Suryaa.co.in

Andhra Pradesh

బాబును మించిన సైకో దేశంలోనే మరొకరు లేరు

– చంద్రబాబు ఉన్మాదిలా మాట్లాడుతున్నారు
– ఏపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నారు
– వైసీపీ ఎమ్మెల్యేమల్లాది విష్ణు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు రౌడీలు మాట్లాడే భాష మాట్లాడుతున్నారని.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా దూషిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్టీ రామారావుని మానసిక క్షోభకు గురి చేసిన చంద్రబాబును మించిన సైకో దేశంలోనే మరొకరు లేరని ధ్వజమెత్తారు. ఏపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి చంద్రబాబు అండ్ కో కంకణం కట్టుకుందని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడ ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టడం తెలుగుదేశం నాయకులకు అలవాటు అయిందన్నారు. మరీముఖ్యంగా అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, పట్టాభిరామ్, బుచ్చయ్యచౌదరి వంటి వారు ఇందులో ఆరితేరారన్నారు. గోబెల్స్ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని.. రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. సిద్ధాంతాలు, నీతి, నిజాయితీ అనే పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. అది చంద్రబాబు మాత్రమే అని మల్లాది విష్ణు విమర్శించారు.
కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, వెన్నుపోట్లు, హత్యా రాజకీయాలతో పైకి ఎదిగిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గూర్చి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలోనూ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ని ఉరి తీయాలని చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడారని గుర్తు చేశారు. జగన్మోహన్‌ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయాక మరింత అసహనంగా మాట్లాడుతున్నారని.. అసలు ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావట్లేదన్నారు. రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా ప్రతిపక్ష నేత వ్యవహరిస్తున్నారన్నారు.
చంద్రబాబును ఇంటికే పరిమితమయ్యేలా రాష్ట్ర ప్రజలు భయంకరమైన శిక్ష వేసిన సిగ్గురాలేదని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంచితనాన్ని ఆసరా చేసుకుని రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన చెంచాలు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు భాష, చేష్టలు, చేతలు చూసి.. ఇటువంటి ప్రతిపక్ష నేత ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. ఈ మధ్య కాలంలో ఆయనలో క్రూరత్వం మరీ పెరిగిపోయింది.. ఇప్పటికైనా భాషని మార్చుకోవాలని సూచించారు. రాజకీయాలలో వ్యక్తిగత దూషణలు, కుటుంబాల ప్రస్తావనలకు తావులేదన్నారు.
రెండేళ్లలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ కర్రు కాల్చి ప్రజలు వాతలు పెట్టినా, ‘టీడీపీ పనైపోయింది’ అని పార్టీ రాష్ట్ర అ‍ధ్యక్షుడే స్వయంగా చెప్పినా.. చంద్రబాబుకు ఎందుకు కనువిప్పు కావడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేత నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి గౌరవాన్ని తగ్గించుకోవద్దని కోరారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులను తక్షణమే క్షమాపణ కోరుతూ.. చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కు తీసుకుంటే హుందాగా ఉంటుందని మల్లాది విష్ణు అన్నారు.

LEAVE A RESPONSE