Suryaa.co.in

Andhra Pradesh

వీళ్లేం మారలేదు!

– స్వామి భక్తి చాటుకుంటున్న ఎన్టీవీ, టీవీ9
– జగన్ కారు కింద పడి చనిపోయిన సింగయ్య ఉదంతాన్ని నిస్సిగ్గుగా విస్మరించిన సాక్షి బోకెలోని ఛానెళ్లు

(రైతుబిడ్డ)

ఎన్టీవీ, టీవీ9 ఛానెళ్ల మీద టీడీపీ బ్యాన్ విధించడం తప్పేం కాదని మరోసారి నిజమని తేలింది. జగన్ కారు కింద పడి నలిగిపోయి.. చనిపోయిన సింగయ్య మృతి ఉదంతాన్ని ఎన్టీవీ, టీవీ9 ఛానెళ్లు పూర్తిగా పక్కన పెట్టేశాయి. జగన్ కారు కింద పడి చనిపోతే.. అస్సలు వార్తే కాదు అనే రీతిలో ఆ రెండు ఛానెళ్ల తీరు ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనను కనీసం కవర్ చేయడానికి కూడా ఈ ఛానెళ్లు ఇష్టపడలేదు. మిగిలిన ఛానెళ్లతో పాటు.. తాము కూడా ఈ వార్తను కవర్ చేస్తే.. తమ యజమాని జగనుకు విపరీతమైన డామేజ్ జరుగుతుందని భావించినట్టున్నాయి. దీంతో ఈ విషయంతో తమకేం సంబంధం లేదన్నట్టు.. వేరే వార్తలు వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయి. దీంతో ఆ రెండు ఛానెళ్లపై నిషేధం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ రెండు ఛానెళ్లపై బ్యాన్ చేయడం సరైన విధానమేనని మీడియా వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.

జరిగింది ఏదో జరిగిపోయింది.. బ్యాన్ లిఫ్ట్ చేయాలని గతంలో కొందరు టీడీపీ పెద్దలకు సూచించారు. వీరిలో కొందరు పాత్రికేయులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎన్టీవీ, టీవీ9 ఛానెళ్ల వ్యవహరం చూసి.. పార్టీ పెద్దలకు సలహాలిచ్చిన సదురు పాత్రికేయులు కూడా ఈ రెండు ఛానెళ్ల తీరుపై నోరెళ్లబెడుతున్నారు.

న్యూట్రల్ ఛానెళ్లు అని తమ తమ గురించి తాము గొప్పగా చెప్పుకునే ఈ ఛానెళ్ల యాజమాన్యాలు ఎన్నికల ముందే నిస్సిగ్గుగా జగన్ను గెలిపించేందుకు వైసీపీ పన్నిన కుట్రలకు పూర్తిగా సహకరించాయి. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన కార్యక్రమాలను ఏ మాత్రం ఇచ్చేవి కావు. పైగా అవసరం లేకున్నా.. వైసీపీ అజెండాను భుజాన వేసుకుని టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా కుట్రలను అమలు చేసేవి. అధికారం కొల్పోయిన తర్వాత కూడా ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తున్నాయి.

ఎన్టీవీ, టీవీ9 ఛానెళ్లు జగన్ సత్తెనపల్లి పర్యటనను ఆసాంతం ఇచ్చాయి. లైవులు పెట్టాయి. జగన్ మీద తమ వీర విధేయతను చాటుకున్నాయి. నాటి ఘటనను పూర్తిగా ఇచ్చిన ఛానెళ్లు.. ఇప్పుడు ఇంత ముఖ్యమైన వార్తను ఎలా విస్మరించారు..? ఇవేం పాత్రికేయం అంటూ విమర్శిస్తున్నారు.

ముఖ్యమైన ఈ వార్తను కవర్ చేయకపోగా.. పోలీసులను.. ప్రభుత్వాన్ని తప్పు పడుతూ అంబటి రాంబాబు పెట్టిన ప్రెస్ మీట్ ను మాత్రం పూర్తిగా ఇచ్చాయి. పాత్రికేయ ప్రమాణాల ప్రకారం చూస్తే ఇది క్షమించరాని నేరం కాదా అంటున్నారు. పాత్రికేయ విలువలు ఎప్పుడో గాలికి పోయాయి.. అని అనుకున్నా.. మరీ ఇలా దేవతావస్త్రాలు తొడుక్కుని చేస్తున్న పాత్రికేయాన్ని చూసి నివ్వెరపోతున్నారు.

సాక్షి ఛానెల్ ఎలాగూ ఇవేం కవర్ చేయదు. ఎందుకంటే వారు వైసీపీకి చెందిన వారు. కానీ తమది న్యూట్రల్ ఛానెల్ అని చెప్పుకునే ఈ రెండు ఛానెళ్లు మాత్రం ఈ విధంగా వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే చర్చ జరుగుతోంది. ఇదే బాటలో 10టీవీ, ప్రైమ్9 ఛానెళ్లు కూడా వెళ్తున్నాయి.

LEAVE A RESPONSE