Suryaa.co.in

Andhra Pradesh Editorial

బ్రదర్‌కు.. సిస్టర్స్ సెంటి‘మంట’

– ఎన్నికల సమయంలో ‘గొడ్డలిపోటు’ గొడవ
– వివేకా హంతకులకు జగనన్న రక్షకుడంటూ రోడ్డెక్కిన చెల్లెళ్లు
– ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డలు ఒంటరిపోరు చేస్తున్నారన్న సానుభూతి
– అన్నయ్యపై చెల్లెళ్ల ఒంటరిపోరుకు గ్రామీణ మహిళల మద్దతు
– పట్టణ మహిళల్లో సునీత-షర్మిల వీడియో వ్యాఖ్యల ప్రభావం
– సిస్టర్స్ సెంటిమెంట్‌తో వైసీపీకి మహిళా ఓట్లు దూరం
– అవినాష్, భాస్కర్‌రెడ్డే కారకులంటూ చెల్లెళ్ల ఆరోపణలు
– జగనన్నకు బాంధవ్యం విలువ తెలియదంటూ విసుర్లు
– సీబీఐ కేసు ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నల వర్షం
– సొంత చెల్లి పుట్టకపైనే లేకిరాతలేంటని కన్నీటిపర్వం
– హంతకుల పార్టీని ఓడించాలని షర్మిల-సునీత పిలుపు
– ఎన్నికల వరకూ వివేకా హత్యపై జగన్ మౌనం
– ఇప్పుడు చిన్నాన్న హంతకులపై వ్యాఖ్యలు
– కడప జిల్లాలో జగన్ వ్యాఖ్యలపై విస్మయం
– ఎన్నికల్లో మళ్లీ ‘హూ కిల్డ్ బాబాయ్’పై మళ్లీ చర్చ లాంటి రచ్చ
– ప్రచారంలో పెరుగుతున్న ‘వివేక’ం

(మార్తి సుబ్రహ్మణ్యం)

వాళ్లిద్దరూ జగనన్నకు చెల్లెళ్లు. అందులో ఒకరు వైఎస్ షర్మిలా రెడ్డి తోడబుట్టిన చెల్లి కాగా.. ముందు గుండెపోటు తర్వాత గొడ్డలిపోటుకు గురైన చిన్నాన్న వివేకానందరెడ్డి బిడ్డ, డాక్టర్ సునీతారెడ్డి మరొక చెల్లి. ఇప్పుడు ఆ సిస్టర్స్ ఇద్దరూ చెరోవైపు నిలబడి, బ్రదర్ జగన్‌ను చూపుడువేలుతో ప్రశ్నిస్తున్నారు. హుకిల్డ్ బాబాయ్ అని!

నా తండ్రి హంతకులకు నీవే రక్షకుడని వరసకు చెల్లి… చిన్నాన్న హంతకులకు శిక్ష పడే వరకూ సునీతకు తోడుగా ఉంటానని సొంత చెల్లి శపథం. వివేకా హత్యపై కడప రోడ్డుపై నిలబడి.. జగనన్న లక్ష్యంగా శరపరంపరగా సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలకు, జగనన్న దగ్గర జవాబు లేదు. ఇదే రేపటి ఎన్నికల్లో ‘అన్నయ పారీ’్టకి తగిలే సిస్టర్స్ సెంటి‘మంట’! మహిళా లోకంలో మొదలుకానున్న ఈ మహిళా సెంటి‘మంట’ను ‘అన్నయ్య పారీ’్ట ఎలా భరిస్తుందన్నదే ఆసక్తికరమైన ప్రశ్న.

హూ కిల్డ్ బాబాయ్?.. ఇది నాలుగేళ్ల నుంచి సోషల్‌మీడియాలో నలుగుతున్న ప్రశ్న. టీడీపీ యువనేత లోకేష్ సోషల్‌మీడియా వేదికగా, శరపరంపరగా జగన్‌కు సంధించిన ప్రశ్నాస్త్రాం. ఇప్పుడు మళ్లీ అదే ప్రశ్న.. అదే నినాదం ఎన్నికల వేళ తెరపైకొచ్చి, వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది.

కీలకమైన ఎన్నికల వేళ అధికార వైసీపీకి సిస్టర్స్ సెంటి‘మంట’ తప్పేలా లేదు. ఇది ఆ పార్టీ అధినేత-సీఎం జగన్‌కు శిరోభారంగా పరిణమించింది. అసలు రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు, కూటమి ప్రచారాస్త్రం కూడా ఇదే అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే జగన్ చెల్లెళ్లు షర్మిలారెడ్డి, సునీతారెడ్డి మళ్లీ వివేకానందరెడ్డితోపాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం హుకిల్డ్ బాబాయ్ అన్న చర్చను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లారు.

ఫలితంగా వీరంతా వివేకా హంతకుల గురించి గళమెత్తడంతో, వివేకా హత్య కేసుపై చర్చ మళ్లీ మొదలయింది. వివేకా హత్యపై తొలుత సీబీఐలో పిటిషన్ వేసిన జగన్.. సీఎం అయిన వెంటనే ఉపసంహరించుకోవడం వివాదానికి కారణమయింది. విపక్ష నేతగా ఉన్నప్పుడు చిన్నాన్న హత్యపై ఆవేదన వ్యక్తం చేసిన జగన్.. సీఎం అయిన తర్వాత ఒక్కసారి కూడా చిన్నాన్న కేసు గురించి మాట్లాడలేదు. గతంలో వేసిన సిట్, ఎస్పీని కూడా మార్చడం విమర్శలకు గురైన విషయం తెలిసిందే.

పైగా సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పైనే కడప జిల్లా పోలీసులు కేసు పెట్టడం, చెల్లెలు సునీత-ఆమె భర్తపైనే అనుమానం వచ్చేలా సొంత మీడియాలో కథనాలు రాయడం, అవినాష్ అరెస్టు కాకుండా అడ్డుపడటం వంటి పరిణామాలన్నీ.. చెల్లెళ్లకు అన్నయ్యపై అనుమానాలకు కారణమయ్యాయి. అది చాలదన్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వైసీపీ సోషల్‌మీడియా కలసి షర్మిల-సునీతపై చేసిన మూకుమ్మడి మాటల దాడి వారిని రోడ్డెక్కేలా చేసింది.

ఈ క్రమంలో వివేకా వర్థంతి సందర్భంగా.. ఆయన కూతురు డాక్టర్ సునీత చేసిన వ్యాఖ్యలు, వివేకా భార్య సౌభాగ్యమ్మ చేసిన ఆరోపణలు, వారికి మద్దతునిస్తూ షర్మిల చేసిన ప్రకటనలు.. మహిళాలోకంలో వివేకా కుటుంబానికి బోలెడు సానుభూతి సంపాదించి పెట్టాయి. ముగ్గురూ కలి‘విడి’గానే జగన్‌పై సమర శంఖం పూరించడం విశేషం. ఇద్దరు చెల్లెళ్లూ జగనన్న పార్టీకి.. హంతకుల పార్టీకి ఓటు వేయవద్దని బహిరంగంగానే పిలుపునివ్వడం సంచలనం సృష్టించింది.

తమను కాపాడాల్సిన అన్నయ్యనే హంతకులను రక్షిస్తున్నారని, తన తండ్రి హంతకులు అవినాష్‌రెడ్డి-భాస్కర్‌రెడ్డిని జగనన్న కాపాడుతున్నారని, జగన్‌కు అసలు బంధుత్వాలు-బాంధవ్యాల విలువ తెలుసా అని సంధించిన ప్రశ్నలు.. మహిళాలోకంలో వైసీపీ ఓట్లకు గండికొట్టేవేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జగన్ మీడియా రాసినట్లు తాము తండ్రిని హత్య చేస్తే.. అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదు? భారతీరెడ్డి మీ దగ్గర ఉన్న ఆధారాలు అప్పుడే పోలీసులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన సునీతకు ఇప్పటిదాకా జగన్ జవాబివ్వలేదు. తన తండ్రి అర్ధరాత్రి హత్యకు గురైతే, జగన్ సాయంత్రం దాకా ఎందుకు రాలేదన్న ప్రశ్నకు జగన్ వద్ద ఇప్పటికీ జవాబు లేకపోవడాన్ని మహిళా సమాజం నిశితంగా పరిశీలిస్తోంది.

పైగా జగన్ మీడియా-పార్టీ సోషల్‌మీడియాలో చెల్లెళ్లకు వ్యతిరేకంగా కథనాలు రాయడం బట్టి.. ఇద్దరి ఆడ కూతుళ్లను జగన్ పార్టీ అన్యాయంగా వే ధిస్తోందన్న భావన, గ్రామీణ మహిళల్లో బలంగా నాటుకునే ప్రమాదం కనిపిస్తోంది. ఇది ఎన్నికల నాటికి మరింత విస్తరించి, పట్టణ మహిళలల్లో కూడా బలపడి తే, తమ పార్టీకి మహిళా ఓట్లు మంగళం పలికినట్లేనని వైసీపీ సీనియర్లు నిజాయితీగా అంగీరిస్తున్నారు.

ఇప్పటికే సునీత-షర్మిల వ్యాఖ్యలు వీడియో రూపంలో సోషల్‌మీడియా ద్వారా మహిళల్లోకి వెళ్లిపోయాయి. ఇది పట్టణ ప్రాంత మహిళలపై విపరీతమైన ప్రభావం చూపించడం ఖాయమన్నది, వైసీపీ నేతల అసలు ఆందోళన. ఫలితంగా తండ్రి లేని ఇద్దరు మహిళలు.. అన్న చేసిన అన్యాయంపై ఒంటరిపోరు చేస్తున్నారన్న సానుభూతి వెల్లువెత్తడం, వైసీపీ అభ్యర్ధులలో ఆందోళన పెంచుతోంది. ఆ సానుభూతి తమ ఓట్లకు గండికొతాయన్నది వారి గుబులుకు ప్రధాన కారణం.

అయితే దాదాపు ఐదేళ్ల తర్వాత చిన్నాన్న హత్యపై జగన్ చేసిన వ్యాఖ్యలు, మహిళాలోకంలో బూమెరాంగవుతున్నాయి. అటు కడప జిల్లాలో కూడా ఆ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తమవుతుండటం విశేషం. ప్రధానంగా వివేకా హత్య కేసులో ముద్దాయిగా ఉండి, బెయిల్‌పై బయటకొచ్చిన ఎంపి అవినాష్‌రెడ్డి.. సీఎం జగన్ పక్కన ఉండటమే దానికి కారణం. చంద్రబాబునాయుడు సైతం చిన్నాన్న హంతకులను పక్కనపెట్టుకుని, జగన్ చిన్నాన్న హత్య గురించి మాట్లాడటాన్ని ఎద్దేవా చేయడం గమనార్హం.

 

 

LEAVE A RESPONSE