బలమైన చట్టాలు, వ్యవస్థ అవసరం!
– ఆ దిశలో ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే విధంగా వచ్చే సమావేశాల్లో చర్చ
– రాష్ట్ర శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ అండ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు
అమరావతి: బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారని, అటు వంటి సైబర్ క్రైమ్స్ నుండి అమాయకులను కాపాడేందుకు బలమైన చట్టాలు, వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయ పడుతున్నట్టు ఆ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణ రాజు తెలిపారు.
ఈ అంశంపై ప్రజలను, ప్రభుత్వాన్ని, ప్రభుత్వయంత్రాగాన్ని అప్రమత్తం చేసేందుకు వచ్చే శాసన సభ సమావేశాల్లో చర్చ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గురువారం రాష్ట్ర శాసన సభ భవనంలోని తమ ఛాంబరులో కమిటీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణు కుమార్ రాజుతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడిచేశారు.
ఈ సందర్బంగా రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ సైబర్ క్రైమ్ కి సంబంధించి భీమవరం నుండి తమ పిటీషన్స్ కమిటీకి ఒక ముఖ్యమైన పిటిషన్ వచ్చిందన్నారు. ఆ పిటీషన్ పై గురువారం జరిగిన శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో సుదీర్ఝ చర్చ జరిగిందన్నారు. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ద్వారా జరిగే సైబర్ క్రైమ్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ప్రజల జీవితాలు తారుమారు అయిపోతున్నాయని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే గత ఏడాది 950 మోసపోయినట్లు అధికార నివేదిక తెలుపుతుందన్నారు. అయితే, రాష్ట్రంలో ఎంత మంది మోసపోయారు అనే విషయం ఖచ్చితంగా తెలియదని, కానీ కొన్ని వేల మందికి పైనే మోసపోయి ఉండవచ్చని, దేశ స్థాయిలో ఎంత మంది మోసపోయారు అనే విషయం ఊహించడమే కష్టమన్నారు.
అయితే ఇంత తీవ్రంగా జరిగే సైబర్ క్రైమ్స్ నియంత్రణకు ఉన్న చట్టాలు, వాటిలో తీసుకురావాల్సిన మార్పులు, పోలీస్ శాఖ చేస్తున్న కృషి తదితర అంశాలపై కూలంకషంగా చర్చించినట్టు రాజు తెలిపారు. గతంలో ఉన్న గేమింగ్ చట్టం-2020 ప్రకారం స్కిల్ గేమ్ ను బ్యాన్ చేయడం సరికాదని కొందరు హైకోర్టుకు వెళ్లినప్పుడు, ఏది స్కిల్ గేమ్, ఏది లక్ గేమ్ అనేదాన్ని నిర్ణయించేందుకు ఒక కమిటీని వేయమని కోర్టు వారు ఆదేశాలను జారీచేసినట్టు తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా సమర్థించడంతో ప్రభుత్వం ఒక కమిటీ వేయగా, 2023 ఆగస్టులో ఆ కమిటీ నిర్ణయాన్ని వెలిబుచ్చినట్టు పేర్కొన్నారు. కమిటీ వెలిబుచ్చిన నిర్ణయాన్ని తెలియజేస్తూ గత ఏడాది ఆగస్టులో హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా నేటి వరకూ ఆ కేసు విచారణకు రాలేదన్నారు.
ఈ కేసు త్వరగా విచారణకు వచ్చే విధంగా ఆడ్వకేట్ జనరల్ ద్వారా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా సైబర్ నేరాల ద్వారా ప్రజలు మోసపోకుండా, ఆత్మ హత్యలు చేసుకోకుండా చూసేందుకై శాసన సభ ద్వారా సైబర్ చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు పర్చేందుకు సైబర్ పోలీస్ స్టేషన్ల సంఖ్యను కూడా పెంచడంతో పాటు పోలీసులు మరియు ఐ.టి. సాంకేతిక నిపుణులతో పటిష్టమైన నియంత్రణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
అదే విధంగా సైబర్ నేరాలకు ప్రజలు గురికాకుండా ఉండే విధంగా సైబర్ నేరాలపై సినీ నటులు, ప్రముఖుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన తెలిపారు. ఈ విషయాలపై మరింత లోతుగా చర్చజరిపి తగు చర్యలు తీసుకునే విధంగా వచ్చే నెల 18 వ తేదీన జరుగనున్న పిటిషన్ల కమిటీ సమావేశానికి ఐ.టి., హోం శాఖ ఉన్నతాదికారులు కూడా హాజరు కావాలని కోరినట్టు తెలిపారు.
అంతకు ముందుకు శాసన సభ కమిటీ హాల్లో చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘు రామకృష్ణ రాజు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, కమిటీ సభ్యుడు, శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు, పి.విష్ణు కుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు, హోం శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు.