Suryaa.co.in

Andhra Pradesh

అవన్నీ ఉత్తి ‘కోతలే’…

రాష్ట్ర ఇంధన శాఖ పత్రికా ప్రకటన
దసరా పండుగ తర్వాత గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో, నగరాల్లో లోడ్‌రిలీఫ్‌రరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం.
బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్‌ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్న విషయం అందిరికీ తెలిసిందే. ఇంతటి సంక్షోభ సమయంలోనూ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా, కరెంటు ఇచ్చేందుకు రాష్ట్ర విద్యుత్‌పంపిణీ సంస్థలు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నాయి. ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్‌ను అందిస్తున్నాయి.
సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసర ప్రణాళికల అమలును వెంటనే ప్రారంభించాం. రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఏ పి జెన్కో కు అత్యవసరంగా రూ . 250 కోట్లు నిధులు, బొగ్గు కొనుగోలు నిమిత్తం సమకూర్చ బడ్డాయి. రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించబడ్డాయి.
దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడవున్నా కొనుగోలు చేయవలసినది గా ఏ . పి జెన్కో కు ఆదేశాలు ఇవ్వ బడ్డాయి. స్వల్ప కాలిక మార్కెట్‌ నుంచి ధర ఎంత పలికినా అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సిందిగా విద్యుత్‌ పంపిణి సంస్థలను ఆదేశించడం జరిగింది.
కేంద్ర విద్యుత్‌ సంస్థల నుంచి ఎవ్వరికి కేటాయింపబడని విద్యుత్‌ వాటా నుంచి , వచ్చే సంవత్సరం జూన్‌ వరకు , ఆంధ్ర ప్రదేశ్‌ కోసం దాదాపు 400 మె . వాట్లు చౌక ధర విద్యుత్‌ కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు అభర్ధన పెట్టటం జరిగింది. బొగ్గు సరఫరా కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలతో నిమిత్తం లేకుండా కొరతతో వున్న విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా చెయ్యాలన్న కేంద్ర మార్గ దర్శకాలకు అనుగుణంగా మన రాష్ట్రానికి సరఫరా చేసే అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలతో మాట్లాడటం జరిగింది.
పొరుగు రాష్ట్రంలో ఉన్న సింగరేణి సంస్థతో సమన్వయము చేసుకుని మన రాష్ట్రము లో వున్న కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా కోసం నిరంతర ప్రయత్నం జరుగుతోంది. వి టి పి ఎస్‌ లోను మరియు కృష్ణపట్నంలోనూ కొత్త 800 వెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ప్రారంభించడానికి మరియు తొందరగా అందుబాటులోకి తేవటానికి తగిన చర్యలు తీసుకోవటం జరుగుతోంది.
విద్యుత్ కోతలపై సామాజికమాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దు- సిఎండి, ఈపిడిసిఎల్ కె.సంతోష్ రావు
విద్యుత్ కోతలపై సామాజికమాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపిడిసిఎల్) వినియోగదారులకు సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు విజ్ఞప్తి చేసారు. దసరా పండగ తర్వాత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (పవర్ కట్) ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయని సామాజికమాధ్యమాల్లో వస్తున్నట్లు సిఎండి దృష్టికి రావడంతో అటువంటి కోతలేవీ లేవని సిఎండి కె.సంతోషరావు స్పష్టం చేసారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి బొగ్గు నిల్వలను రాష్ట్రప్రభుత్వం సమకూర్చడం వలన విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవని సిఎండి పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎటువంటి సమాచారం ఉన్నా సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా వినియోగదారులకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అధికారకంగా తెలియచేస్తామన్నారు.

LEAVE A RESPONSE