. విజయవాడ, కైకలూరులో జనసైనికులు మీతోనే ఉంటారన్నారు. పార్టీ నేతలను మీతో సమన్వయం చేసుకోవాలని ఈపాటికే ఆదేశాలిచ్చానని పవన్ వివరించారు.

 

Leave a Reply