Suryaa.co.in

Telangana

ప్రభుత్వ పరిపాలనలో ప్రణాళికా శాఖ పాత్ర కీలకం

– ఇతర శాఖలకు దిక్సూచి ప్రణాళికా, అర్థ గణాంక శాఖ
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
– అర్థ గణాంక, ప్రణాళికా శాఖ ముద్రించిన మూడు ప్రచురణలను ఆవిష్కరించిన వినోద్ కుమార్
– రాష్ట్ర సమగ్ర గణాంక వివరాలతో మూడు ప్రచురణలు
– రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర సమాచార కరదీపిక
– ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పి చైర్మన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ కార్యదర్శులకు స్వయంగా లేఖ రాసి ఈ మూడు ప్రచురణలు పంపిన వినోద్ కుమార్
జిల్లా గ్రంథాలయాలు, యూనివర్సిటీ లైబ్రరీలకు కూడా అందజేత
రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ప్రణాళికా, అర్థ గణాంక శాఖ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అర్థ గణాంక, ప్రణాళికా శాఖ ముద్రించిన ” తెలంగాణ జర్నీ ” , ” స్టేట్ ఎకానమీ ” , ” తెలంగాణ ఎకానమీ ” మూడు ప్రచురణలను వినోద్ కుమార్ బుధవారం మంత్రుల అధికారిక నివాసంలో ఆవిష్కరించారు.
ఈ మూడు ప్రచురణలను ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పి చైర్మన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర అధికారులకు స్వయంగా లేఖ రాసి ఈ మూడు ప్రచురణలను పంపిన వినోద్ కుమార్. ఈ ప్రచురణలు ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రచురణలను చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ ద్వారా అందజేసే ఏర్పాట్లు చేశారు. జిల్లా గ్రంథాలయాలు, యూనివర్సిటీ లైబ్రెరీలలో కూడా అందుబాటులో ఉంచనున్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రణాళికా, అర్థ గణాంక శాఖలు ప్రభుత్వంలోని ఇతర శాఖలకు దిక్సూచిగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. వివిధ శాఖల పురోగతి, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని క్రోడీకరించి నివేదికలను రూపొందించడంలో ప్రణాళికా, అర్థ గణాంక శాఖలు పోషిస్తున్న పాత్ర అభినందనీయమని ఆయన అన్నారు.సూక్ష్మ పరిశీలన, లోతైన విశ్లేషణ చేసేందుకు ఎప్పటికప్పుడు ఈ శాఖల అధికారులకు సూచనలు, సలహాలను ఇస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని గణాంకాలతో మూడు ప్రచురణలను వెలువరించారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, రాష్ట్ర జీ.డీ.పీ. సహా విద్యా, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, నీటి పారుదల రంగాల్లో సాధించిన ప్రగతి, గణాంకాలు ప్రస్తావించారు.రాష్ట్ర సమగ్ర సమాచారంతో కూడుకున్న ఈ మూడు ప్రచురణలు కరదీపికగా ఉపయోగపడుతుంది. రాష్ట్రం మరింత అభివృద్ధిని సాధించేందుకు సమగ్ర కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అర్థ గణాంక శాఖ సంచాలకులు జీ. దయానంద్, సహాయ సంచాలకులు కే. వీ. ప్రసాద్ రావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి పాల్గొన్నారు.

LEAVE A RESPONSE