– 27న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ ఛార్జీల బాదుడుపై తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
– అన్ని వర్గాల ప్రజలపై కూటమి ప్రభుత్వం మోపిన భారంపై శాంతియుతంగా వైయస్ఆర్ సిపి ఈ కార్యక్రమం చేపడుతోంది
– వైఎస్సార్‌సీపీ క్యాడర్ అంతా క్రియాశీలకంగా దీనిలో పాల్గొనాలి
– పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్యనేతలతో టెలి కాన్ఫరెన్స్ లో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు
తాడేపల్లి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం…ఈ విషయంలో తక్షణమే పెంచిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజల తరుపున వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా ఏఈ లేదా డీఈ కార్యాలయంకు వెళ్ళి, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలి.
ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి, వారికి న్యాయం జరిగేలా వత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అసెంబ్లీ స్ధాయిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు అందరూ తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. నియోజకవర్గ ఇంఛార్జ్‌లంతా కూడా తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ దోపిడినీ ఎండగట్టాలి.
సోషల్ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు, వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్దంగా ఉంది, ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్ సెల్‌ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి.