– ఉత్సాహంగా యోగ కార్యక్రమంలో భాగ స్వామ్యులు అవుతున్న యువత, మహిళలు
– రోజువారీ దిన చర్యలో భాగంగా యోగా
– జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
– ప్రతి ఒక్కరూ యోగ ప్రాధాన్యత తెలుసుకొని అనుసరించాలి: పితాని
పెనుగొండ (పశ్చిమ గోదావరి): యోగాను రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోవడంద్వారా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని, ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క మాత్ర లాగా పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
మంగళవారం ఉదయం పెనుగొండ మండల కేంద్రంలోని చారిత్రాత్మక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి దేవస్థానం ఆవరణ నందు యోగాంధ్ర- 2025లో భాగంగా సుమారు రెండు వేల మందితో నిర్వహించిన యోగా అభ్యాసన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర-2025 కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగపై అవగాహన కల్పించేందుకు జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన వశిష్ట గోదావరి వలందలరేవు ఒడ్డు న మే 27న యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించామన్నారు.
నేడు జూన్ మూడున పెనుగొండలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు వేల మంది వరకు భాగస్వాములై విజయవంతం చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు ఒక అరగంట వారి వారి రోజువారి ప్రణాళికలో యోగాను చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని, తద్వారా చేసే పనిలో ఆటంకాలు లేకుండా చేసుకోవచ్చునని తెలిపారు.అందరూ యోగాని తమ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా అనేక రుగ్మతలను దూరం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. ఆరోగ్యానికి ఒక్కొక్క ఆసనం ఒక మాత్రలా పనిచేస్తుందన్నారు. ప్రాణాయామం, బ్రమరి ఆసనాల ద్వారా తక్షణ ఫలితం కనిపిస్తుందని, మిగతా ఆసనాలు ఒకటి, రెండు రోజుల్లో ఫలితాలను ఇస్తాయన్నారు. యోగ సాధన అనేది మనస్సును లగ్నం చేయడంతో పాటు ఏకాగ్రత పెంచి జీవన విధానంలో క్రమశిక్షణ అలవరుస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,800 మంది యోగా శిక్షకులు ఉన్నారన్నారు.
ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భాగమైన యోగ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈనెల 21న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగ కార్యక్రమాలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ ను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా నేడు పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో యోగ అభ్యసన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారత ప్రభుత్వ ప్రతిపాదనతో 2014 సంవత్సరంలో 170 దేశాల ఆమోదంతో ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగిందన్నారు. యోగ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంకావాలన్నారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగ ప్రాధాన్యత తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నెలరోజుల పాటు యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రతిరోజు ఉదయం పూట ఎండలో ఉండడం ద్వారా డి విటమిన్ అందుతుందని, కూరగాయలు వంటి ఆహారం తీసుకోవడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటి అలవాట్లతో ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 7.84 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. 128 మందికి మాస్టర్ ట్రైనర్స్ గా యోగ పై శిక్షణ ఇవ్వడం జరిగిందని, వీరు 5,800 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, వీరు గ్రామ స్థాయిలో ప్రజలకు యోగ పై శిక్షణ అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, డీఎస్పీ డా.శ్రీ వేద, జిల్లా టూరిజం శాఖ అధికారి ఏ.వి అప్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, తహసిల్దార్ జి.అనిత కుమారి, ఎంపీడీవో టి.సూర్యనారాయణమూర్తి, గ్రామ సర్పంచ్ నక్క శ్యామల సోనీ, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారిణి, యోగ మాస్టర్ ట్రైనర్ బి.శిరీష, ఆయుష్ శాఖ యోగా గురువులు బడుగు చంద్రశేఖర్, పడాల రామచంద్రారెడ్డి యోగ విశిష్టతను వివరిస్తూ చెప్పిన ఆసనాలను ఆసక్తిగా వింటూ అనుసరించారు.