Suryaa.co.in

Political News

ఇండియాలో బలపడుతున్న ‘రెండు పార్టీల’ ప్రజాతంత్ర వ్యవస్థ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 43వ వార్షికోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ‘రెండు పార్టీల వ్యవస్థ’పై చర్చ మొదలైంది. భారత రాజకీయాల్లో రెండు ప్రధాన జాతీయ పార్టీలే (బీజేపీ, కాంగెస్‌) ముఖ్య భూమిక పోషించే పరిస్థితి స్థిరపడిందని రాజకీయ పండితులు అంచనావేస్తున్నారు. పాతిక సంవత్సరాలుగా, అంటే 1998 మార్చి 19 నుంచీ కేంద్రంలో కేవలం ఈ రెండు పార్టీలకే చెందిన నాయకులే (ఏబీ వాజపేయి, మన్మోహన్‌ సింగ్, నరేంద్రమోదీ) ప్రధానమంత్రి పదవి చేపట్టారు.

గత ఆరు పార్లమెంటు ఎన్నికల్లో (1998, 1999, 2004, 2009, 2014, 2019) మొదటి నాలుగుసార్లూ రెండు ప్రధాన పార్టీల్లో దేనికీ మెజారిటీ రాని మాట నిజమే. కాని, 1998, 99 లోక్‌ సభ ఎన్నికల తర్వాత బీజేపీ అగ్రనేత, అప్పటికి మాజీ ప్రధాని వాజపేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ పేరుతో రెండు సంకీర్ణ ప్రభుత్వాలు నడిచాయి.

తర్వాత 2004, 2009 ఎన్నికల్లో లోక్‌ సభలో అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ యూపీఏ సంకీర ్ణ ప్రభుత్వాలకు రెండుసార్లు నాయకత్వం వహించారు. 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ వరుసగా సాధారణ మెజారిటీకి అవసరమైన సీట్లు (282, 303) సాధించినాగాని బీజేపీ నాయకుడు నరేంద్రమోదీ జీ ప్రధానిగా సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. మొత్తంమీద గడచిన 25 ఏళ్లుగా ఈ రెండు జాతీయపక్షాల నేతలే ప్రధాని పదవి చేపడుతున్నారు.

అనేక రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయపక్షాలు అధికారంలో ఉన్నప్పటికీ పైన చెప్పిన విధంగా రెండు రాజకీయ పార్టీలే జాతీయ రాజకీయాల్లో ఆధిపత్యం సంపాదించడంతో ఇండియాలో కూడా ‘రెండు పార్టీల వ్యవస్థ’ బలపడుతోందనే అభిప్రాయం రాజనీతిశాస్త్రవేత్తల్లో కలుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ కాకుండా ఇతర పార్టీల నేతలు మొరార్జీదేశాయి (జనతాపార్టీ), చరణ్‌ సింగ్‌ (లోక్‌ దళ్‌), వీపీ సింగ్‌ (జనతాదళ్‌), చంద్రశేఖర్‌ (ఎస్జేపీ), హెచ్‌ డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ (ఇద్దరూ జనతాదళ్‌) కొద్ది కాలం ప్రధాని పదవిలో ఉండి సంకీర్ణ సర్కార్లకు సారధ్యం వహించారు. ప్రస్తుతం వారి పార్టీలు మళ్లీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చే స్థితిలో లేవు. వాటిలో చాలా పార్టీలు అసలు ఉనికిలో కూడా లేనట్టే.

అమెరికా, ఇంగ్లండ్‌ దేశాల్లో బలపడి, స్థిరపడిన ‘రెండు పార్టీల వ్యవస్థ’
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానకి పుట్టినిల్లు ఇంగ్లండ్‌ లో దాదాపు వందేళ్లకు పైగా రెండు ప్రధాన రాజకీయపక్షాలే (కన్సర్వేటివ్, లేబర్‌ పార్టీలు) ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వస్తున్నాయి. అంతకు ముందు ఆధిపత్యం చెలాయించిన లిబరల్‌ పార్టీ కనుమరుగైంది. ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ పార్లమెంట్స్‌’ అని పేరున్న బ్రిటిష్‌ పార్లమెంటు దిగువసభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ లో చిన్నా చితకా పార్టీలకు కొద్దిపాటి ప్రాతినిథ్యం ఉన్నా ఆ పార్టీల నేతలు ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశాలు లేనేలేవు.

రెండొందల సంవత్సరాలకు పైగా ప్రజాస్వామ్యం విజయవంతంగా నడుస్తున్న అమెరికాలో 150 ఏళ్ల ముందు నుంచే రెండు పార్టీలు: రిపబ్లికన్‌ పార్టీ, డెమొక్రాటిక్‌ పార్టీలు మాత్రమే అక్కడ ఫెడరల్, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను నడుపుతున్నాయి. అక్కడ ఎన్నికల సంఘం దగ్గర నమోదైన రాజకీయపక్షాలు వందల సంఖ్యలో ఉన్నా, అధ్యక్ష ఎన్నికలు సహా అనేక రకాల ఎన్నికల్లో డజన్ల సంఖ్యలో రాజకీయపక్షాలు పోటీచేస్తున్నా– వాటి ఉనికి నామమాత్రమే. ఇండియాలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యనే పోటీ ఉన్న మాట నిజమే.

కానీ అనేక చిన్నా పెద్దా రాష్ట్రాల్లో ప్రాంతీయపక్షాలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో రెండు పార్టీ వ్యవస్థ నెమ్మదిగా బలపడుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 137 ఏళ్ల క్రితం పుట్టిన కాంగ్రెస్‌ కిందటి రెండు పార్లమెంటు ఎన్నికల్లో వరుసగా 44, 52 సీట్లు మాత్రమే గెలుచుకున్నా, ఈ పార్టీయే పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది.

1951–77 మధ్య భారతీయ జనసంఘ్‌ లో పనిచేసి, 1977–1980 మధ్య కాలంలో నాటి జనతా పార్టీలో అంతర్భాగంగా కొనసాగిన నాయకులు, కార్యకర్తలు– 1980 ఏప్రిల్‌ మొదటివారంలో బీజేపీని ప్రారంభించడం ఇండియాలో రెండు పార్టీల ఆధిపత్యంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకోవడానికి దారితీసింది.

– విజయసాయిరెడ్డి (రాజ్యసభ సభ్యులు)

LEAVE A RESPONSE