Suryaa.co.in

Andhra Pradesh

మోదీ సభ భద్రతా ఏర్పాట్లపై ఎస్పీజీ, ఐజీ సమీక్ష

– సభా ప్రాంగణంలో ఏర్పాట్లను వివరించిన మాజీమంత్రి ప్రత్తిపాటి

చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే ఉమ్మడి సభ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం సమీక్షించింది. సభాస్థలి, పార్కింగ్‌, వాహన రాకపోకలకు ఉన్న మార్గాలు, చుట్టుపక్కల ప్రదేశాలను ఎస్పీజీ బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు.

సభకు ఎంత మంది హాజరయ్యే అవకాశం ఉంది, ప్రధానితో పాటు ఇంకా ఎవరెవరు వేదికపై ఉంటారన్న సమాచారాన్ని తెలుగుదేశం-జనసేన-బీజేపీ నేతల నుంచి సేకరించారు. ప్రధాని పర్యటన భద్రతకు రాష్ట్ర పోలీసులు చేస్తున్న సన్నాహకాలను కూడా ఎస్పీజీ అడిగి తెలుసుకుంది. రాష్ట్ర పోలీసుల తరుఫున గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా కలెక్టర్ కలెక్టర్ శివశంకర్, పలు జిల్లాల ఎస్పీలు వీరికి సహకరించనున్నారు.

ఎస్పీజీ అధికారులతో కలిసి వారు కూడా సభాస్థలిని పరిశీలించారు. సభా ఏర్పాట్లు ఎప్పుడు పూర్తి అవుతాయి,ఎప్పటి కల్లా ప్రధానమంత్రి కూర్చునే వేదికను ఎస్పీజీ అప్పగిస్తారని మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, పెందుర్తి వెంకటేష్‌ను అడిగి తెలుసుకున్నారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను వారికి ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు. బ్లూబుక్‌గా పిలిచే భద్రత నిబంధనల మేరకు ఏర్పాట్లు ఎలా ఉండాలో కూడా తెలుగుదేశం నేతలకు, పోలీసులకు ఎస్పీజీ బృందం పలు రకాల సూచనలు చేసింది.

LEAVE A RESPONSE