-మోడీ, జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
-రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
ఏలూరు: తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా నిర్వీర్యం చేసి నిర్వాసితులను గోదావరిలో ముంచారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర ఏలూరు జిల్లాలో బుధవారం ప్రవేశించింది. స్థానిక ఆశ్రమం ఆసుపత్రి, ఏలూరు మెయిన్ బైపాస్ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణకు సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.
స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్వాగతం పలికిన అనంతరం స్థానిక టుబాకో మర్చంట్ కళ్యాణ మండపం వరకు పాదయాత్ర చేశారు. అనంతరం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, ఏలూరు జిల్లా ఇంచార్జ్ అక్కినేని వనజ అధ్యక్షత వహించారు.
తొలుత సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య రాజకీయ పక్షాల నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కె.రామకృష్ణ మాట్లాడుతూ నిర్వాసితుల త్యాగ ఫలితమే పోలవరం ప్రాజెక్టు అన్నారు.కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో ప్రతి సంవత్సరం రూ.15 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తే 4 సంవత్సరాలలో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి రాష్ట్ర సస్యశ్యామలం అయ్యేది అన్నారు. పోలవరం నిర్వాసితులు 1 లక్ష 6 వేల కుటుంబాలు ఉంటే కేవలం 20 వేల కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తాం అనటం దుర్మార్గంఅన్నారు.
అమరావతి రాజధానిగా నిర్మాణం చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి జగన్, పోలవరం ప్రాజెక్టుకు మోడీ శనిలాగా దాపురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ఉత్తరాంధ్రకు సాగునీరు, తాగునీరుతో పాటు, పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి,కుడి ప్రధాన కాలువ ద్వారా 7.20 లక్షల ఎకరాలు సాగు అయ్యి, పరోక్షంగా 30 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడుతుందన్నారు.
960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉత్పత్తి సాధిస్తామన్నారు. ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా గిరిజనులు కొండలు, గుట్టలపై తల దాచుకొని జీవితాలు దిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కు నష్టపరిహారం చెల్లించి, ప్రాజెక్టు నిర్మాణం తక్షణం డిమాండ్ చేశారు.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కేవలం 22 శాతం మాత్రమే పరిష్కారం లభించిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కేంద్రంపై ఒత్తిడి చేసి నిధులు రాబట్టకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యం అని ప్రశ్నించారు.
నిధుల లేమితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయ్యి ప్రాజెక్టు ఉనికి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు డ్యాం ప్రపంచ స్థాయి నిపుణులతో తనిఖీ చేయించి నష్టపరిహారాన్ని కాంట్రాక్టర్ల వద్ద వసూలు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేయడంలో తొలి ముద్దాయి మోడీ అని ఆరోపించారు. మోడీ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ పనికిమాలిన ప్రధానిగా ఉన్నందుకు ప్రతి భారతీయుడు సిగ్గుపడాలన్నారు. జగన్ ను మోడీ కాపాడుతున్నారని ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిధుల కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలన్నారు. నిర్వాసితులకు అండగా ఉండి అందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం తెస్తానని మోడీ రాజ్యం తీసుకువచ్చిన ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వలన భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72శాతం పూర్తిచేస్తే వైసిపి ప్రభుత్వం హయాంలో కేవలం 4 శాతం మాత్రమే పూర్తయింది అన్నారు.
కనీసం 2030 సంవత్సరానికి పూర్తవుతుందో లేదో అని రైతాంగం, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేయకుండా కాంట్రాక్టు ఏజెన్సీలను ఒక కలం పోటుతో రద్దు చేయడం వలన పోలవరం జాప్యానికి ప్రధాన కారణం అన్నారు. సామాజిక విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా పోలవరం ప్రాజెక్టు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
నీటికి రాజకీయరంగు పులమాల్సిన అవసరం లేదన్నారు. నీటితోనే అభివృద్ధి సాధ్యం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే అన్ని రంగాలకి ఉపయోగమని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సర్వం త్యాగం చేసిన నిర్వాసితులే తొలి లబ్ధిదారులుగా ఉండాలన్నారు
. మోడీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జగన్ అనాలోచిత విధానాల ఫలితంగా మట్టి రాతి కట్టడం,డ్యాం నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్ ను మార్చి రూ.235 కోట్లు ఆదా చేశానన్న ముఖ్యమంత్రి జగన్ రూ.2335 కోట్లు అదనంగా ప్రతిపాదించి కాంట్రాక్టర్ ను నియమించడంతో రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచి న ఘనుడు జగన్ అన్నారు. ఈ పరిస్థితులన్నిటికీ కారణం ప్రధాన మోడీ, జగన్ అన్నారు.
మేధావుల పురం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదిత డిజైన్ 45.72 నుండి 41.15 కుదించి నిర్మించడం వలన కేవలం 100 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి ప్రజా సమస్యలపై వామపక్ష పార్టీలు మాత్రమే పోరాడుతున్నాయన్నారు. రాజకీయ నాయకులు ఒకరికి ఒకరు పోకుండా ఐక్యంగా పోరాడితేనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నిర్వాసితులను పూర్తిస్థాయిలో ఎప్పుడు ఖాళీ చేస్తే అప్పటివరకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని పరిహారం చెల్లించాలన్నారు. బిజెపితో అంటగాగే పార్టీలన్నిటిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
సభకు అధ్యక్షత వహించిన అక్కినేని వనజ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఆది నుంచి అనేక బాలరిస్టాలు తట్టుకొని కొంత మేరకు పనులు జరిగాయన్నారు. పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక కావడం వలన 90 శాతం నిధులు కేంద్రమే భరించాలన్నారు. కేంద్రం సహాయం చేస్తేనే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం అని చెప్పటం ముఖ్యమంత్రి చేతకానితనానికి నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన స్వార్ధపర సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం అన్ని పార్టీలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్రావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం పోరాడుతున్న అన్ని పార్టీలు తమ మద్దతు ఉంటుందన్నారు.జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడానికి ముఖ్యమంత్రి జగన్ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రజా సమస్యలపై నిలదీయలేని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం మన దౌర్భాగ్యం అన్నారు.
అనంతరం సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ వందన సమర్పణ చేశారు. తొలుత ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్ర నాయక్, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ పెంచలయ్య, ఏలూరు ఏరియా కార్యదర్శి తమ్మా విశ్వేశ్వరరావు ఇతర కళాకారులు ఆలపించిన గేయాలు అందరిని ఆకట్టుకున్నాయి.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కీ లెనిన్ బాబు, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి,సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, కొండేటి బేబి, పలువురు సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.