కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు చేతులా సంపాదించుకున్న వారికి, ఇప్పుడు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అంటే కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్‌ను సంపాదించకున్న ఆ చేతులు ఆదుకోవాలన్నమాట. మీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమయిందని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ సమావేశంలో చెప్పకనే చెప్పేశారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలో కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి, సీనియర్ నేతలు పార్టీని వీడటంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఈ క్రమంలో మరోసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సోమవారం మరోసారి సమావేశమైంది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి సోనియా, రాహుల్‌తో పాటు పలువురు సీనియర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సోనియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 13, 14 తేదీల్లో రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చింతన్ శిబిర్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలు, పదవులు చేపట్టిన వ్యక్తులు హాజరుకానున్నట్టు చెప్పారు. దాదాపు 400 మంది హస్తం సీనియర్ నేతలు పాల్లొంటారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ఎన్నికల్లో ఓటములపై కీలకంగా చర్చించనున్నట్టు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రతీ ఒక్కరికీ మేలు జరిగిందని సోనియా అన్నారు. ఇప్పుడు పార్టీకి ఆ రుణాన్ని పూర్తి స్థాయిలో చెల్లించుకునే అవకాశం, సమయం వచ్చిందని సోనియా గుర్తు చేశారు. ప్రతీ ఒక్కరూ తాము చేస్తున్న పనుల గురించి, పార్టీ గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. పార్టీ కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడాలని సూచించారు.