చిలకలూరిపేటకు పట్టిన దుస్థితి ఇది

– ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
-చిలకలూరిపేట సభ దద్ధరిల్లాలి, ఢిల్లీలో చర్చ జరగాలి: ప్రత్తిపాటి

అధికార వైసీపీ అభ్యర్థుల మార్పు నాటకాల్లో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడిని తలపిస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎద్దేవా చేశారు. చిలకలూరిపేటకు కొత్తగా మూడో కృష్ణుడు వచ్చారని సెటైర్లు వేశారు. అతను ఎన్ని రోజులు ఉంటాడో ఎవరికీ తెలియదన్నారు. దీన్నిబట్టే ప్రత్తిపాటి ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. ప్రత్తిపాటి తనయుడు శరత్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని.. ప్రత్తిపాటిని కోర్టులు చుట్టూ తిప్పితే రాజకీయంగా కార్యకలాపాలు చేసుకోలేరని భావించారన్నారు.

ఇక్కడకు వచ్చిన ప్రతి కార్యకర్త ఒక ప్రత్తిపాటి పుల్లారావు అని భావించి ఎలక్షన్ చేయాలని సూచించారు. ఈ ఐదేళ్లు చిలకలూరిపేటలో ఒక వింత పరిస్థితి నెలకొందని.. రోడ్డుపైకి వెళ్లి మీ ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడిన వారి 10 పేర్లు చెప్పడంటే ఒక్కరూ చెప్పలేరన్నారు. ఇది చిలకలూరిపేటకు పట్టిన దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.

పసుమర్రులో పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమంలో ఎకరానికి ఇంత అంటూ డబ్బులు వసూలు చేశారని.. స్థలాలు అవన్నీ తీసుకొని కూడా ఎకరానికి ఇంత తీసుకుంటామంటున్నారని తన దృష్టికి వస్తే గట్టిగా ఫోన్ చేసి మాట్లాడాను కానీ ఇక్కడివారి నుంచి స్పందన రాలేదన్నారు. యడవల్లి భూముల అంశంలోనూ అలాగే జరిగిందన్నారు.

చిలకలూరిపేటకు ఈ కర్మ ఏంటని లావు శ్రీకృష్ణదేవరాయులు ప్రశ్నించారు. ఈ సమావేశం చూస్తేనే ప్రత్తిపాటి పుల్లారావు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని అర్ధవవుతుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

చిలకలూరిపేటలో ఆరున్నర కోట్ల రూపాయల వసూలుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటున్నారన్నారు. డబ్బులు తీసుకొని మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత రాజేశ్‌ నాయుడిపై ఉందన్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసే విషయంలో కావాలంటే తాము కూడా సాయం చేస్తామన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాల్సిన అవసరం ఉందన్నారు. పల్నాడులో ప్రాజెక్టులో ఎవరైతే పూర్తి చేస్తారో వారిని గెలిపించాలని సూచించారు. పల్నాడులో సమస్యలను పరిష్కరించడానికి ఎవరైతే బాగుంటుందో వారిని గెలిపించాలన్నారు. గత ఐదేళ్లుగా ఎక్కడా తాను అనవసరంగా మాట్లాడింది, వివాదాలకు పోయింది లేదన్నారు. ఈ ఐదేళ్ల నుంచి కూడా పూర్తిగా ఇక్కడ ప్రాజెక్టులు, సమస్యలను దిల్లీ స్థాయిలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో అని మాత్రమే పనిచేశానన్నారు.

ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులతో సస్యశ్యామలం, మరొకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ప్రాంతం రూపురేఖలే మార్చడమే మిషన్‌గా పెట్టుకుని పని చేస్తున్నట్లు తెలిపారు. 2019లో నరసరావుపేట ప్రజలు మొదటి అవకాశం ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయిదేళ్లు అదే లక్ష్యంతో పనిచేశా, వారు ఆశీర్వదిస్తే మరో అయిదేళ్లు ఆ అభివృద్ధిని ముందుకు తీసుకునివెళ్తానని ఆయన హామీనిచ్చారు. పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు.

చిలకలూరిపేట ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తే ఇక్కడివారు వేరే ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. చిలకలూరిపేటకు వచ్చే ఐదేళ్లలో ఏం చేయబోతున్నామో ప్రత్యేక మ్యానిఫెస్టో తీసుకువస్తామని ప్రత్తిపాటి చెప్పారన్నారు. ఏ విధంగా అయితే సూపర్ సిక్స్ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నారో అలానే చిలకలూరిపేట మేనిఫెస్టో గురించి వివరించాలన్నారు.

చిలకలూరిపేటకు ఏం చేయబోతున్నామో… రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేయబోతున్నారో ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తూనే స్థానికంగా సమస్యల పరిష్కారానికి భరోసా కల్పించాలన్నారు. రాష్ట్ర అభ్యున్నతి కోసం పనిచేయాలనుకునే వారు, గతంలో పార్టీని వీడినవారు తెలుగుదేశం పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిద్దామని సూచించారు.

నవ్యాంధ్ర భవిష్యత్‌కు దశ దిశ చూపే చిలకలూరిపేట ఉమ్మడి సభ దద్ధరిల్లాలని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి చిలకలూరిపేటలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పరిచయం, నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సిద్ధం పేరిట గ్రాఫిక్స్ చూపిన జగన్‌కు కలలో సైతం చిలకలూరిపేట సభే కనపడాలని …ఇందుకు తెలుగుదేశం, జనసేన, భాజపా శ్రేణులు కష్టాడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభను విజయవంతం చేయడం ద్వారా దిల్లీలో శ్రీకృష్ణదేవరాయలు కనపడితే సభే గుర్తుకొచ్చేలా చేయాలన్నారు.

2014లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరినప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా టీడీపీ-బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సభకు తానే అధ్యక్షత వహించినట్లు చెప్పారు. కనీవినీ ఎరుగని రీతిలో అప్పుడు సభను విజయవంతం చేశామన్నారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏలో టీడీపీ చేరిన తర్వాత మళ్లీ ఆ అదృష్టం చిలకలూరిపేటకు వచ్చిందన్నారు. ఆ సభ తర్వాతే పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను కొనసాగించాలన్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని… రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని ప్రత్తిపాటి ధీమా వ్యక్తం చేశారు.

బొప్పూడిలో జరిగే ఉమ్మడి బహిరంగ సభకు చిలకలూరిపేట నుంచే లక్షమంది తరలిరావాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి చిలకలూరిపేట తెలుగుదేశం కార్యకర్తల శక్తి, సామర్థ్యాలు చూపేందుకు ఇది చక్కటి అవకాశం అన్నారు. మిగతా నియోజకవర్గాల నాయకులు అసూయ పడేలా ఈ సభ విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ ఛాలెంజ్‌గా తీసుకుని పని చేయాలన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి ఇదే ఎన్నికల ప్రచార సభ కాబోతుందన్నారు.

చిలకలూరిపేటలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. 5 కోట్ల మంది ప్రజల నోళ్లలో నానుతున్న నియోజకవర్గం చిలకలూరిపేట అని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ పరిధిలో ఈ సభ రావడం కూడా ఒక అదృష్టమన్నారు. 17న జరిగే సభ టీడీపీ, జనసేన, బీజేపీకి ఒక పండగ లాంటిదన్నారు. ఇలాంటి సభ దేశంలో ఎక్కడా జరగలేదని ప్రధాని మోదీ అనుకోవాలని వెల్లడించారు. మూడు పార్టీల పొత్తు కుదరగానే జగన్‌ ఓడిపోవడానికి, జైలుకెళ్లడాని సిద్ధంగా ఉన్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు.

దేశం నుంచి పారిపోవడానికి కూడా జగన్ సిద్ధంగా ఉన్నారని చురకలు అంటించారు. తప్పు చేయకపోయినా శరత్‌బాబును అక్రమంగా అరెస్టు చేశారని.. తాము తప్పుచేయలేదని.. ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా రాత్రి 10 గంటల వరకు తిప్పారన్నారు. జగన్‌రెడ్డి వ్యవస్థలను అత్యంత దరిద్రంగా తయారు చేశారని మండిపడ్డారు. తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. చిలకలూరిపేటలో కార్యకర్తల జోలికి వచ్చిన వారిని వదిలిపెట్టనని.. తప్పుడు కేసులు పెట్టిన వారిని కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు

ప్రత్తిపాటి. అక్రమ కేసులు పెడుతున్న అధికారులను వదిలిపెట్టబోమని.. ఐఏఎస్, ఐపీఎస్‌లైనా వదిలిపెట్టేది లేదన్నారు. జగన్‌రెడ్డి చెప్పినట్లు ఆడే అధికారులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ 40 రోజులు కష్టపడి పనిచేస్తే.. రాబోయే పదేళ్లు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో ఉండబోతుందన్నారు.

Leave a Reply