– నాస్కామ్ ప్రతినిధులతో భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన
అమరావతి : దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ స్థితిగతులు, ఏపీలో టెక్ అవకాశాలపై నాస్కామ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. సోమవారం సచివాలయంలో నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ శ్రీనివాసన్ , నాస్కామ్ ఆర్ అండ్ డీ హెడ్ శివప్రసాద్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
ఐటీ రంగంలో ఏపీని ముందుకు తీసుకువెళ్లేందుకు స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యం ఉన్న మానవ వనరుల్ని ప్రోత్సహించాల్సిన అంశాలపై సీఎం నాస్కామ్ ప్రతినిధులతో చర్చించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ, ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో సాంకేతికత జోడింపు వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
ఐటీ పరిశ్రమకు అవసరమైన టెక్ నిపుణుల్ని తయారు చేసేందుకు టెక్ అప్రెంటీస్ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా నాస్కామ్ ను సీఎం కోరారు. ఆంధ్రప్రదేశ్ లో లక్ష మంది టెక్ అప్రెంటిస్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించటం ద్వారా ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను అందించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు.
విశాఖ, తిరుపతిలలో ఏఐ డిస్ట్రిక్ట్ టెస్ట్ బెడ్స్
విశాఖ, తిరుపతిలో జిల్లా స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రిక్ట్ టెస్ట్ బెడ్ ఏర్పాటుకు నాస్కామ్ ప్రతిపాదన చేసింది. భూ సంబంధిత అంశాలు, వైద్యారోగ్యం, విద్యా రంగాల్లో ఓపెన్ ఏఐ ల్యాబ్ లు ఏర్పాటు చేసి పౌరసేవల్ని అందించొచ్చని వెల్లడించింది.
బిల్డ్ ఇండియా ఇన్నోవేషన్ పైప్ లైన్ కార్యక్రమాన్ని బలోపేతం చేసేలా ఏపీలో గ్రామీణ టెక్ సొల్యూషన్స్ కు అవకాశం ఉందని నాస్కామ్ వివరించింది. వ్యవసాయం, వైద్యారోగ్యం, వాతావరణం ఇతర అంశాల్లో ఏఐ సాంకేతికతతో వందకు పైగా గ్రామీణ స్టార్టప్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు నాస్కామ్ ప్రతినిధులు సీఎంకు వివరించారు.