– ఈ నెల 9న మెడికల్ కాలేజీని సందర్శించడం తథ్యం
– పోలీసు ఆంక్షలతో పర్యటనను అడ్డుకోవాలనుకోవడం అవివేకం
– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)
తాడేపల్లి: పోలీసు ఆంక్షలతో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈనెల 9న మాకవరపాలెంలో మెడికల్ కాలేజీని సందర్శించడంలో ఎలాంటి మార్పూ ఉండదని వైయస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు.
వైయస్ జగన్ నర్సీపట్నం పర్యటనకు అనుమతి లేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ, విశాఖ సీపీ ప్రకటించిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విశాఖ ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో నర్సీపట్నంకి వస్తుంటే భద్రత కల్పించలేమని పోలీసులు చేతులెత్తేయడం రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయనడానికి నిదర్శనం అని మండిపడ్డారు.
జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడి పర్యటనకి భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత కాదా అని ప్రశ్నించారు. వారం రోజులుగా ఉత్తరాంధ్రలో తీవ్రమైన వర్షపాత పరిస్థితులున్నా ఆయన్ను హెలిక్యాప్టర్ లోనే రావాలనడం చూస్తుంటే సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. ప్రైవేటీకరణ పేరుతో 10 మెడికల్ కాలేజీలకి చెందిన ప్రభుత్వ సంపదను తన వారికి దోచిపెట్టడానికి సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలనను వైయస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
విజయవాడ నుంచి విశాఖ ఎయిర్పోర్టుకి చేరుకుని అక్కడ్నుంచి రోడ్డు మార్గం ద్వారా నర్సీపట్నంలోని మాకవరపాలెంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించడం జరుగుతుంది. ఎవరు ఎన్ని విధాలుగా కట్టడి చేసే కుట్రలు చేసినా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తారు. అందులో రెండో ఆలోచన లేదు.
విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మెడికల్ కాలేజీకి చేరుకుని పరిశీలించిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడతారు. ప్రతిపక్ష నేత పర్యటన గురించి వైయస్సార్సీపీ తరఫున మూడు రోజుల క్రితమే ప్రభుత్వానికి, పోలీస్ శాఖకి సమాచారం ఇవ్వడం జరిగింది.
గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో రోడ్డు మార్గంలో చాలాసార్లు పర్యటించారు. ఆ సమయంలో ఎలాంటి ఆంక్షలు విధించకుండా వైయస్సార్సీపీ ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. చంద్రబాబు కందుకూరు, గుంటూరు పర్యటనల్లో తొక్కిసలాట జరిగినా, పీలేరులో తెలుగుదేశం శ్రేణులు పోలీసులపై దాడులకు దిగి విధ్వంసం సృష్టించినా ఆయన పర్యటనలకు ఎక్కడా మేము అనుమతులు నిరాకరించలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పర్యటనలకు సహకరించాం.