Suryaa.co.in

Editorial

‘పువ్వు’ పార్టీలో ‘పొగాకు’ సెగ

– పురందేశ్వరికి తెలియకుండానే టుబాకో బోర్డు చైర్మన్ పదవి
– యశ్వంత్ నియామకంపై పురందేశ్వరి అభ్యంతరం
– తనకు తెలియకుండా ఎలా నియమిస్తారని అసంతృప్తి
– నియామకం ఆపాలంటూ సంతోష్‌జీకి ఫోన్?
– గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని ఒత్తిడి?
– అధ్యక్షుల సిఫార్సు ముఖ్యమని పార్టీ విధానం
– జూనియర్‌కు పెద్ద పదవిపై సీనియర్ల ఆగ్రహం
– సోము-మధుకర్‌రెడ్డి ఎలా సిఫార్సు చేశారన్న అసంతృప్తి
– నియామకంపై మోదీ,అమిత్‌షా,నద్దాకు జమ్ముల లేఖ?
– సోము, మధుకర్‌రెడ్డి సిఫార్సుతో యశ్వంత్‌కు బోర్డు చైర్మన్ పదవి
– ఏడాది క్రితమే సిఫార్సు చేశారంటున్న పార్టీ వర్గాలు
– ప్రభుత్వ నిర్ణయాలు పార్టీకి చెప్పాల్సిన పనిలేదంటున్న ఒక వర్గం
– యశ్వంత్‌కు గెజిట్ నోటిఫికేషన్ వస్తుందా? రాదా?
– నద్దా ఊ అంటారా? ఊహూ అంటారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

చదువు చారెడు.. బలపాలు దోశెడు అన్నది ఒక సామెత. ఏపీలో అర శాతం కూడా బలం లేని బీజేపీలో, ఆధిపత్యపోరు-నాయకుల సంఖ్యకు మాత్రం తక్కువ లేదు. రాష్ట్రంలో పార్టీ ఉనికి భూతద్దం వేసి వెతికినా కనిపించదు. కానీ వివాదాలకు మాత్రం కొదువ లేదు. అందుకే జనంలో లేని బీజేపీలో రోజూ కీచులాటలు, కయ్యాలు. అత్యంత కీలకమైన పొగాకు బోర్డు చైర్మన్ పదవి ఇప్పుడు పువ్వు పార్టీలో పొగ రాజేసింది.

టుబాకో బోర్డు చైర్మన్‌గా ప్రకాశం జిల్లాకు చెందిన యశ్వంత్‌ను నియమిస్తూ, కొద్దిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన మూడేళ్ల క్రితమే పార్టీలో చేరి, కిసాన్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ హయాంలో ఉధృతంగా సాగిన చేరికల పర్వంలో యశ్వంత్ ఒకరు. పొగాకు రైతాంగం సమస్యలపై అవగాహన ఉన్న యశ్వంత్, ఆ మేరకు బాగానే పనిచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే… ఆ మేరకు టుబాకో బోర్డు సభ్యుడి పదవికి అర్హుడెన యశ్వంత్, ఏకంగా బోర్డు చైర్మన్ పదవి దక్కించుకోవడం, సీనియర్లకు మింగుడుపడని వ్యవహారంగా మారింది. నిజానికి ఆయన పేరును, గత అధ్యక్షుడు సోము వీర్రాజు సిఫార్సు చేశారు. దానిని సంఘటనా మంత్రి మధుకర్‌రెడ్డిజీ ఆమోదించి, కేంద్రానికి పంపించారు.

అప్పట్లో సోము-మధుకర్‌రెడ్డి సమన్వయం బాగా ఉండేది. సోము వీర్రాజు-మధుకర్‌రెడ్డి-సునీల్ దియోథర్-విష్ణువర్దన్‌రెడ్డి ఒక టీముగా ఉండేవారు. వారికి ఢిల్లీ నుంచి, పూర్వ సంఘటనామంత్రి రవీంద్రరాజు ఆశీస్సులు ఉండేవన్న ప్రచారం ఉండేది. అది వేరే కథ.

అనంతపురంలో ఒక స్వామీజీ ఆశ్రమంలో నిధుల వ్యవహారం, పార్టీలో సంచలనం సృష్టించింది. దానివెనుక కొందరు అగ్రనేతలకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టాయంటూ అప్పట్లో మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఎవరికెంత వాటాలు అందాయో, పార్టీ వర్గాలు ఢిల్లీకి ఫిర్యాదులు చేశాయి. కానీ ఢిల్లీ నాయకత్వం అందరినీ కరుణించటంతో, మళ్లీ ఆ కథ బయటకురాలేదు.

ఆ మొత్తం వ్యవహారంలో లాభపడింది ఇద్దరు నాయకులయితే.. అప్రతిష్ఠ పాలయింది మాత్రం అప్పటి కీలక నేత అని, పార్టీ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి. ఆ కీలక నేతను వారిద్దరూ తక్కువగా సంతృప్తి పరిచినట్లు పార్టీ వర్గాల్లో ఇప్పటికీ ప్రచారం ఉంది. ఇది వేరే కథ.

నిజానికి బీజేపీలో ఎవరికైనా నామినేటెడ్ పదవులు రావాలంటే, ఆ రాష్ట్ర అధ్యక్షుల సిఫార్సు ప్రధానం. మూడేళ్ల క్రితమే దానిపై ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సిఫార్సు చేస్తే, సంఘటనా మంత్రి దానిని ఆమోదించి ఢిల్లీకి పంపిస్తారు. ఇదీ.. పార్టీలో పదవుల ప్రాతిపదిక!

ఎందుకంటే గతంలో నేతలు ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేసుకుని, రాష్ట్ర పార్టీకి తెలియకుండానే పదవులు తెచ్చుకోవడం విమర్శలకు దారితీసింది. దానితో రాష్ట్ర అధ్యక్షుడి సిఫార్సులే పదవులకు ప్రాతిపదిక అన్న నిబంధన రూపొందించారు.

ఆ ప్రకారంగా అప్పటి అధ్యక్షడు సోము వీర్రాజు-సంఘటనా మంత్రి మధుకర్‌రెడ్డి జమలి సిఫార్సులతో యశ్వంత్ పేరు ఢిల్లీకి వెళ్లింది. అయితే వివిధ కారణాల వల్ల ఏడాదిన్నర ఆ సిఫార్సు పెండింగ్‌లో ఉంది. అంతకుముందు ఆ పదవిలో ఉన్న కమ్మ వర్గానికి చెందిన సీనియర్ నేత ..యడ్లపాటి రఘునాధబాబు పదవీకాలం ముగియడంతో, ఆయన స్థానంలో ఎవరినీ నియమించకుండా అధికారిని నియమించారు.

మళ్లీ ఇప్పుడు హటాత్తుగా యశ్వంత్‌ను టుబాకో చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించడం, కమలంలో కల్లోలానికి కారణమయింది. కేంద్రమంత్రి పియుష్ గోయల్‌ను ప్రసన్నం చేసుకుంటేనే తప్ప, ఈ పదవి రాదు. అంటే యశ్వంత్ ఆ మేరకు, గోయల్‌కు సిఫార్సు చేయించుకున్నట్లు అర్ధమవుతుంది.

యశ్వంత్‌ను సోము వీర్రాజు- మధుకర్‌రెడ్డిజీ సిఫార్సు చేశారని తెలియడంతో, పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘కొత్తగా వచ్చిన వ్యక్తికి ఏ ప్రాతిపదికన సిఫార్సు చేశారు? రాష్ట్ర అధ్యక్షుడంటే ఏవో బలహీనతలు ప్రభావం చూపాయనుకోవచ్చు. కానీ సంఘటనా మంత్రికి ఏమైంది? నేతల పూర్వాపరాలు-అనుభవం పరిశీలించాల్సిన పనిలేదా? అధ్యక్షుడు ఏది సిఫార్సు చేస్తే, దానిని గుడ్డిగా ఢిల్లీకి పంపిస్తారా? అసలు ఆయనకు ఈ రాష్ట్రంలో సీనియర్ల గురించి ఏం తెలుసు’’ అని దశాబ్దాల నుంచి పనిచేస్తున్న నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

తనకు తెలియకుండానే యశ్వంత్‌కు చైర్మన్ పదవి ఇవ్వడాన్ని పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి సహించలేకపోతున్నారు. దీనిపై ఆమె పార్టీ జాతీయ సంఘటనా మంత్రి బీఎల్ సంతోష్‌జీకి ఫోన్ చేసి, తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నియామానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని, ఆమె ఒత్తిడి చేసినట్లు తె లుస్తోంది. యశ్వంత్ నియామక గెజిట్ నోటిఫికేషన్ ఆపాలంటే, ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవలసి ఉంటుంది.

సహజంగా నామినేటెడ్ పోస్టుల గెజిట్ వచ్చేందుకు, కొన్ని నెలల సమయం పడుతుంది. పీఎంఓ స్థాయిలో ఒత్తిడి చేస్తే తప్ప, అంత త్వరగా గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ ప్రకారంగా.. టుబాకో బోర్డు చైర్మన్ పదవికి సంబంధించి, పీఎంఓ జోక్యం చేసుకుంటుందా? అన్నది ప్రశ్న.

ఈలోగా రాష్ట్ర పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత జమ్ముల శ్యాంకిశోర్ టుబాకో బోర్డు నియామకంపై.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దా, జాతీయ సంఘటనా మంత్రి సంతోష్‌జీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. పార్టీకి దశాబ్దాల నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఎంతోమంది సీనియర్లు ఉండగా.. మూడేళ్ల క్రితమే పార్టీలో చేరిన యశ్వంత్‌కు చైర్మన్ పదవి ఇవ్వడం, సీనియర్ల మనోభావాలు గాయపరచడమేనని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

నిజానికి ఏపీలో పార్టీకి బలం లేకపోయినా, చాలామంది సీనియర్లు పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్నారు. వారు సైతం యశ్వంత నియామకంపై అసంతృప్తితో ఉన్నారు. మోదీ ప్రధాని అయి ఇన్నేళ్లయినప్పటికీ, రాష్ట్రం నుంచి పదవులు వచ్చిన వారి సంఖ్య అరడజనుకు మించకపోవడం గమనార్హం.

నామినేటెడ్ పదవులపై రాష్ట్ర ఇన్చార్జి నుంచి సంఘటనా మంత్రి వరకూ ఎవరూ దృష్టి సారించకపోవడమే దానికి కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు. ‘వీరంతా కూర్చుని నేతల జాబితాను ఫైనల్ చేసి జాతీయ పార్టీకి నివేదిస్తే పదవులు ఎందుకు రావు? కానీ వీళ్లంతా ఆ పని చేయరు. ఎందుకంటే ఎవరి అజెండాలు వారివి కాబట్టి’ అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

అయితే యశ్వంత్ నియామకంపై రాద్దాంతం చేయడాన్ని పార్టీలోని మరో వర్గం ఆక్షేపిస్తోంది. పార్టీ నిబంధనల ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడు-సంఘటనా మంత్రి సిఫార్సు చేసిన తర్వాతనే, యశ్వంత్ పేరు ఖరారు చేశారని గుర్తు చేశారు. పురందేశ్వరి అధ్యక్షురాలిగా వచ్చి మూడు నెలలే అయిందని, అయితే యశ్వంత్‌ను సిఫార్సు చేసి ఏడాదిన్నర అయిందని పార్టీ వర్గాలు గుర్తు చేశాయి.

అయినా పదవి వచ్చిన నాయకుడిని పిలిచి, పార్టీ పనులు చేయించుకోవడం బదులు.. అతనిని తొలగించాలని ఒత్తిడి చేయడం మంచిదికాదని, మరికొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. పదవి వచ్చిన కమ్మ సామాజికవర్గ నేతను, కమ్మ వర్గనేతలే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

‘అయినా కేంద్ర ప్రభుత్వం అన్ని నిర్ణయాలు పార్టీ అధ్యక్షులు, సీనియర్లకు చెప్పి తీసుకోవాలని ఆశించడం తప్పు. ఆ మాటకొస్తే పురందీశ్వరి నియామకం గురించి, జాతీయ నాయకత్వం ఎవరితో సంప్రదించలేదు. రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న కేంద్రమంత్రి మురళీధరన్ కూడా చెప్పలేదు కదా? పార్టీ వేరు-ప్రభుత్వం వేరన్న విషయం మర్చిపోతే ఎలా’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

అయితే ఇది అఖిల భారత చైర్మన్ స్థాయి పదవి కాబట్టి.. పార్టీ అధ్యక్షుడు నద్దా కూడా యశ్వంత్ నియామకంలో జోక్యం చేసుకుంటారు. ఇప్పటికే ఆయన నియామకంపై ఫిర్యాదులు అందాయి కాబట్టి, ఆ నియామకాన్ని రద్దు చేస్తారా? లేక గత కమిటీ సిఫార్సు చేసింది కాబట్టి దానినే ఆమోదిస్తారా? అన్నది చూడాలి. ఏదేమైనా ఇది పురందేశ్వరి ప్రతిష్ఠతో ముడిపడిన అంశంగానే కనిపిస్తోంది.

LEAVE A RESPONSE